సాక్షి, హైదరాబాద్: బాలికా విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొంటున్న రాష్ట్రంలో వివిధ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఫీజులో బాలికలకు రాయితీ మాత్రం ఇవ్వడం లేదు. కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయి ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్‌డ్ వంటి ప్రవేశ పరీక్షల్లో బాలికలకు ఫీజు రాయితీ ఇస్తున్నా, రాష్ట్రంలో మాత్రం ఆ దిశగా ఆలోచనలు చేయడం లేదు.
రాష్ట్రంలో వివిధ వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు ఇటీవల జారీచేసిన నోటిఫికేషన్లలో బాల బాలికలకు ఒకే రకమైన ఫీజు విధానం ప్రకటించింది. అయితే కేంద్ర విద్యా సలహా మండలికి (కేబ్) చైర్మన్‌గా, విద్యాశాఖ మంత్రిగా ఉన్న కడియం శ్రీహరి ఫీజు రాయితీపై ఆలోచన చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ప్రస్తుతం జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫీజు బాలురకు రూ.2,600 ఉండగా, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, బాలికలకు రూ.1,300 గా నిర్ణయించింది.
ఇక జేఈఈ మెయిన్‌లో రెండు పేపర్లకు బాలురకు రూ.1,800 ఫీజు ఉంటే, బాలికలకు రూ.900 రిజిస్ట్రేషన్ ఫీజుగా తీసుకుంటోంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఎంసెట్, ఈసెట్, పీజీఈసెట్, ఐసెట్ తదితర సెట్స్ ఫీజును మాత్రం బాల బాలికలకు ఒకేలా నిర్ణయించింది. ఎంసెట్ అగ్రికల్చర్ లేదా ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఏదేని ఒక పరీక్ష రాసే వారిలో ఎస్సీ, ఎస్టీలకు రూ. 400 ఉంటే ఇతరులకు రూ.800గా నిర్ణయించింది.
ఇందులో వికలాంగులకు, బాలికలకు ప్రత్యేకంగా ఎలాం టి రాయితీ కల్పించలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో బాలికా విద్యను ప్రోత్సహించేందుకు బాలికలకు ఫీజు రాయితీ ఇవ్వాలని తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment