
సాక్షి, హైదరాబాద్: విద్యార్థులలో మానసిక ఉల్లాసం, నైపుణ్యాలను పెంపొందించే ప్రత్యేక కార్యక్రమాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించనున్నట్లు విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఉన్నతాధికారులతో కలసి సోమవారం ఆమె విద్యాశాఖ పనితీరుపై సమీక్ష జరిపారు.
ఢిల్లీ తరహాలో మన రాష్ట్రంలోని విద్యార్థులకు ఆత్మ విశ్వాసం, మానసిక ధృడత్వం పెంపొందించే లా మనోస్థైర్యం కల్పించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో జిల్లాకు ఒక పాఠశాల చొప్పున 6, 7వ తరగతి విద్యార్థులను ఎంపిక చేసి ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు.ఇందుకోసం ఎంపిక చేసిన పాఠశాలల్లో ఇద్దరేసి ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ అందిస్తామన్నారు.
అలాగే విద్యార్థి దశలోనే వ్యాపార ఆవిష్కరణలను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి వెల్లడించారు. మొదటి దశలో 8 జిల్లాల్లోని 24 మోడల్ స్కూళ్లను ఎంపికచేసి అందులో ఇంటర్ మొదటి సంవత్సరం చదివే 2,500 మంది విద్యార్థులను వ్యాపార ఆవిష్కరణల దిశగా ప్రోత్సహించనున్నట్లు తెలిపారు.
ఇందులో మెరుగైన 1,500 ఆవిష్కరణలను ఎంపిక చేసి ఒక్కో ఆవిష్కరణకు ప్రభుత్వం రెండు వేల రూపాయలను అందజేస్తుందని వివరించారు. వీరితో ప్రత్యేక ఎగ్జిబిషన్లు ఏర్పాటుచేసి, భవిష్యత్తులో ఉత్తమ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment