జూలై 14 నుంచి ఎంసెట్‌ | Telangana Government Has Decided To Held Eamcet From July 14 | Sakshi
Sakshi News home page

జూలై 14 నుంచి ఎంసెట్‌

Published Wed, Mar 23 2022 12:40 AM | Last Updated on Wed, Mar 23 2022 12:40 AM

Telangana Government Has Decided To Held Eamcet From July 14 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఎంసెట్‌ను జూలై 14 నుంచి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈసెట్‌ను ఇదే నెల 13న నిర్వహించనున్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి మంగళవారం ఈ మేరకు షెడ్యూల్‌ వెల్లడించారు. ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి సహా పలువురు ఉన్నతాధికారులతో ఆమె వివిధ ఉమ్మడి ప్రవేశ పరీక్షలపై చర్చించారు.

వీటికి అవసరమైన నోటిఫికేషన్లను సంబంధిత విభాగాలు త్వరలో విడుదల చేస్తాయని ఆమె ప్రకటించారు. వ్యవసాయ అనుబంధ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎంసెట్‌ జూలై 14, 15 తేదీల్లో, ఇంజనీరింగ్‌ కోర్సుల్లో చేరేందుకు చేపట్టే ఎంసెట్‌ పరీక్ష జూలై 18, 19, 20 తేదీల్లో ఉంటుందని చెప్పారు. మొత్తం 23 ప్రాంతీయ కేంద్రాల పరిధిలో 105 పరీక్ష కేంద్రాలను ఈ సెట్స్‌ కోసం ఏర్పాటు చేస్తున్నామన్నారు. పరీక్షలు సజావుగా సాగేందుకు సమష్టిగా పనిచేయాలని అధికారులను ఆదేశించారు. 

ఇంటర్‌ వెయిటేజీ లేదు.. 
ఇంటర్మీడియెట్‌ మార్కులను ఎంసెట్‌లో వెయిటేజ్‌గా తీసుకోవడం లేదని ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి స్పష్టంచేశారు. కరోనా నేపథ్యంలో గతేడాది కూడా ఇదే నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఎంసెట్‌ రాసే ఇంటర్‌ సెకండియర్‌ విద్యార్థులు గత ఏడాది ఆఖరులో జరిగిన ఇంటర్‌ ఫస్టియర్‌లో కేవలం 49 శాతం మందే ఉత్తీర్ణులయ్యారు. ఆ తర్వాత ప్రభుత్వం అందరినీ కనీస మార్కులతో పాస్‌ చేసింది. ఈ నేపథ్యంలోనే ఎంసెట్‌లో ఇంటర్‌ మార్కుల వెయిటేజీని తొలగించాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు.  

సెప్టెంబర్‌లో కౌన్సెలింగ్‌ 
వాస్తవానికి ఎంసెట్‌ను జూన్‌లోనే నిర్వహించాలని తొలుత భావించారు. అనూహ్యంగా జేఈఈ మెయిన్స్‌ పరీక్షల తేదీల్లో మార్పులు చేయడంతో ఎంసెట్‌ను ఆలస్యంగా చేపట్టాల్సి వస్తోందని ఉన్నత విద్యామండలి వర్గాలు పేర్కొన్నాయి. ఆగస్టులో జాతీయ ఇంజనీరింగ్‌ కాలేజీలు, ఐఐటీల్లో కౌన్సెలింగ్‌ ప్రక్రియ పూర్తవుతుందని, ఆ తర్వాతే ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ చేపట్టడం సరైన నిర్ణయంగా భావించినట్టు చెప్పాయి. ఈ విధానం వల్ల సీట్ల లభ్యతపై స్పష్టత ఉంటుందని, గత ఏడాది కూడా ఇలాగే చేసినట్టు ఎంసెట్‌ నిర్వహణ విభాగం పేర్కొంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement