15 వేల స్కూళ్లలో ఇంగ్లిష్‌ మీడియం | Telangana: Education Department Plans English Medium In Govt Schools | Sakshi
Sakshi News home page

15 వేల స్కూళ్లలో ఇంగ్లిష్‌ మీడియం

Published Sat, Feb 12 2022 7:02 AM | Last Updated on Sat, Feb 12 2022 7:02 AM

Telangana: Education Department Plans English Medium In Govt Schools - Sakshi

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం రాబోతోంది. వచ్చే విద్యా సంవత్సరంలో (జూన్‌) ఇంగ్లిష్‌ మాధ్యమంలో బోధన ప్రారంభించేందుకు విద్యాశాఖ ఇప్పటి నుంచే చర్యలు చేపట్టింది. విద్యార్థులకు మెరుగైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందాలంటే ఇంగ్లిష్‌ మీడియం అవసరమని ఇటీవల సీఎం కేసీఆర్‌ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఆయన ఆదేశాల మేరకు విద్యాశాఖ చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా ప్రస్తుతం తెలుగు మీడియం కొనసాగుతున్న 15,370 ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టనుంది. తెలుగుతో సమాంతరంగా ఇంగ్లిష్‌ మీడియం సెక్షన్లను ప్రారంభించి ఆసక్తి ఉన్న విద్యార్థులు చేరేలా చర్యలు చేపట్టనుంది.  

ఇప్పటికే 10,702 స్కూళ్లలో ఇంగ్లిష్‌ మీడియం 
ప్రస్తుతం రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖ పరిధిలో 26,754 పాఠశాలలు ఉన్నాయి. అందులో కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాలు, మోడల్‌ స్కూళ్లు, విద్యాశాఖ గురుకులాలు, ఇతర పాఠశాలలు ఉన్నాయి. అవి పోగా 26,072 తెలుగు, ఇంగ్లిష్‌ మీడియం స్కూళ్లు ఉన్నాయి. అందులో ఇప్పటికే 10,702 స్కూళ్లలో తెలుగుతో పాటు ఇంగ్లిష్‌ మీడియం కొనసాగుతోంది. మరో 15,370 స్కూళ్లలో పూర్తి స్థాయిలో తెలుగు మీడియం మాత్రమే కొనసాగుతోంది.

సీఎం ఆదేశాలతో ఇప్పుడు వాటిన్నింటిలోనూ ఇంగ్లిష్‌ మీడియంను సమాంతరంగా ప్రారంభించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ఇంగ్లిష్‌ మీడియంలో 10,16,334 మంది విద్యార్థులు చదువుతుండగా, తెలుగు మీడియంలో 15,44,208 మంది చదువుతున్నారు.  

ఈ నెల నుంచే ఇంగ్లిష్‌ భాషాభివృద్ధి కోర్సు 
ప్రాథమిక పాఠశాలల్లో బోధించే ఎస్‌జీటీల్లో ఇంగ్లిష్‌ బోధనా నైపుణ్యం పెంచేలా ఈ నెల నుంచే శిక్షణ ప్రారంభించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ ఎన్‌రిచ్‌మెంట్‌ కోర్సు (ఈఎల్‌ఈసీ) పేరుతో శిక్షణ ఇవ్వనుంది. రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి, అజీమ్‌ ప్రేమ్‌జీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో రెండు దశల్లో నాలుగు వారాల పాటు ఈ శిక్షణ ఇవ్వబోతోంది. ఆన్‌లైన్‌లో నాలుగు వారాల పాటు ఇది కొనసాగనుంది.  

43 వేల మందికి పైగా టీచర్లకు శిక్షణ 
రాష్ట్రంలో తెలుగు, ఇంగ్లిష్‌ మీడియం స్కూళ్లలో 1,03,911 మంది టీచర్లు ఉన్నారు. వారిలో ఇంగ్లిష్‌ మీడియం విద్యార్థులకు 60,602 మంది టీచర్లు బోధిస్తున్నారు. తెలుగు మీడియం స్కూళ్లలో మరో 43,309 మంది టీచర్లు బోధిస్తుండగా.. వీరికి ఇంగ్లిష్‌ మీడియంలో బోధనకు శిక్షణ ఇవ్వనున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement