ఇన్నర్‌వీల్ ప్రతినిధులతో శిక్షణపూర్తి చేసుకున్న ట్రాన్స్‌జెండర్లు
వారిది అర్ధనారీశ్వర జననం సొంత ఊరులేని... సొంత ఇల్లు లేని చివరకు అద్దె ఇల్లు కూడా దొరకని దైన్యం వారిది మాతృత్వం లేని స్త్రీత్వం మోడువారిన జీవితం అయినా మానవత్వం మూర్తీభవించిన వ్యక్తిత్వం ఆడామగా కాకపోతేనేం మనసున్న మనుషులు వాళ్లు. వెలివేసిన సమాజంలోనే సేవాగుణం చాటుతూ మానవతా పరిమళాలు వెదజల్లుతున్నారు. నిన్నటి వరకు యాచించిన ఆ చేతులు ఇప్పుడు సాయం చేసేందుకు ముందుకొస్తున్నాయి. సమాజ సేవలో మేముసైతం అంటూ శభాష్ అనిపించుకుంటున్న ట్రాన్స్‌జెండర్లపై ప్రత్యేక కథనమిదీ..
సికింద్రాబాద్: వైద్యరంగ సేవల్లో మేము సైతం అంటూ ముందడుగు వేస్తున్నారు అర్ధనారీశ్వరులు. ప్రస్తుతం అనేక రంగాల్లో ప్రతిభ చాటుతున్న హిజ్రాలను వైద్య సహాయకులుగా తీర్చిదిద్దే పనిని సికింద్రాబాద్ ఇన్నర్ వీల్ క్లబ్ చేపట్టింది. మంచాన పడిన రోగుల బాగోగులు చూసుకునేలా వీరికి ఉచితంగా శిక్షణ ఇస్తోంది. తొలి విడత ప్రయోగాత్మకంగా 15 మంది ట్రాన్స్‌జెండర్లకు శిక్షణ ఇచ్చి ఆసుపత్రుల్లో రోగుల సహాయకులుగా నియమించింది. కొంతమందికి వారి వారి ఆసక్తి మేరకు ఇతర రంగాల్లోనూ ఉపాధి అవకాశాలు చూపిస్తోంది.
బ్యాచ్‌కు 15 మంది చొప్పున..
►పంజగుట్ట ప్రాంతంలోని ఫ్యామిలీ ప్లానింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంస్థ భవనంలో శిక్షణ ఇచ్చారు. బీపీ చెక్ చేయడం, ధర్మామీటర్‌లో టెంపరేచర్ చూడటం, గ్లూకోజ్ టెస్టులు చేయడంలో శిక్షణ ఇచ్చారు. అలాగే, రోగులకు చంటిపాపల్లా స్నానపానాదులు చేయించడంలోనూ తర్ఫీదు ఇచ్చారు.
►గత ఏడాది ముగ్గురు ట్రాన్స్‌జెండర్లకు మాత్రమే శిక్షణ ఇచ్చిన ఇన్నర్‌వీల్ క్లబ్ తాజాగా 15 మందితో కూడిన బ్యాచ్‌కు శిక్షణ ఇచ్చింది. ఉస్మానియా ఆసుపత్రితోపాటు నగరంలోని పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో ట్రాన్స్‌జెండర్లు రోగుల సహాయకులుగా విధుల్లో చేరారు.
►వైద్యసేవకులుగా మరింత మంది హిజ్రాలకు శిక్షణ ఇచ్చేందుకు ఇన్నర్‌వీల్ క్లబ్ రెండో జట్టును సిద్ధం చేసింది. 15 మందితో కూడిన ఈ బృందానికి వారం రోజుల్లో శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నాయి.
►మూడు నెలలకోమారు 15 మంది చొప్పున హిజ్రాలను ఎంపిక చేసి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. వారిని క్రమేణా వైద్య సేవకులుగా మార్చేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు.
గర్వంగా ఉంది: స్మిత, ట్రాన్స్‌జెండర్
సమాజంలో ట్రాన్స్‌జెండర్లు అంటేనే చిన్నచూపు. ఉపాధి కోసం సమాజం చీదరించుకునే వృత్తుల్లో చేరక తప్పని పరిస్థితులు ఉండేవి. విద్యావంతులైన హిజ్రాలు పెద్ద ఉద్యోగాల్లో చేరుతున్నారు. పాఠశాల విద్యకే పరిమితమైన హిజ్రాలు రోగుల అటెండర్లుగా చేరడం గర్వంగా ఉంది.
నష్టం వాటిల్లదు: రోజీ, ట్రాన్స్‌జెండర్
రోగుల సేవకులే కాకుండా వివిధ వృత్తుల్లో చేరి ఉపాధి మార్గాలు ఎంచుకునేందుకు ఎక్కువ మంది ట్రాన్స్‌జెండర్లు ముందుకు వస్తున్నారు. కానీ వారి సేవలను వినియోగించుకునే సమాజం కావాలి. ట్రాన్స్‌జెండర్ల సేవలు వినియోగించుకోవడం ద్వారా ఎటువంటి నష్టం వాటిల్లదన్న విషయంపై సమాజంలో అవగాహన కలిగించాలి.
గౌరవం చేకూర్చాలన్నదే లక్ష్యం
సమాజానికి దూరంగా బతకడంతోపాటు, సమానత్వాన్ని పొందలేకపోతున్న ట్రాన్స్‌జెండర్స్‌కు గౌరవం చేకూర్చేందుకే వైద్యసేవల్లో శిక్షణ ఇచ్చే కార్యక్రమానికి అంకురార్పణ చేశాం. యాచకత్వం, సెక్స్ వృత్తులకు వారిని దూరం చేసి సేవాతత్పరతతో కూడిన వృత్తిని అందించాలన్న ఆశయంతో చేపట్టిన ప్రయోగం సత్ఫలితాలను ఇస్తోంది. క్రమేణా ఎక్కువ సంఖ్యలో ట్రాన్స్‌జెండర్లను ఈ వైద్య సేవల్లోకి తేవాలన్నదే మా లక్ష్యం.
– జయంతీకన్నన్, ఇన్నర్‌వీల్స్ క్లబ్ అధ్యక్షురాలు
Comments
Please login to add a commentAdd a comment