10 రోజులపాటు సీబీటీ విధానంలో నిర్వహణ
రెండు పేపర్లకు కలిపి 2,75,753 మంది దరఖాస్తు
ఫిబ్రవరిలో డీఎస్సీ వేస్తామని ప్రకటించిన ప్రభుత్వం
కోటి ఆశలతో పుస్తకాలతో కుస్తీ పడుతున్న అభ్యర్థులు
ఇంకా భర్తీ కావాల్సిన టీచర్ పోస్టులు 17 వేలు
రాష్ట్రంలో ఇప్పటికే 3 లక్షల మంది టెట్ అర్హులు
సాక్షి, హైదరాబాద్: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) పరీక్షలు నేటి నుంచి ప్రారంభమవుతున్నాయి. 10 రోజుల పాటు 20 సెషన్లలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈసారి టెట్ పేపర్–1కు 94,327 మంది, పేపర్–2కు 1,81,426 మంది దరఖాస్తు చేసుకున్నారు. రోజూ ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు రెండో సెషన్ పరీక్ష ఉంటుంది. టెట్ కోసం 17 జిల్లాల్లో 92 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.
డీఎస్సీపై కోటి ఆశలు: ఫిబ్రవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రభుత్వం జాబ్ క్యాలెండర్‌లో ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో గత ఏడాది 11 వేల టీచర్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. ఇంకా 17 వేల పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. దీంతో టీచర్ ఉద్యోగార్థులు కొండంత ఆశతో పుస్తకాలతో కుస్తీ పడుతూ ప్రిపేరవుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే టెట్ అర్హత సాధించినవారు దాదాపు 3 లక్షల మంది ఉన్నా రు.
డీఎస్సీలో టెట్‌కు వెయిటేజీ ఉండటంతో వీరిలో కొంతమంది స్కోర్ పెంచుకునేందుకు మళ్లీ టెట్ రాస్తున్నారు. టెట్ అర్హత లేనివారు ఈసారి ఎలాగైనా అర్హత సాధించాలని కష్టపడుతున్నారు. ప్రైవేటు స్కూళ్లలో పనిచేసే టీచర్లు కూడా టెట్, డీఎస్సీ కలిపి కోచింగ్ తీసుకుంటున్నారు. హైదరాబాద్ కేంద్రంగా టెట్, డీఎస్సీ కోసమే 418 కోచింగ్ కేంద్రాలు వెలిశాయి. ఇవి కాకుండా కొన్ని ఆన్‌లైన్ కోచింగ్ ఇస్తున్నాయి.
ఈసారి టెట్ పరీక్షలో ఇంటర్ వరకూ సిలబస్‌ను తీసుకొచ్చారు. జా తీయ విద్యా విధానంలో మానసిక బోధన విధానానికి అత్యంత ప్రాధాన్యమిస్తుండటంతో.. ఆ కోణంలోనూ టెట్ ప్రశ్న పత్రాన్ని రూపొందించినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment