ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్:
విద్యార్థులను దోచుకునేందుకు పరీక్ష ఫీజుల్ని సైతం అడ్డంపెట్టుకుంటున్నాయి కళాశాలల యాజమాన్యాలు. ప్రభుత్వం ప్రకటించిన పరీక్ష ఫీజుకు మూడు రెట్లు ముక్కుపిండి వసూలు చేస్తున్నాయి. రాష్ట్ర విభజనను నిరసిస్తూ ఉద్యోగులంతా ఆగస్టు 13 నుంచి నిరవధిక సమ్మెలో కొనసాగుతున్నారు. రెండు నెలలుగా జీతాల్లేవు. ఈ పరిస్థితుల్లో ఉద్యోగుల పిల్లల నుంచి కూడా ప్రైవేటు కాలేజీలు బలవంతంగా అదనపు ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఇంటర్మీడియెట్ విద్యార్థులు పరీక్ష ఫీజుగా రూ 300 మాత్రమే చెల్లిం చాల్సి ఉండగా యాజమాన్యాలు బలవంతంగా వెయ్యి రూపాయలు వసూలు చేస్తున్నాయి. ఈవిధంగా జిల్లావ్యాప్తంగా విద్యార్థుల నుంచి అక్రమంగా రూ 3 కోట్ల అదనపు వసూళ్లకు తెగబడ్డారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తేటతెల్లమవుతుంది.
జిల్లాలో 2013-14 విద్యా సంవత్సరంలో 30 ప్రభుత్వ, 15 ఎయిడెడ్, 110 అన్ ఎయిడెడ్ కాలేజీల్లో మొత్తం 50,642 మంది విద్యార్థులు ఇంటర్మీడియెట్ పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో 24,847 మంది మొదటి సంవత్సరం విద్యార్థులు కాగా 25,795 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు. ప్రభుత్వ, ఎయిడెడ్ కాలేజీల్లో నిర్ణీత పరీక్ష ఫీజునే వసూలు చేస్తుండగా ప్రైవేటు కాలేజీలు మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి. మూడు రెట్లు అదనంగా వసూళ్లకు పాల్పడుతున్నాయి. ఇంటర్ సెకండియర్ సైన్స్ విద్యార్థుల నుంచి ప్రాక్టికల్స్ ఫీజులు ప్రభుత్వం నిర్ణయించిన దానికంటే రెట్టింపు వసూలు చేస్తున్నాయి. ద్వితీయ సంవత్సరం సైన్స్ విద్యార్థులు 17,500 మంది (ఎంపీసీ, బైపీసీ) నుంచి ప్రాక్టికల్స్ ఫీజుగా ఒక్కో విద్యార్థికి రూ 100 వసూలు చేయాల్సి ఉండగా నిర్బంధంగా రూ 200 వసూలు చేస్తున్నారు.
రూ 3 కోట్ల అక్రమ వసూళ్లు
మొదటి సంవత్సరం విద్యార్థులు పరీక్ష ఫీజు దరఖాస్తు ఫారంతో కలిపి రూ 300 చెల్లించాల్సి ఉండగా వారి నుంచి రూ 1,000 వసూలు చేస్తున్నారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు రూ 300 పరీక్ష ఫీజు కట్టాల్సి ఉండగా వెయ్యి రూపాయలు, సైన్స్ విద్యార్థులైతే పరీక్ష ఫీజు, ప్రాక్టికల్ ఫీజుతో కలిపి రూ 400 కట్టాల్సి ఉండగా రూ 1200 వసూలు చేస్తున్నారు.
సైన్స్ విద్యార్థులు ఎంపీసీ అయితే 60 మార్కులకు, బైపీసీ అయితే 120 మార్కులకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తారు. ప్రాక్టికల్ మార్కులు వారికి కీలకం. మంచి మార్కులు వచ్చేలా ప్రాక్టికల్స్‌లో ‘మేనేజ్’ చేసేందుకు, రాత పరీక్షలో సాయం చేసేందుకు అదనంగా ఫీజులు వసూలు చేస్తున్నట్లు తల్లిదండ్రులకు చెప్పి వారిని ఒప్పించేందుకు యాజమాన్యాలు ప్రయత్నిస్తున్నాయి. దసరా సెలవులకు ఇళ్లకు వెళ్లిన విద్యార్థులు తిరిగి ఈనెల 17న కాలేజీలకు వచ్చే రోజు పరీక్ష ఫీజుతో రావాలని యాజ మాన్యాలు ఆదేశించాయి.
అదనపు వసూళ్లకు పాల్పడితే చర్యలు
ఇంటర్మీడియెట్ విద్యార్థుల నుంచి ఇంటర్మీడియెట్ బోర్డు నిర్దేశించిన ఫీజునే వసూలు చేయాలి. పరీక్ష ఫీజు పేరుతో కళాశాలల యాజమాన్యాలు అక్రమంగా వసూళ్లకు పాల్పడితే చర్యలు తప్పవని ఇంటర్మీడియెట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి (ఆర్‌ఐఓ) పి.మాణిక్యం హెచ్చరించారు. అదనపు ఫీజులు వసూలు చేసే కళాశాలల గురించి తమకు ఫిర్యాదు చేస్తే వాటిపై చర్యలు తీసుకుంటామన్నారు. అదనపు ఫీజులు వసూలు చేస్తున్నట్లు తనకు కొందరు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
పరీక్ష పేరుతో అక్రమ వసూళ్లు
Published Sat, Oct 12 2013 3:11 AM | Last Updated on Fri, Nov 9 2018 4:45 PM
Advertisement
Advertisement