సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రజలందరూ ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలన్నది సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్ష. ఇందుకోసం వైద్య రంగంలో పలు సంస్కరణలు ప్రవేశపెట్టారు. వైద్యాన్ని ప్రజల చెంతకు తీసుకెళ్తున్నారు. గ్రామాల్లోనే వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులను అత్యాధునికంగా తీర్చి దిద్దుతున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రజల్లో కంటి సమస్యలతో బాధ పడుతున్నవారి కోసం వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టారు. మూడు విడతల్లో కంటి పరీక్షలు చేసి, అవసరమైన వారికి మందులు, కళ్లద్దాలు ఇచ్చారు. శస్త్ర చికిత్సలు అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయించారు.
ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉంటే వారికి ఇప్పుడు నిర్వహిస్తున్న ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ వైద్య శిబిరాల్లో కంటి పరీక్షలు చేస్తున్నారు. గత నెల 30వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ వైద్య శిబిరాల్లో మంగళవారం వరకు 35 లక్షల మందికిపైగా వైద్య సేవలు పొందారు. వీరిలో 5,26,045 మంది వివిధ రకాల కంటి సమస్యలతో బాధపడుతున్నట్టు వైద్యులు గుర్తించారు. వీరిలో 1,57,614 మందికి మందులతో నయమయ్యే సమస్యలేనని తేల్చారు. వారందరికీ అవసరమైన మందులు ఇచ్చారు.
మరో 3,12,478 మందికి కళ్లద్దాలను సూచించారు. వీరందరికీ కళ్లద్దాలను వైద్య శాఖ అందిస్తోంది. 55,953 మందిని తదుపరి వైద్యం కోసం ఆస్పత్రులకు పంపించారు. 48,507మందికి కాటరాక్ట్ శస్త్ర చికిత్సలు అవసరమని నిర్ధారించారు. తదుపరి వైద్యం, కాటరాక్ట్ సర్జరీలు అవసరమున్న వారిని స్థానిక పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్,సీహెచ్‌వో, ఏఎన్‌ఎంలకు మ్యాప్ చేశారు. వీరందరికీ వైద్యం అందిస్తున్నారు. వీరంతా కంటి సమస్యలు తొలగి పూర్తిస్థాయి చూపుతో తిరిగి ఇళ్లకు చేరుకోనున్నారు.
నంద్యాల జిల్లా కొలిమిగుంట్ల మండలం బెలుం గ్రామానికి చెందిన బాలసంటి వయసు 90 ఏళ్లు పైనే. చూపు మందగించడంతో గతంలో కంటి పరీక్ష చేయించుకుని అద్దాలు కొనుక్కున్నాడు. మళ్లీ కొన్నాళ్లుగా కళ్లు సరిగా కనిపించక ఇబ్బంది పడుతున్నాడు. ఇటీవల గ్రామంలోనే ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరానికి వెళ్లాడు. వైద్యులకు తన సమస్య వివరించాడు. కంటి పరీక్షలు చేసిన వైద్యులు ఆయనకు చికిత్స అందించారు. ఇప్పుడు బాలసంటి ఉల్లాసంగా ఉన్నాడు.
బాలసంటిలానే కంటి సమస్యలతో బాధపడుతూ ఆస్పత్రుల వరకూ వెళ్లలేని వారికి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఓ వరంగా మారింది. ఈ కార్యక్రమంలో తాము ఉంటున్న ఊరిలోనే కంటితో పాటు, ఇతర వైద్య సేవలు అందుబాటులోకి రావడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రైవేటు వైద్యుల సేవలు కూడా...
రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు 800 ఆరోగ్య సురక్ష శిబిరాలు నిర్వహిస్తున్నాం. ఈ క్రమంలో పెద్ద ఎత్తున కంటి వైద్యులు అవసరం. మన రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులతో పాటు తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా వైద్యులను పిలిపించాం. కంటి సమస్యల బాధితులకు అవసరమైన మందులను శిబిరాల్లోనే అందిస్తున్నాం. అద్దాలు అవసరమైన వారికి స్థానిక విక్రేతల ద్వారా అందజేస్తున్నాం. క్యాటరాక్టర్ సర్జరీలు అవసరమున్న వారిని ప్రభుత్వ, ప్రైవేటు, ఎన్‌జీవో ఆస్పత్రులకు తరలించి ఉచితంగా సర్జరీలు చేయిస్తున్నాం. – డాక్టర్ వెంకటేశ్వర్, డైరెక్టర్, డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ సర్విసెస్
Comments
Please login to add a commentAdd a comment