వైద్య సేవలో ఈసీ గంగిరెడ్డి (ఫైల్)
పులివెందుల: దివంగత డాక్టర్ ఈసీ గంగిరెడ్డి పేదల వైద్యుడిగా పేరు పొంది, ఎందరికో ఆదర్శనీయుడిగా నిలిచారు. ఆయన పులివెందులతోపాటు జిల్లాలో ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆయన హస్తవాసి తగిలితే ఎంతటి రోగమైనా ఇట్టే నయమవుతుందని ఈ ప్రాంత వాసుల నమ్మకం. ప్రముఖ వైద్యుడు డాక్టర్ ఈసీ గంగిరెడ్డి చిన్నపిల్లల డాక్టర్‌గా ప్రాచుర్యం పొందారు. 1949 ఏప్రిల్ 20న ఈసీ సిద్ధారెడ్డి, తులశమ్మ దంపతులకు రెండవ సంతానంగా వేముల మండలంలోని గొల్లలగూడూరులో జన్మించారు. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు గొల్లలగూడూరు ఆర్‌సీఎం స్కూలు, 6 నుంచి 8 వరకు పులివెందుల జెడ్పీ హైస్కూలు, 9 నుంచి 10వ తరగతి వరకు వేముల జెడ్పీ హైస్కూలులో చదివారు.
10వ తరగతిలో జిల్లా టాపర్‌గా నిలిచారు. ఎంబీబీఎస్, పీడీ వారణాసిలోని బెనారస్ యూనివర్సిటీలో పూర్తి చేశారు. అనంతరం పులివెందులలోని వైఎస్ రాజారెడ్డి ఆసుపత్రిలో వైద్య సేవలు ప్రారంభించారు. పులివెందులలోని శ్రీనివాస హాలు వీధిలో తన సతీమణి డాక్టర్ ఈసీ సుగుణమ్మతో కలిసి గంగిరెడ్డి ఆసుపత్రి స్థాపించి దంపతులిద్దరూ వైద్య సేవలు అందించారు. పులివెందులలోని గంగిరెడ్డి ఆసుపత్రి అంటే ఎంతో ప్రాచుర్యం పొందింది. వైద్యం చేయడమే ప్రధాన ఆశయంగా, ప్రతిఫలం ఆశించని డాక్టర్‌గా ఆయన గుర్తింపు పొందారు.
ఎలాంటి రోగమైనా ఆయన చేయి పడితే నయమవుతుందని పులివెందుల ప్రాంత ప్రజల నమ్మకం. ఈ ప్రాంత ప్రజలే కాకుండా జిల్లా నలుమూలల నుంచి, పక్క జిల్లాలైన అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాల నుంచి కూడా వచ్చి వైద్య సేవలు పొందారు. మారుతున్న కాలాన్ని బట్టి భాకరాపురంలో అత్యాధునిక వైద్య పరికరాలతో తన కుమారుడి పేరిట దినేష్ నర్సింగ్ హోం (ఈసీ గంగిరెడ్డి ఆసుపత్రి) స్థాపించి వైద్య సేవలు అందించారు. ఈసీ గంగిరెడ్డి కుమారుడు ఈసీ దినేష్‌రెడ్డి కూడా వైద్యునిగా సేవలు అందిస్తున్నారు. ఈసీ గంగిరెడ్డి తన దగ్గరకు వచ్చే రోగుల పట్ల ఎంతో ప్రేమ, ఆప్యాయతలను కనబరిచేవారు. ఉదయం 6 నుంచి రాత్రి 12 గంటల వరకు నిరంతరాయంగా వైద్య సేవలు అందించేందుకు తపన పడేవారు. దినేష్ నర్సింగ్ హోం ద్వారా అనేక ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి పేద ప్రజలకు సేవ చేశారు.
రాజకీయ ప్రస్థానం
డాక్టర్ ఈసీ గంగిరెడ్డి 2001 నుంచి 2005 వరకు పులివెందుల మండల ప్రెసిడెంట్‌గా ప్రజలకు సేవలు అందించారు. వైఎస్ కుటుంబం పోటీ చేసే ప్రతి ఎన్నికలలోనూ ఆయన తనవంతు పాత్ర పోషించారు. ఎన్నికల సమయంలో వైఎస్ కుటుంబానికి మద్దతుగా నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. 2003 రబీ సీజన్‌లో అప్పటి టీడీపీ ప్రభుత్వం రైతులకు విత్తనాలు సక్రమంగా సరఫరా చేయలేదని పులివెందుల నుంచి కడప కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేశారు.
నేడు ప్రత్యేక ప్రార్థనలు
దివంగత డాక్టర్ ఈసీ గంగిరెడ్డి తృతీయ వర్ధంతి వేడుకలు మంగళవారం పులివెందులలో ఘనంగా జరగనున్నాయి. డిగ్రీ కళాశాల రోడ్డులో గల వైఎస్సార్ సమాధుల తోటలో ఉన్న డాక్టర్ ఈసీ గంగిరెడ్డి ఘాట్ వద్ద మంగళవారం ఈసీ గంగిరెడ్డి, వైఎస్ కుటుంబీకులు నివాళులర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. అనంతరం స్థానిక భాకరాపురంలో గల దినేష్ నర్సింగ్ హోంలో ప్రత్యేక ప్రార్థనలు, అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment