సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన షెడ్యూల్ సోమవారం విడుదల కానుంది. షెడ్యూల్ వెలువడినప్పటికీ ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలకు మాత్రం కొంత సమయం పడుతుందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నెల 27 నుంచి టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ మొదలవుతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇప్పటికే ప్రకటించారు.
కానీ ప్రభుత్వం చేపట్టనున్న ఈ ప్రక్రియపై ఉపాధ్యాయ వర్గాల్లో అనేక సందేహాలు, ఆందోళనలు, అసంతృప్తులు వ్యక్తమవుతున్నాయి. అయితే ఎన్నికల సంవత్సరం కావడంతో సమస్యలకు ఏదో రకంగా పరిష్కారం చూపించే ముందుకెళ్ళాలని ప్రభుత్వం యోచిస్తోంది.
స్పౌజ్ కేసులకు పరిష్కారం
తీవ్ర వివాదం రేపుతున్న స్పౌజ్ కేసులను పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 317 జీవో కారణంగా వేర్వేరు ప్రాంతాల్లో పనిచేస్తున్న భార్యాభర్తలు 2,100 మంది వరకూ ఉన్నారు. వీరంతా తమను ఒకే ప్రాంతానికి మార్చాలని ఆందోళనలకు దిగుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత బదిలీల్లో 675 మందికి మాత్రమే అవకాశం కల్పించడంతో ఇటీవల పాఠశాల విద్య డైరెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు.
ఈ నేపథ్యంలో మొత్తం 1,600 మందిని ప్రస్తుత బదిలీల్లో చేర్చి, ఇంకా మిగిలిన వారిని డిప్యుటేషన్ ద్వారా కోరుకున్న ప్రాంతాలకు బదిలీ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు. అయితే ఇలా చేయడం వల్ల ఖాళీలపై స్పష్టత ఉండదని ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇలావుండగా హెచ్‌ఎంలు ఒకే స్థానంలో పని చేయడానికి సంబంధించిన కాలపరిమితిని 5 నుంచి 8 ఏళ్ళకు పెంచారు. ఈ మేరకు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న టీచర్లు రాజకీయంగా ఒత్తిడి తెచ్చారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. దీనిపై మిగతా వారిలో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.
డిమాండ్ల సాధనకు టీచర్ల ఆందోళనలు
– ముందస్తుగా అదుపులోకి నేతలు
జిల్లాల పునర్విభజన నేపథ్యంలో అమలు చేసిన 317 జీవో వివాదాస్పదంగా మారుతోంది. సీనియారిటీ లేకపోవడంతో స్థానికేతర జిల్లాలకు వెళ్ళిన టీచర్లు బదిలీలకు అవకాశం కల్పించాలని పట్టుబడుతున్నారు. బదిలీలకు కనీసం రెండేళ్ళ సర్వీస్ నిబంధన సరికాదంటున్నారు.
జీరో సర్వీస్‌ను మార్గదర్శకాల్లో చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై ప్రభుత్వం ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదు. దీనిపై ఆందోళనలు నిర్వహిస్తున్న 317 జీవో బాధిత ఉపాధ్యాయులు ఆదివారం ప్రగతి భవన్ ముట్టడి చేపట్టారు. ఇంకోవైపు వేర్వేరు ప్రాంతాల్లో పనిచేస్తున్న భార్యాభర్తలు (స్పౌజ్‌లు) ఒకేచోట పనిచేసే అవకాశం కల్పించాలని ఆందోళన బాట పట్టారు.
ఆదివారం ప్రగతి భవన్ ముట్టడి పిలుపు నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు అన్ని జిల్లాల్లోనూ ఉపాధ్యాయ సంఘాల నేతలను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. దీనిపై సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని స్థానికేతర్లుగా బదిలీ అయిన ఉపాధ్యాయులకు రాబోయే బదిలీల్లో ప్రాధాన్యం కల్పించి, వారు కోరుకున్న స్థానిక జిల్లాల్లోని ఖాళీల ఆధారంగా బదిలీకి అవకాశం ఇవ్వాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు హనుమంతరావు, నవాత్ సురేష్ డిమాండ్ చేశారు.
కాగా ఆందోళన చేస్తున్న స్పౌజ్ టీచర్లను ఉద్దేశించి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన ‘టీచర్లా–రౌడీలా’అంటూ చేసిన వ్యాఖ్యలను రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్‌టీయూటీఎస్) అధ్యక్షుడు సదానందం గౌడ్ తీవ్రంగా ఖండించారు. ప్రగతి భవన్ ముట్టడికి 317 జీవో బాధిత టీచర్లు పిలుపునిస్తే ఏ సంబంధం లేని యూఎస్‌పీసీ, డీటీఎఫ్ సంఘాల నేతలను అరెస్టు చేయడంపై డీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు టి.లింగారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఖాళీలు 21 వేలపైనే..
ప్రమోషన్ల తర్వాత రాష్ట్రవ్యాప్తంగా 21 వేల టీచర్ పోస్టుల ఖాళీలు ఉండే అవకాశం ఉందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముందుగా స్కూల్ అసిస్టెంట్లు (ఎస్‌ఏలు) పదోన్నతులు పొందే వీలుంది. ఆ తర్వాత సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్‌జీటీ)లకు ప్రమోషన్లు ఇవ్వాలని నిర్ణయించారు. ప్రస్తుతం 1,944 ప్రధానోపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తేల్చారు. వీటిని స్కూల్ అసిస్టెంట్లతో భర్తీ చేస్తారు.
ఇప్పటికే ఖాళీగా ఉన్నవి, పదోన్నతుల ద్వారా ఖాళీ అయ్యేవి కలుపుకొంటే మొత్తం 7,111 వరకూ ఎస్‌ఏ పోస్టులు ఖాళీగా ఉండే వీలుంది. వీటిల్లో ఎస్‌జీటీల ద్వారా 70 శాతం భర్తీ చేస్తారు. మిగిలిన 30 శాతం నేరుగా డీఎస్సీ ద్వారా నియమించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో ఎస్‌జీటీ పోస్టులు 9 వేల వరకూ ఖాళీగా ఉన్నాయి. పదోన్నతులు పొందే వారిని కలుపుకొంటే మరో 5 వేల వరకూ కొత్త ఖాళీలు ఏర్పడతాయి. ఇలా మొత్తంగా 21 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment