
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రాలు కోరితేనే జవహర్ నవోదయ విద్యాలయాలు (జేఎన్‌వీలు) ఏర్పాటు చేస్తామని కేంద్ర విద్యాశాఖ సహాయమంత్రి అన్నపూర్ణాదేవి చెప్పారు. రాజ్యసభలో బుధవారం వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. నూతన నవోదయ విద్యాలయాల ఏర్పాటును కోరే రాష్ట్రాలు శాశ్వత భవన నిర్మాణాలకు తగిన భూమిని ఉచితంగా సమకూర్చాలని చెప్పారు. శాశ్వత భవనాల నిర్మాణం జరిగే వరకు విద్యాలయం నిర్వహణకు తాత్కాలిక భవనాలను రాష్ట్ర ప్రభుత్వమే ఉచితంగా సమకూర్చాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అదనంగా ఎస్సీ జనాభా ఎక్కువగా ఉన్న ప్రకాశం జిల్లాలో ఒకటి, ఎస్టీ జనాభా అధికంగా ఉన్న తూర్పు గోదావరి జిల్లాలో ఒకటి ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
గ్రామీణ రోడ్ల నిర్వహణ రాష్ట్రాల బాధ్యతే
ప్రధానమంత్రి గ్రామీణ్ సడక్ యోజన కింద గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించే రహదారుల నిర్వహణ బాధ్యత ఆయా రాష్ట్రాల బాధ్యతేనని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్‌సింగ్ తెలిపారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. ఈ పథకం కింద నిర్మించే గ్రామీణ రోడ్ల నిర్వహణకు అవసరమైన నిధులు గ్రాంట్ల రూపంలో ఆయా రాష్ట్రాలకు అందించాలని 15వ ఆర్థిక సంఘానికి విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు.
ఏపీలో పీఎంకేవీవై–ఎస్‌టీటీలో 91,203 మందికి ప్లేస్‌మెంట్: ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన (పీఎంకేవీవై)లో భాగంగా షార్ట్ టర్మ్ ట్రైనింగ్ (ఎస్‌టీటీ) పొందిన 91,203 మందికి ప్లేస్‌మెంట్ అవకాశాలు కల్పించినట్లు వైఎస్సార్‌సీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నకు జవాబుగా కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ సహాయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు.
పీఎంఏవై–జీలో 46,718 ఇళ్ల నిర్మాణం
ప్రధానమంత్రి ఆవాస్ యోజన–గ్రామీణ (పీఎంఏవై–జీ) పథకంలో భాగంగా ఏపీలో 46,718 ఇళ్లు నిర్మించినట్లు వైఎస్సార్‌సీపీ ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి ప్రశ్నకు జవాబుగా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయమంత్రి సాధ్వి నిరంజన్‌జ్యోతి చెప్పారు.
పీఎంజీఎస్‌వైలో ఏపీకి 3,285 కి.మీ. రహదారులు
ప్రధానమంత్రి గ్రామీణ్ సడక్ యోజన (పీఎంజీఎస్‌వై)లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు 3,285 కిలోమీటర్ల రహదారులు కేటాయించామని, దీన్లో 2,314 కిలోమీటర్లకు అనుమతి ఇచ్చామని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయమంత్రి సాధ్వి నిరంజన్‌జ్యోతి చెప్పారు. వైఎస్సార్‌సీపీ సభ్యుడు పరిమళ్ నత్వానీ ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ.. మిగిలిన కిలోమీటర్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment