ఆప్టిట్యూడ్ టెస్ట్ పేపర్స్ పుస్తకాన్ని పరిశీలిస్తున్న సీఎం వైఎస్ జగన్, చిత్రంలో మంత్రి సురేష్
స్కూళ్లలో విద్యార్థులకు ప్రతిరోజూ ఒక ఇంగ్లిష్ పదాన్ని నేర్పాలి. అలా నేర్పేటప్పుడు డిక్షనరీలో ఆ పదాన్ని చూపించి అర్థం తెలపడంతో పాటు, వాక్యంలో ఆ పదాన్ని ఎలా ఉపయోగించాలో కూడా వివరించాలి. మొదటి రోజు పదం చెప్పడం, అసైన్‌మెంట్ ఇవ్వడం.. రెండో రోజు దాన్ని ఉపయోగించడం నేర్పించాలి. విద్యార్థుల భవిష్యత్తుకు మంచి మార్గం వేసేలా వారి తల్లిదండ్రులతో హెడ్‌మాస్టర్లు తరచూ మాట్లాడాలి.
– ముఖ్యమంత్రి వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: టీచర్ల సేవలను బోధనేతర కార్యక్రమాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ వాడుకోకూడదని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. వారి సేవలను బోధన కార్యక్రమాలకు మాత్రమే ఉపయోగించాలని, బోధనేతర కార్యక్రమాలకు వినియోగిస్తే విద్యార్థుల చదువులు దెబ్బతినే ప్రమాదం ఉంటుందన్నారు. టీచర్లు పూర్తిగా విద్యార్థుల చదువులకు అందుబాటులో ఉండేలా చూడాలని ఆయన స్పష్టం చేశారు. ఉన్నత చదువులు చదువుకున్న టీచర్లు ప్రభుత్వ స్కూళ్లలో ఉన్నారని, వారి సేవలను సమర్థవంతంగా వాడుకోగలిగితే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని చెప్పారు.
అందుకోసమే విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకువచ్చామని తెలిపారు. మంచి చదువులు చదువుకున్న టీచర్ల సేవలను వాడుకునేందుకు విధానాలు రూపొందించామని, సబ్జెక్టుల వారీగా టీచర్లను అందుబాటులోకి తీసుకు వస్తున్నామని చెప్పారు. నూతన విద్యా విధానం కింద తీసుకున్న నిర్ణయాలు, గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలుపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జూలై నాటికి సబ్జెక్ట్ టీచర్ల నియామకాలు పూర్తి కావాలని ఆదేశించారు. తద్వారా వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులందరికీ సబ్జెక్ట్ టీచర్లు అందుబాటులో ఉంటారని, నాణ్యమైన విద్య లభిస్తుందన్నారు. ఈ సమీక్షలో సీఎం జగన్ ఏమన్నారంటే..
నూతన విద్యావిధానం అమలు తీరుపై నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్
లెర్నింగ్ టు లెర్న్ కాన్సెప్ట్‌లోకి డిజిటల్ లెర్నింగ్
► లెర్నింగ్ టు లెర్న్ కాన్సెప్ట్‌లోకి డిజిటల్ లెర్నింగ్‌ను తీసుకెళ్లాలి. జిల్లాల పునర్విభజన ద్వారా ఏర్పడనున్న 26 జిల్లాల్లో ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాలు ఉండాలి. ప్రస్తుతం ఉన్న శిక్షణ కేంద్రాలలో నాడు–నేడు కింద సౌకర్యాలను మెరుగుపరచాలి.
► స్కూళ్లలో హెడ్ మాస్టర్లు మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలి. విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ ఇవ్వాలి. తల్లిదండ్రులతో మంచి సంబం«ధాలు నెరుపుతూ విద్యార్థుల భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేయాలి. ప్రతి విద్యార్థిని, వారి తల్లిదండ్రులనూ విడివిడిగా కలుస్తూ.. వారి భవిష్యత్తుకు మంచి మార్గం చూపేలా కౌన్సెలింగ్ ఇవ్వాలి.
ఎప్పటికప్పుడు సమస్యల పరిష్కారం
► స్కూళ్లలో నాడు–నేడు కింద ఏర్పాటు చేసుకున్న సౌకర్యాల నిర్వహణ బాగుండాలి. లేకపోతే ఆ సౌకర్యాలు నిరర్థకమవుతాయి. టాయిలెట్లు, తాగునీటి ప్లాంట్ల నిర్వహణ బాగుండాలి. ఎప్పుడు సమస్య వచ్చినా వెంటనే దాన్ని పరిష్కరించి, సమర్థవంతంగా నిర్వహించాలి.
► ఫిర్యాదు వచ్చిన వారం రోజుల్లోగా పరిష్కారం కావాలి. గ్రామ, వార్డు సచివాలయాల్లోని టెక్నికల్, ఇంజనీరింగ్ సిబ్బంది, విలేజ్ క్లినిక్స్‌లో సిబ్బందికి స్కూళ్లలో వసతుల నిర్వహణపై తగిన ఎస్‌ఓపీ (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్) ఇవ్వాలి.
15 నుంచి స్కూళ్లలో రెండో విడత నాడు–నేడు
► మార్చి 15 నుంచి స్కూళ్లలో నాడు –నేడు రెండో విడత పనులు మొదలు పెట్టాలి. ప్లే గ్రౌండ్‌లను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. ఇందుకు సంబంధించి మ్యాపింగ్ చేసి, ప్రణాళిక సిద్ధం చేయాలి. స్కూళ్లు తెరిచే నాటికి పిల్లలకు విద్యా కానుక అందించాలి.
► ప్రైవేటు కాలేజీల్లో కూడా సౌకర్యాలు ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయా.. లేదా? చూడాలి. తల్లిదండ్రులు కష్టపడి ఫీజులు కడుతున్నందున, ఆ మేరకు పిల్లలకు సౌకర్యాలు, వసతులందిస్తున్నారో లేదో క్రమం తప్పకుండా పరిశీలించాలి.
నైపుణ్యాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలి
► రాష్ట్రంలో నైపుణ్యాల అభివృద్ధికి రూపొందించిన ప్రణాళికను ఆచరణలోకి తీసుకు రావడానికి వెంటనే చర్యలు తీసుకోవాలి. ప్రతి పార్లమెంట్‌కు ఒక స్కిల్ కాలేజీతో పాటు, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఐటీఐ, పాలిటెక్నిక్ సమ్మిళితంగా ఒక స్కిల్ సెంటర్ ఉండాలి. తద్వారా ఎంతో మందికి త్వరితగతిన ఉపాధి కల్పించవచ్చు.
► వీటన్నింటికీ పాఠ్య ప్రణాళికను స్కిల్ యూనివర్సిటీ రూపొందించాలి. దీన్ని తిరుపతిలో పెడతామని ఇదివరకే నిర్ణయం తీసుకున్నాం. దీని ఏర్పాటుపై అధికారులు దృష్టిపెట్టాలి. నైపుణ్యం ఉన్న మానవ వనరులకు రాష్ట్రం చిరునామాగా మారాలి.
► సమావేశంలో విద్యా శాఖ మంత్రి సురేష్, సీఎస్ సమీర్‌శర్మ, సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, పాఠశాల విద్యాశాఖ స్పెషల్ సీఎస్ రాజశేఖర్, సీఎం కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్యరాజ్, అదనపు కార్యదర్శి ఆర్.ముత్యాలరాజు, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్.గుల్జార్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్, పాఠశాల విద్యాశాఖ సలహాదారు మురళీ, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ (ఎస్‌సీఈఆర్‌టీ) బి.ప్రతాప్‌రెడ్డి, పలువురు అధికారులు పాల్గొన్నారు.
ఫిర్యాదుల స్వీకరణకు టోల్ ఫ్రీ నంబర్
విద్యాశాఖలో తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలు తీరును అధికారులు సీఎంకు వివరించారు. నూతన విద్యావిధానానికి అనుగుణంగా ఇప్పటివరకు మ్యాపింగ్ కాకుండా మిగిలిపోయిన స్కూళ్లను కూడా మ్యాపింగ్ చేశామని చెప్పారు. మార్చి 14 నుంచి రోజూ ఒక ఇంగ్లిష్ పదాన్ని నేర్పేలా కార్యాచరణ అమలు చేస్తామన్నారు. వచ్చే ఏడాది 8వ తరగతి నుంచి డిజిటల్ లెర్నింగ్ ప్రారంభిస్తామని, ఉపాధ్యాయుల బోధనా సామర్థ్యాన్ని పెంచడానికి తగిన చర్యలు తీసుకున్నామని చెప్పారు. ప్రతి మండలానికి ఒక కో ఎడ్యుకేషన్ జూనియర్ కళాశాల, ఒక మహిళా జూనియర్ కళాశాల ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. జూనియర్ కళాశాలలు లేని మండలాలను గుర్తించామని తెలిపారు. ఈ లెక్కన అన్ని మండలాల్లో ప్రస్తుతం ఉన్న 472 జూనియర్ కాలేజీలతో కలుపుకుని 1,300 వరకు ఏర్పాటవుతాయన్నారు. స్కూళ్లు, వసతులు తదితర అంశాలపై ఫిర్యాదుల స్వీకరణకు టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎస్‌సీఈఆర్‌టీ సిఫార్సుల అమలుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని సీఎంకి వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment