Andhra Pradesh Government: నాణ్యమైన విద్యకు బాటలు | YS Jagan focused on development of education sector immediately after he became CM | Sakshi
Sakshi News home page

Andhra Pradesh Government: నాణ్యమైన విద్యకు బాటలు

Published Mon, Jun 7 2021 3:27 AM | Last Updated on Mon, Jun 7 2021 10:35 AM

YS Jagan focused on development of education sector immediately after he became CM - Sakshi

సాక్షి, అమరావతి: విద్యా రంగంలో ప్రమాణాల పెరుగుదలకు విద్యార్థులకు అన్ని సదుపాయాలతో కూడిన పాఠశాలల అందుబాటు ఎంత ముఖ్యమో వాటిలో నాణ్యమైన బోధనాభ్యసన కార్యక్రమాలు అమలు చేయడం అంత కన్నా ముఖ్యం. పిల్లలను స్కూలు వరకు తీసుకువచ్చేందుకు ఆ స్కూలులో అందమైన, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తూ.. ఆపై స్కూలులో చేరిన పిల్లలకు మెరుగైన బోధన అందించగలిగితేనే లక్ష్యం మేరకు ఫలితాలు సాధించడానికి వీలుంటుంది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాల ఫలితాలు ఇప్పుడిప్పుడే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ‘స్కూలింగ్‌ టు లెర్నింగ్‌’ దిశగా అడుగులు వేస్తోంది. త్వరలోనే ఇది కార్యరూపం దాల్చనుంది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే విద్యా రంగ అభివృద్ధిపై దృష్టి సారించారు. ముఖ్యంగా పాఠశాల విద్యను బలోపేతం చేసే దిశగా పలు కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమాల ఫలితాలు ఇప్పుడు సుస్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఎన్నెన్నో కార్యక్రమాలు..
► అమ్మ ఒడి, మనబడి నాడు–నేడు, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం, కరిక్యులమ్‌ సంస్కరణలు, స్కూల్‌ శానిటేషన్, మరుగుదొడ్ల నిర్వహణ నిధి, తదితర పథకాలు, కార్యక్రమాలపై ప్రధానంగా ప్రభుత్వం దృష్టి సారించింది.
► కరోనాతో స్కూళ్లు మూత పడిన తర్వాత పిల్లలు ఇళ్లకే పరిమితమైన సమయంలోనూ విద్యా కార్యక్రమాలు ఆగకుండా ఆన్‌లైన్, డిజిటల్‌ ప్లాట్‌ఫాంల ద్వారా కొనసాగించారు.
► విద్యామృతం, విద్యా కలశం, విద్యా వారధి, టీచర్‌ ట్రయినింగ్, సందేహాల నివృత్తికి స్టూడెంట్‌ హైల్ప్‌లైన్, వాట్సప్‌ గ్రూపులు, టీచర్లకు ఆన్‌లైన్‌ టీఎల్‌ఎం పోటీలు, విద్యార్థులకు ఆన్‌లైన్‌ డ్రాయింగ్‌ పోటీలు, టీచర్లు, విద్యార్థుల కోసం అభ్యాస యాప్, నిష్టా యాప్‌తో టీచర్లకు శిక్షణ ద్వారా ప్రాథమిక విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికింది.

ప్రభుత్వ కార్యక్రమాల ఫలితాలు ఇలా..
► గరిష్ట చేరికల నిష్పత్తి (గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంటు రేషియో – జీఈఆర్‌)లో పెరుగుదల.
► 2018–19లో ప్రైమరీ విభాగంలో 87 శాతంగా ఉన్న చేరికలు ఏడాదిలోనే 91.97 శాతానికి చేరాయి.
► అప్పర్‌ ప్రైమరీలో 84 శాతం నుంచి 87 శాతానికి, సెకండరీలో 82 శాతం నుంచి 84 శాతానికి పెరిగాయి.
► విద్యాశాఖ గణాంకాల ప్రకారం ప్రభుత్వ స్కూళ్లలో 6.12 లక్షల మంది విద్యార్థులు అదనంగా చేరారు. ఈ సంఖ్య క్రమేణా పెరుగుతూ వస్తోంది. ఇదే సమయంలో ప్రయివేటు స్కూళ్లలో చేరికలు తగ్గాయి.
► ప్రైమరీ, యూపీ పాఠశాలల్లో డ్రాపవుట్ల శాతం గతంలో కన్నా తగ్గుముఖం పట్టింది. 2015–16లో ప్రైమరీలో 6.27 శాతంగా ఉన్న డ్రాపవుట్లు.. 2019–20 నాటికి సున్నాకు చేరాయి. అప్పర్‌ ప్రయిమరీలో 5.47 నుంచి 0.27కు తగ్గాయి.
 
ప్రీప్రైమరీ, ఫౌండేషన్‌ స్కూళ్లు

► తదుపరి దశగా ప్రభుత్వం వైఎస్సార్‌ ప్రీ ప్రైమరీ స్కూళ్లు, ఫౌండేషన్‌ స్కూళ్ల ఏర్పాటుతో నూతన విద్యా విధానానికి శ్రీకారం చుట్టబోతోంది. ప్రస్తుతం ఉన్న వనరుల సర్దుబాటు, సద్వినియోగం చేసుకొని గరిష్ట ఫలితాలను సాధించేందుకు విద్యా శాఖ కసరత్తు చేస్తోంది.
► ప్రస్తుతం కొన్ని స్కూళ్లలో విద్యార్థులకు తగ్గ టీచర్లు లేరు. కొన్ని చోట్ల టీచర్లు ఉన్నా, విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంది. కొన్ని స్కూళ్లలో తరగతి గదుల సమస్య ఉంది. వీటిని ముందుగా పరిష్కరించే ఆలోచనలు సాగుతున్నాయి.
► ఇప్పటికే ఏయే స్కూళ్లలో ఎంతెంత మంది పిల్లలున్నారు? ఏ స్కూళ్లలో ఎంత మంది టీచర్లున్నారు? తరగతి గదులు ఎన్ని ఉన్నాయన్న అంశాలపై విద్యా శాఖ సమగ్ర సమాచారం తెప్పించుకుంది. ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు మెరుగైన బోధనను అందించి వారిలో నాణ్యతా ప్రమాణాలు పెంచేందుకు వీలుగా ‘మిషన్‌ స్కూలింగ్‌ టు లెర్నింగ్‌’ కార్యక్రమంపై దృష్టి పెట్టింది. 

పిల్లలకు మనం ఇవ్వగలిగిన విలువైన ఆస్తి చదువే. అందుకే పేద పిల్లలు విద్యను అభ్యసించే ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్‌కు దీటుగా ఉండాలి. కాంపౌండ్‌ మొదలు తరగతి గదులు, బెంచీలు, ఫ్యాన్లు, ల్యాబ్‌లు, టాయ్‌లెట్లు, సరిపడా టీచర్లు, ఇతరత్రా అన్ని వసతులు అందుబాటులో ఉండాలి. అప్పుడే పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకు రాగలుగుతారు. అలాంటప్పుడే వారికి నాణ్యమైన విద్యను అందించడానికి వీలవుతుంది.
– అధికారంలోకి వచ్చిన కొత్తలో సీఎం వైఎస్‌ జగన్‌

ఆ లక్ష్యం మేరకు నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మార్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తద్వారా పాఠశాలల్లో సకల మౌలిక సదుపాయాలు సమకూరాయి. దీనికి తోడు వివిధ పథకాల ద్వారా లబ్ధి కలిగించడం వల్ల తల్లిదండ్రులు.. తమ పిల్లలను బడికి పంపేలా చేయగలిగారు. పర్యవసానంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు వెల్లువలా పెరిగాయి. ఈ దశలో విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించడం అత్యంత ఆవశ్యకం. ఈ దిశగా విద్యా శాఖ ముమ్మరంగా కసరత్తు చేస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement