తనకు జరిగిన అన్యాయాన్ని తెలియజేస్తున్న బాధితురాలు గిరిజన విద్యార్థిని సునీత
విశాఖపట్నం, చోడవరం: తాను కాలేజీలో చదవక పోయినా ఫీజు చెల్లించాలని వేధిస్తుండడంతో పాటు తన ఇంటర్ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని ఓ గిరిజన విద్యార్థిని చోడవరం తహసీల్దార్, పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేసింది. కొయ్యూరు మండలం బట్టపనుకుల గ్రామానికి చెందిన బాధిత విద్యార్థిని జంపా సునీత కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. 2016లో తాను ఇంటి వద్ద ఉండగా చోడవరం ఫోర్ ఎస్ కాలేజీకి చెందిన కొంత మంది సిబ్బంది వచ్చి తమ కాలేజీలో డిగ్రీ చదవడానికి చేరాలని కోరారని చెప్పింది. అప్పటికే తాను ఇంటర్ పూర్తిచేయడంతో డిగ్రీ బీకాంలో చేరాలని భావించానని, అయితే కాలేజీకి వచ్చి వివరాలన్నీ ఇస్తానని చెప్పినప్పటికీ తనపై ఒత్తిడి చేసి ముందుగా టెన్త్, ఇంటర్ సర్టిఫికెట్లు ఇస్తేనే కాని సీటు రిజర్వు చేయలేమని చెప్పి సర్టిఫికెట్లు తీసుకెళ్లారని తెలిపింది. ఆ తర్వాత మా కుంటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల నేను ఆ కాలేజీతో పాటు ఏ కాలేజీలోనూ చేరలేదని చెప్పింది.
ఇచ్చిన సర్టిఫికెట్ల కోసం కాలేజీకి వెళదామంటే చార్జీలకు కూడా డబ్బులేకపోవడంతో కొన్ని రోజుల తర్వాత కాలేజీకి వెళ్లి తన సర్టిఫికెట్లు ఇవ్వమని అడిగానని, ఏడాది ఫీజు రూ.15వేలు చెల్లిస్తేనే కాని సర్టిఫికెట్లు ఇవ్వబోమని కాలేజీ యాజమాన్యం చెప్పిందని తెలిపింది. ఎంత ప్రాథేయపడినా ఇవ్వలేదని ఆమె వాపోయింది. ఈవిషయాన్ని తన కుటుంబసభ్యులకు చెప్పానని, అంత డబ్బులేకపోవడంతో ఇప్పటి వరకు రాలేదని, తమ గ్రామంలో ఇంటర్ చదువుపై ఉద్యోగ అవకాశం రావడంతో సర్టిఫికెట్లు కావలసి ఉండడంతో మళ్లీ కాలేజీ వెళ్లి అడిగితే ఇప్పుడు రూ.30వేలు చెల్లించమంటున్నారని తెలిపింది. నేను కాలేజీలో చేరకుండా, కనీసం ఒక్కరోజు కూడా కాలేజీకి వెళ్లకుండా, ఎక్కడా సంతం చేయకపోయినా ఎలా ఫీజు అడుతున్నారో అర్థం కావడం లేదని, తన సర్టిఫికెట్లు అన్యాయంగా ఉంచేసుకున్న ఫోర్ ఎస్ కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరింది. ఈ విషయమై చోడవరం డిప్యూటీ తహసీల్దార్‌కు, పోలీసులకు ఫిర్యాదు చేశానని, తనకు న్యాయం చేసి ఇంటర్, టెన్త్ సర్టిఫికెట్లు ఇప్పించాలని సునీత కోరింది.
Comments
Please login to add a commentAdd a comment