సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే నిరుపేద చిన్నారులకు ఇచ్చిన ట్యాబులపైనా ఈనాడు తన వంకర బుద్ధిని ప్రదర్శించింది. రాష్ట్రంలోని విద్యార్థులను ప్రపంచస్థాయిలో పోటీపడేలా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను జీర్ణించుకోలేక ఈనాడు తన దుష్ట నైజాన్ని ‘బడి ట్యాబుల్లో అన్నీ లభ్యం’ వార్త ద్వారా బయటపెట్టింది. రాష్ట్రంలోని 8వ తరగతి విద్యార్థులకు అందించిన ప్రతి ట్యాబులోనూ సెక్యూరిటీ ప్యాచ్ వేశారు.
అయితే, ఎక్కడో జరిగిన చిన్న ఘటనను పెద్దగా చూపిస్తూ ఈనాడు విషప్రచారం చేస్తోంది. ప్రభుత్వ ఉన్నత లక్ష్యాన్ని నీరుగార్చే ప్రయత్నానికి ఒడిగడుతోంది. దీన్ని విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యాశాఖ తీవ్రంగా ఖండించాయి. దీనిపై పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్. సురేష్‌కుమార్ కూడా గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ వివరాలు..
‘బడి ట్యాబుల్లో అన్నీ లభ్యం’ వార్తను ఖండిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉన్నతాశయంతో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు, 8వ తరగతి బోధిస్తున్న ఉపాధ్యాయులకు బైజూస్ కంటెంట్‌తో కూడిన ట్యాబులను పంపిణీ చేసింది. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతోపాటు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న నిరుపేద విద్యార్థులు కూడా ప్రపంచంతో పోటీపడాలని, వారు ఉన్నత శిఖరాలు చేరాలన్నది సీఎం వైఎస్ జగన్ ఆకాంక్ష.
అయితే, ఈ లక్ష్యాన్ని నీరుగార్చాలని ఎక్కడో జరిగిన చిన్నచిన్న విషయాలకు పత్రికాముఖంగా బురదజల్లే కార్యక్రమం జరుగుతోంది. నిజానికి.. ట్యాబుల విషయంలో ప్రభుత్వం ముందే అనేక రక్షణ చర్యలు తీసుకుంది. అవి ఏమిటంటే..
♦ ప్రతీ ట్యాబ్‌లో సెక్యూరిటీ ప్యాచ్ వేయడం..
♦ ప్రతీ ట్యాబ్ మొబైల్ డివైస్ మేనేజ్‌మెంటు పర్యవేక్షణలో ఉంటుంది.
♦ ప్రతీ ట్యాబు విధిగా ఇంటర్నెట్‌కు ఒకసారి కనెక్ట్ చేయాలి.
♦ అలా చేయడంవల్ల ట్యాబుల్లో ఏమైనా సెక్యూరిటీ ప్యాచ్ అప్‌డేట్ కాకపోతే అప్‌డేట్ అవుతుంది.
♦ ఎక్కడైనా ట్యాబులో ఏదైనా ఎర్రర్ వస్తే వార్డు వలంటీర్ ఆ ట్యాబు గురించి సంబంధిత శాఖ వారితో సంప్రదించి దానిని సరిచేసి రెండు పనిదినాల్లో విద్యార్థికి అందజేసే వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఇందుకు సంబంధించి జీఓ–29 ద్వారా ఇలాంటి వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటుచేసింది. సమస్య ఉన్న ట్యాబులను గుర్తించి ఇప్పటికే సరిచేసి ఇచ్చే ప్రక్రియ కూడా జరుగుతోంది.
♦ కొన్ని సందర్భాల్లో ట్యాబులను మొబైల్ రిపేర్షాపులకు తీసుకెళ్లి బలవంతంగా ఫ్యాక్టరీ రీసెట్ చేయిస్తున్నారు. అలాంటి ట్యాబుల వివరాలు, విద్యార్థి పేరు, మండలం, స్కూలుతో సహా ఇతర వివరాలు విద్యాశాఖకు వెంటనే తెలుస్తుంది. సదరు స్కూలు హెడ్మాస్టర్‌కు వెంటనే సమాచారం అందించి నెట్‌కు కనెక్ట్ చేయించి ట్యాబును లాక్ చేయిస్తున్నాం.
♦ ఇక 8వ తరగతి బోధించే ప్రతి ఉపాధ్యాయునికీ ట్యాబ్ ఉపయోగించే విధానం, చిన్నచిన్న ఎర్రర్లను ఏ విధంగా సరిచేసుకోవాలనే అంశాలపై పూర్తిస్థాయి శిక్షణను ప్రారంభిస్తున్నాం.
♦ ఇలా ఒక గొప్ప లక్ష్యంతో ప్రారంభించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా ట్యాబులు వినియోగించుకుని జ్ఞానాన్ని పొందుతున్నారు. ఇలాంటి సత్సంకల్పాన్ని నీరుగార్చే ప్రయత్నాన్ని విద్యార్థులు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యాశాఖ తీవ్రంగా ఖండిస్తోంది’.
Comments
Please login to add a commentAdd a comment