విధాన నిర్ణయాల్లో జోక్యం కూడదు  | Botsa Satyanarayana Telugu Students Department of Education | Sakshi
Sakshi News home page

విధాన నిర్ణయాల్లో జోక్యం కూడదు 

Published Tue, Jul 26 2022 5:03 AM | Last Updated on Tue, Jul 26 2022 7:42 AM

Botsa Satyanarayana Telugu Students Department of Education - Sakshi

సాక్షి, అమరావతి: ప్రాథమిక స్థాయి నుంచే విద్యను పటిష్టం చేసేందుకు, తెలుగు విద్యార్థులు ప్రపంచస్థాయిలో పోటీ పడేలా ప్రభుత్వం విప్లవాత్మక చర్యలు చేపడుతోందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలను అమలు చేయాల్సిన ఉపాధ్యాయ సంఘాలు వాటి మార్పులపై మాట్లాడటం సరికాదని హితవు పలికారు. సోమవారం సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. జాతీయ విద్యా విధానాన్ని అమలు చేస్తూ పాఠశాలల విలీనాన్ని చేపట్టామన్నారు. అయితే ఉపాధ్యాయ సంఘాలు ఉద్యోగ రీత్యా ఇబ్బందులు ఉంటే వాటిపై పోరాడాలేగానీ, ప్రభుత్వ విధానాల్లో జోక్యం చేసుకోవడం తగదన్నారు. ఉద్యమాలు చేస్తున్న ఉపాధ్యాయుల పిల్లలు ఎక్కడ చదువుతున్నారని ప్రశ్నించారు. వారి పిల్లల భవిష్యత్తుకు పునాదులు పటిష్టంగా ఉండాలని కోరుకోవడంలో తప్పులేదని, అలాగే పేద పిల్లల ఉన్నతిని కూడా వారు కోరుకోవాలని సూచించారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఎప్పుడూ సానుకూలంగా ఉంటుందని చెప్పారు. 

మెరుగైన విద్యకు బాటలు 
గతంలో ఎన్నడూ లేని విధంగా ఎల్‌కేజీ, యూకేజీతో పాటు ఒకటి, రెండు తరగతులను కలిపి ఒకే చోట ఏర్పాటు చేసి ఇద్దరు ఎస్‌జీటీ, ఇద్దరు అంగన్‌వాడీ టీచర్ల పర్యవేక్షణలో చదువు చెబుతున్నట్లు బొత్స తెలిపారు. 3 నుంచి 8వ తరగతి/ 3 నుంచి 10వ తరగతి/3 నుంచి ఇంటర్‌ వరకు ఒకే చోట ఏర్పాటు చేయడం ద్వారా ప్రాథమికంగానే సబ్జెక్టు టీచర్ల బోధన లభిస్తుందన్నారు. డిజిటల్‌ స్క్రీన్‌పై క్లాసులు, 8వ తరగతి నుంచి 5 లక్షల మంది విద్యార్థులకు ట్యాబ్‌లో ఇంగ్లిషులో ఉచిత బోధనలు అందిస్తున్నామన్నారు. అక్షరక్రమంలో తొలి స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను విద్యా రంగంలో కూడా ప్రథమ స్థానంలో నిలిపేందుకే ఈ కార్యక్రమాలు చేపట్టామన్నారు.

రాష్ట్రంలో విలీనానికి 5,800 పాఠశాలలను మ్యాపింగ్‌ చేస్తే 268 స్కూళ్ల నుంచి అభ్యంతరాలు వచ్చాయని చెప్పారు. వాటిని జాయింట్‌ కలెక్టర్లు పరిశీలించి, ప్రభుత్వానికి నివేదిక ఇస్తారని తెలిపారు. ఈ ఏడాది నుంచి ప్రభుత్వం నిర్దేశించిన సిలబస్‌ ప్రకారమే ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యా బోధన జరుగుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు ఉచితంగా, ప్రైవేటు పాఠశాలలకు నిర్ణీత రేట్ల ప్రకారం పాఠ్య పుస్తకాలు పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. ఇందు కోసం రాష్ట్రంలోని 660 ప్రింటింగ్‌ ప్రెస్‌లను ప్రభుత్వ అధీనంలోకి తీసుకున్నామన్నారు. అయితే ప్రైవేటు పాఠశాలలు నిర్లక్ష్యంగా ఇండెంట్‌ తక్కువగా పెట్టడం వల్లే పుస్తకాల కొరత ఏర్పడిందన్నారు. ఆ సమస్యను అధిగమించేందుకు 15 రోజుల్లో మళ్లీ ఇండెంట్‌ పెట్టాలని ఆయా యాజమాన్యాలకు సూచించినట్లు తెలిపారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement