సాక్షి, హైదరాబాద్/మణికొండ/ షాద్‌నగర్ రూరల్: ప్రైవేటు ఇంటర్ కాలేజీల యాజమాన్యాలు, అధ్యాపక సంఘాలతో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం భేటీ అవుతా రు. ఇంటర్, పోటీ పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థులపై పెరుగుతున్న ఒత్తిడి, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆమె సమీక్షించనున్నారు.
ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీల్లో విద్యార్థుల మానసిక స్థితిగతులు, యాజమాన్యాల నుంచి విద్యార్థులకు మార్కుల కోసం వస్తున్న ఒత్తిడిపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని మంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశానికి ఇంటర్ విద్య కమిషనర్ నవీన్ మిట్టల్ విద్యాశాఖ కార్యదర్శి కరుణ హాజరవుతారు.
సాత్విక్ ఆత్మహత్యపై సమగ్ర నివేదిక
ఇటీవల నార్సింగ్ పరిధిలోని ఓ కార్పొరేట్ కాలేజీ విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య ఘటనపై సమగ్ర నివేదికను ఇవ్వాలని ఇంటర్ బోర్డ్ అధికారులను సబిత ఆదేశించారు. ఇప్పటికే రంగారెడ్డి జిల్లా ఇంటర్ విద్యాధికారి ప్రాథమిక నివేదిక అందజేశారు. విద్యార్థి తను చదువుతున్న కాలేజీలో కాకుండా, అదే కాలేజీకి చెందిన మరో క్యాంపస్‌లో మృతి చెందినట్లు నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. వేరే క్యాంపస్‌కు అతను ఎందుకు వెళ్లాడు? అతని అడ్మిషన్ ఎక్కడ? ఆత్మహత్యకు గల కారణాలపై సోమవారం సమగ్ర నివేదిక ఇవ్వనున్నారు.
సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి
సాత్విక్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన ఆస్పత్రిపై అధికారులు ప్రభుత్వానికి తప్పుడు నివేదిక సమర్పించారని మృతుడి తల్లిదండ్రులు నాగుల రాజు, అలివేలు ఆరోపించారు. ఆదివారం వారు మీడియాతో మాట్లాడుతూ మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించి పోస్టుమార్టం చేస్తే, గాం«దీలో చేసినట్లు తప్పుడు నివేదిక ఇచ్చారని, తమ కుమారుడు అసలు శ్రీ చైతన్య కాలేజీలో చదవడం లేదని రిపోర్టు ఇచ్చి ఇచ్చారని ఆరోపించారు. ఆ నివేదికపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment