కంటోన్మెంట్: ప్రజలకు వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం మారేడ్ పల్లి లోని తన నివాసం వద్ద ప్రభుత్వ, రెడ్ క్రాస్ సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించనున్న మొబైల్ మెడికల్ యూనిట్ వాహనాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డాక్టర్లు అందుబాటులో లేని ప్రాంతాలు, పేదలు నివసిస్తున్న ప్రాంతాల్లో ఈ వాహనం ద్వారా 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఉచితంగా వైద్య సేవలు అందించనున్నట్లు తెలిపారు.
అవసరమైన మందులు కూడా ఉచితంగానే అందజేస్తామన్నారు. 14 జిల్లాలలో ఈ తరహా 17 వాహనాల ద్వారా ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ వాహనంలో డాక్టర్, నర్స్, టెక్నీషియన్, అసిస్టెంట్ ఉంటారన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పేదలు అధికంగా నివసించే ప్రాంతాల్లో బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించడమే కాకుండా 57 రకాల వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
అన్ని రకాల ప్రభుత్వ వైద్య సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ప్రజలు ఈ సేవలను సది్వనియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ సీఈఓ మదన్ మోహన్, కో ఆర్డినేటర్ స్వర్ణలత, అడ్వైజర్ శ్రీనివాస్, వికలాంగుల సంక్షేమ శాఖ ఏడీ రాజేందర్, సీనియర్ సిటిజన్ సహదేవ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment