బీజింగ్: అత్యాధునిక వైద్య విధానాలతో అత్యవసర, ఆకస్మిక వైద్య సేవలు సైతం క్షణాల్లో అందుబాటులోకి వస్తాయని నిరూపితమైంది. చైనాలోని మారుమూల కష్కర్ ఛాతి ఆస్పత్రి ఈ ఘటనకు వేదికగా నిలిచింది. 5జీ టెక్నాలజీ సాయంతో వైద్యుడు 5,000 కిలోమీటర్ల దూరంలోని ఊపిరితిత్తుల రోగికి విజయవంతంగా శస్త్రచికిత్సచేయడం విశేషం. టెక్నాలజీకి ఆధునిక వైద్యవిధానాలు జోడిస్తే అద్భుతాలు సంభవిస్తాయని మరోసారి రూఢీ అయింది.
వాయవ్య చైనాలోని గ్జిన్‌జియాంగ్ ప్రావిన్స్‌లోని మారుమూల కష్కర్ ఛాతి ఆస్పత్రిలో నూతన 5జీ సర్జికల్ రోబోట్ వ్యవస్థను ఏర్పాటుచేశారు. ఊపిరితిత్తుల్లో కణతితో బాధపడుతున్న రోగికి రోబో శస్త్రచికిత్స చేసేందుకు ఇక్కడి నుంచి 5,000 కిలోమీటర్ల దూరంలోని షాంఘై నగరంలోని శస్త్రచికిత్స నిపుణుడు డాక్టర్ లూ క్వింగ్‌క్వాన్ సిద్ధమయ్యారు. పలు రోబో చేతులు అమర్చిన 5జీ ఆధారిత రోబోటిక్ సర్జరీ వ్యవస్థను సునాయసంగా వాడుతూ కేవలం గంటలో రోగి శరీరంలోని కణతిని విజయవంతంగా తొలగించారు.
భారత్‌లోనూ సేవలు మొదలు: ఇలాంటి సేవలు భారత్‌లోనూ అందుబాటులోకి వచ్చాయి. ఎస్‌ఎస్‌ఐ మంత్ర ఈ సేవలను చేరువచేసింది. ఐదు రోబో చేతులున్న ఈ వ్యవస్థతో గుండె ఆపరేషన్లనూ చేయొచ్చు. వైద్యుని ముందు 32 అంగుళాల మానిటర్, ఒక 3డీ విజన్ ఉంటాయి. ఇందులో ఒక భద్రతా కెమెరానూ బిగించారు. ఆపరేషన్ చేస్తూ వైద్యుడు మధ్యలో తల పక్కకు తిప్పగానే రోబో ఆపరేషన్‌ను ఆపేస్తుంది. శస్త్రచికిత్సలో ఒక్క సెకన్ కూడా పొరపాట్లు, తప్పిదాలు జరగకూడదనే ఉద్దేశంతో ఈ జాగ్రత్త ఏర్పాటుచేశారు. 8 మిల్లీమీటర్ల సన్నని ఉపకరణాలతో రోబో చేతులు చకచకా ఆపరేషన్ చేసేస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment