ఉద్దానానికి ఊపిరి.. రూ.700 కోట్లతో మంచి నీటి పథకం.. | Uddanam Drinking water scheme ready for trial run by CM Jagan Govt | Sakshi
Sakshi News home page

ఉద్దానానికి ఊపిరి.. రూ.700 కోట్లతో మంచి నీటి పథకం..

Published Sun, Jun 11 2023 4:38 AM | Last Updated on Sun, Jun 11 2023 9:12 AM

Uddanam Drinking water scheme ready for trial run by CM Jagan Govt - Sakshi

శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి వద్ద నీటిని శుద్ధి చేసేందుకు ఏర్పాటు చేసిన ఫిల్టర్‌ బెడ్‌లు

ఇన్నాళ్లూ నిరాశ, నిస్పృహలకు లోనైన ఉద్దానం ప్రాంతంలో ఇప్పుడు కొత్త ఆశలు చిగురించాయి. పురాణాల్లో చెప్పినట్లు.. గంగను ఆకాశం నుంచి భూమి మీదకు తీసుకొచ్చేందుకు భగీరథుడు చేసిన యత్నాలను తలపిస్తూ.. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఎక్కడో వంద కిలోమీటర్ల దూరాన ఉండే హిరమండలం రిజర్వాయర్‌ నీళ్లను ఈ ప్రాంతానికి తీసుకొచ్చేందుకు చేపట్టిన పనులు చూసిన ఈ ప్రాంత వాసుల్లో మనకూ మంచి రోజులు వస్తున్నాయన్న ధీమా మొదలైంది.

మరోవైపు.. కిడ్నీ బాధితులకు చేరువలోనే వైద్య సేవలు అందించడానికి సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి, కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌ ఏర్పాటుతో కొండంత భరోసా కలుగుతోంది. వెరసి కిడ్నీ సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం దొరుకుతోందనే నమ్మకం, ధైర్యం, సంతోషం కనిపిస్తోంది. దాదాపు 40 ఏళ్లుగా తీవ్రంగా ఇబ్బంది పెట్టిన మహమ్మారి పీడ అతి త్వరలో విరగడవుతోంది. ఉద్దానం స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే సమయం ఆసన్నమైంది. 

ఉద్దానం ప్రాంతం నుంచి మేడికొండ కోటిరెడ్డి, వడ్డే బాలశేఖర్‌: శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో ప్రజలు కిడ్నీ వ్యాధి బారిన పడి అల్లాడుతుంటే గత ప్రభుత్వాలు మాటలతో మభ్యపెడితే.. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చిత్తశుద్ధితో వేసిన అడుగులు ఫలితాలివ్వడానికి సిద్ధమయ్యాయి. నాలుగు దశాబ్దాల తరబడి అపరిష్కృతంగా ఉన్న నీటి సమస్యను పరిష్కరించడానికి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే.. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు రూ.700 కోట్లతో సమగ్ర రక్షిత మంచినీటి పథకం మంజూరు చేశారు.

ఈ ప్రాజెక్టు ప్రస్తుతం ప్రారంభోత్సవ దశకు చేరింది. హిరమండలం నుంచి తాగునీటిని తరలించే ప్రక్రియలో ఉపయోగించే నీటి మోటార్లకు మూడు, నాలుగు రోజుల్లో ట్రయల్‌ రన్‌ మొదలవ్వనుంది. ఉద్దానం నుంచి వంద కిలోమీటర్లకు పైగా దూరం ఉండే హిరమండలం రిజర్వాయర్‌ నుంచి నీటిని తరలించడానికి రెండు సబ్‌ సేషన్ల నిర్మాణం కూడా పూర్తయింది. ఇందులో హిరమండలం వద్ద ఏర్పాటు చేసిన సబ్‌స్టేషన్‌కు గత (మే) నెల 24వ తేదీనే విద్యుత్‌ సరఫరా ప్రక్రియ పూర్తయింది.

హీరమండలం రిజర్వాయర్‌ నీటిని అక్కడికి 32 కిలోమీటర్ల దూరంలో ఉండే మెళియపుట్టి మండల కేంద్రం వద్దకు తరలించి.. శుద్ధి చేయడానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఫిల్టర్‌ బెడ్‌ల కేంద్రం సిద్ధమైంది. ఇక్కడ నీటిని శుద్ధి చేసిన అనంతరం ఆయా ప్రాంతాలకు తరలించడానికి మరో సబ్‌ స్టేషన్‌ నిర్మాణం కూడా ఇప్పటికే పూర్తయింది. దానికి ఈ నెల 15 నాటికి విద్యుత్‌ సరఫరా పూర్తవుతుందని అధికారులు వెల్లడించారు. ఆ తర్వాత ఉద్దానం ప్రాంతానికి తాగునీటి తరలింపు ప్రక్రియ మొదలు పెట్టడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ పథకంలో భాగంగా రెండు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో వివిధ గ్రామాల్లో మొత్తం 571 ఓవర్‌ హెడ్‌ ట్యాంకులు నిర్మించారు.
 
దీర్ఘకాలిక ప్రయోజనాలే లక్ష్యం  
ఉద్దానం ప్రాంతంలో అక్కడి భూగర్భ జలాలనే తాగునీటిగా ఉపయోగించడం వల్ల కిడ్నీ వ్యాధులు ప్రబలుతున్నాయనే వాదన ఉంది. ప్రజల్లో కూడా ఇదే విషయమై ఆందోళన ఉంది. అయితే ఇప్పుడు కూడా ఆ ప్రాంతంలో కొన్ని మంచినీటి పథకాలు ఉన్నా.. అవి ఎక్కువగా స్థానికంగా బోర్లు వేసి సరఫరా చేసేవే. మరోవైపు.. తక్కువ ఖర్చుతో ఉద్దానం ప్రాంత సమీపంలో ఉండే బహుదా, మహేంద్ర తనయ నదుల నుంచి రక్షిత నీటి సరఫరాకు అవకాశం ఉన్నా, వేసవిలో ఆ నదులు ఎండిపోతే ప్రజలు బోరు నీటిని తాగక తప్పదని జగన్‌ సర్కార్‌ ఆ ప్రతిపాదనను మొదట్లోనే పక్కన పెట్టింది.

ఏడాది పొడవునా నీరు అందుబాటులో ఉండేలా ఖర్చు ఎక్కువైనా సరే వెనుకాడకుండా హిరమండలం రిజర్వాయర్‌ నుంచి నీటి తరలింపునకు పూనుకుంది. ఉద్దానం ప్రాంతానికి ఏడాది పొడవునా టీఎంసీ కన్నా తక్కువ నీరే అవసరం ఉంటుంది. హిరమండలం రిజర్వాయర్‌ కనీస నీటి మట్టం 2.67 టీఎంసీలుండటం వల్ల ఉద్దానం ప్రాంతానికి నీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.  
 
జగన్‌ ప్రభుత్వ ‘భగీరథ’ యత్నం 
హిరమండలం రిజర్వాయర్‌ నుంచి ఉద్దానం ప్రాంతానికి నీటి తరలింపు అషామాషీ కాకపోయినా ప్రభుత్వం పట్టుదలగా పనులు చేపట్టి పూర్తి చేసింది. ఈ ప్రక్రియలో ఏకంగా 1,047 కిలోమీటర్ల పొడవునా భూగర్భ పైపులైన్ల నిర్మాణం చేశారు. రోజూ 8.40 కోట్ల లీటర్ల మేర తాగునీరు ఆ భూగర్భ పైపు లైను ద్వారా వెళ్లేలా పనులు చేపట్టారు. కేవలం రిజర్వాయర్‌ వద్ద ఏర్పాటు చేసిన రెండు భారీ మోటార్లు ఒక్కొక్కటి నిమిషానికి 28 వేలకు పైగా లీటర్ల నీటిని పంపింగ్‌ చేయగలవు.

ఈ నీరు ఎగుడు దిగుడు కొండలు, మైదాన ప్రాంతాలు దాటుకుంటూ.. మధ్యలో మరే మోటార్ల అవసరం లేకుండా 32 కి.మీ. దూరంలోని మెళియాపుట్టి శుద్ధి కేంద్రానికి చేరతాయి. అత్యవసర సమయాల్లో ఉపయోగించడానికి మూడో మోటార్‌ను అదనంగా ఏర్పాటు చేశారు. నీటి తరలింపు మార్గంలో వంశధార నది ఉండటంతో నదీ గర్భంలో దాదాపు అర కిలోమీటర్‌ మేర పైపు లైన్‌ నిర్మాణం చేశారు.

కొన్ని చోట్ల కొండలను తొలిచి పైప్‌లైన్‌ వేశారు. ఒక్కసారిగా 73 మీటర్ల ఎత్తుకు.. ఆపై 50 మీటర్లు దిగువకు.. మళ్లీ 147 మీటర్ల ఎత్తున ఉండే కొండపైకి.. మళ్లీ దిగువకు ఇలా పైప్‌లైన్‌ నిర్మాణం చేపట్టారు. మరోమాటలో చెప్పాలంటే భగీరథ యత్నమే చేశారు. ఈ ప్రాజెక్టు త్వరలో అన్ని పనులు పూర్తి చేసుకుని సీఎం చేతులమీదుగా ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. 

కరోనా లేకుంటే ఇప్పటికే అందుబాటులోకి..  
ఉద్దానం ప్రాంతంలో కంచిలి, ఇచ్ఛాపురం, కవిటి, సోంపేట, పలాస, వజ్రపుకొత్తూరు, మందస మండలాల్లోని గ్రామాల పరిధిలో కిడ్నీ సమస్య ఉంది. ఈ మండలాల్లో 7,82,707 మంది జనాభా నివసిస్తుంటారు. 1980 దశకం నుంచి ఉద్దానం ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న ఈ సమస్యకు అసలు కారణం ఏమిటన్నది ఇంత వరకు స్పష్టంగా నిర్ధారణ కానప్పటికీ.. ఆ ప్రాంత ప్రజలు తాగునీటి అవసరాలకు అక్కడి భూగర్భ జలాలు వినియోగించడం ఒక కారణం కావొచ్చనే నిపుణుల అనుమానాల మేరకే జగన్‌ ప్రభుత్వం నివారణ చర్యలు మొదలుపెట్టింది.

పలాస, ఇచ్చాపురం అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని రెండు మున్సిపాలిటీలతో పాటు 807 నివాసిత గ్రామాలకు సురక్షిత తాగునీటి సరఫరాకు ఉద్దేశించి ఈ మంచినీటి పథకానికి సీఎం జగన్‌ 2019 సెప్టెంబర్‌ 6న శంకుస్థాపన చేశారు. భవిష్యత్‌ అవసరాలను పరిగణనలో ఉంచుకుని 2050 నాటికి ఆ ప్రాంతంలో పెరిగే జనాభా అంచనాతో పౌరులు ఒక్కొక్కరికి రోజుకు వంద లీటర్ల చొప్పున ఏడాది పొడవునా ఈ పథకం ద్వారా రక్షిత మంచి నీరు సరఫరా చేసేలా ప్రభుత్వం ఈ పథకాన్ని డిజైన్‌ చేసింది.

భవిష్యత్‌లో శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం, మెళియాపుట్టి మండలాల పరిధిలో 170 నివాసిత ప్రాంతాలకు కూడా ఈ పైపులైన్‌ ద్వారా తాగునీరు అందించే అవకాశం ఉంది. ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన తర్వాతి సంవత్సరంలోనే కరోనా వ్యాప్తి మొదలైంది. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధింపు, మరుసటి ఏడాది కూడా రెండో దశ కరోనా వ్యాప్తి కారణంగా ప్రపంచమే స్తంభించిపోయింది. ఈ ప్రభావం మంచినీటి ప్రాజెక్టు, కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణంపైనా పడింది. ఈ సమస్య లేకుంటే ఇప్పటికే ప్రజలకు అందుబాటులోకి వచ్చి 
ఉండేది.  

బాబు, పవన్‌.. మాటలతోనే సరి  
గత చంద్రబాబు ప్రభుత్వం ఉద్దానం సమస్య పరిష్కారం పూర్తిగా పక్కన పెట్టిందనే చెప్పాలి. 2014లో టీడీపీ అధికారంలోకొచ్చాక తొలి మూడేళ్లు ఈ సమస్యను పరిష్కరించేందుకు ఒక్క చర్యా చేపట్టలేదు. చివరి ఏడాది 2018లో కేంద్ర పరిశోధన సంస్థ ఐసీఎంఆర్, జార్జ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ గ్లోబల్‌ హెల్త్‌ సంస్థలతో ఉద్దానం కిడ్నీ సమస్యపై పూర్తి స్థాయి అధ్యయనం చేయిస్తామని ప్రకటించారు. అదీ ప్రకటనకే పరిమితమైంది.  మిత్రపక్షంగా ఉన్న జనసేన  అధినేత పవన్‌కళ్యాణ్‌ 2018 మే లో ఒకట్రెండు రోజుల పాటు శ్రీకాకుళం జిల్లాలో దీక్షలంటూ హడావుడి చేశారు. ఆ తర్వాత అప్పటి సీఎం చంద్రబాబుతో  సమావేశమై ఆ సమస్యను వదిలేశారు.  

కిడ్నీ రోగులకు వరం వాటర్‌ గ్రిడ్‌ 
ఉద్దానం ప్రాంతంలో ఉన్నటువంటి 20 వేల మంది అన్ని రకాల కిడ్నీ రోగులకు వాటర్‌ గ్రిడ్‌ వరంగా మారబోతుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే పలాసలో కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్, రూ.700 కోట్లతో వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. సుమారు 232  గ్రామాలకు ట్యాంకులు ఏర్పాటు చేసి, ఇంటింటికీ కుళాయిల ద్వారా నదీ జలాలు అందించనున్నారు.

ఇదే జరిగితే భూగర్భంలో ఉన్నటువంటి సిలికాన్‌ కారణంగా కిడ్నీ వ్యాధులు వస్తున్నాయనే అనుమానాలు సైతం తొలగిపోతాయి. ఈ పథకం ప్రారంభం కావడం ద్వారా సీఎం వైఎస్‌ జగన్‌ మరింత మంది ప్రజల గుండెల్లో నిలిచిపోతారనడంలో ఎలాంటి సందేహంలేదు.  
    – రాపాక చిన్నారావు, గొల్లమాకన్నపల్లి, పలాస మండలం 

మహిళలకు పాట్లు తప్పుతాయి 
పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీతో పాటు పలాస నియోజకవర్గంలో అనేక గ్రామాలకు తాగునీటి సమస్య ఉంది. వాటర్‌ గ్రిడ్‌ ప్రారంభం అయితే మహిళలకు పాట్లు తప్పుతాయి. ఇంటికి కావాల్సిన తాగునీరుతో పాటు అదనంగా ఇచ్చే నీరు వాడుకలకు సరిపోతుంది. ప్రస్తుతం మున్సిపల్‌ ట్యాంకర్, పంట పొలాలు, బావులపై ఆధారపడి జీవిస్తున్న వారే అధికం.

ఎప్పుడు పథకం ప్రారంభం అవుతుందా అని వెయ్యి కళ్లతో చూస్తున్నాం. ఇప్పుడు ఆ రోజులు వచ్చాయి. వంశధార నది నుంచి వచ్చే తాగునీరు ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తుంది. పల్లెల్లో తాగునీటి కోసం అనేక కొట్లాటలు, గొడవలు జరుగుతున్నాయి. రూ.20 ఇచ్చి క్యాన్‌ కొనుగోలు చేయాలంటే అందరికీ కుదరదు. సీఎం జగన్‌ చర్యల వల్ల ఈ కష్టాలన్నీ తప్పుతాయి.  
    – దున్న నిర్మల, మొగిలిపాడు, పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement