
సాక్షి, అమరావతి: చెప్పిన మాట మేరకు సంక్షేమ క్యాలెండర్‌లో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం జగనన్న వసతి దీవెన అమలు చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 9,55,662 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.912.71 కోట్ల ఆర్థిక సాయాన్ని అనంతపురం జిల్లా నార్పల వేదికగా కంప్యూటర్‌లో బటన్ నొక్కి జమ చేయనున్నారు. ఈ మొత్తంతో కలిపి ఇప్పటి వరకు 25,17,245 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.4,275.76 కోట్లు జమ చేసినట్లు అవుతుంది.
గత ప్రభుత్వంలో అరకొరగా ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు చేయడమేగాక 2017 నుంచి పెండింగ్ పెట్టిన బకాయిలు రూ.1,778 కోట్లను కూడా జగన్ ప్రభుత్వం చెల్లించింది. ఈ బకాయిలు, జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతిదీవెన కింద ఇప్పటివరకు వైఎస్ జగన్ ప్రభుత్వం అందించిన మొత్తం సాయం రూ.14,223.60 కోట్లు.
వసతి దీవెన పథకం కింద ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థుల భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ఏటా రెండు వాయిదాల్లో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్న విషయం తెలిసిందే.
విప్లవాత్మక సంస్కరణలు
కరిక్యులమ్‌లో మార్పులు, నాలుగేళ్ల ఆనర్స్ కోర్సులు, నైపుణ్యాభివృద్ధి కోర్సులు, తప్పనిసరిగా ఇంటర్న్‌షిప్ తదితర విప్లవాత్మక కార్యక్రమాలతో విద్యా రంగాన్ని బలోపేతం చేస్తోంది. డిజిటల్ విద్యలో భాగంగా 8 వ తరగతి విద్యార్థులకు బైజూస్ కంటెంట్‌తో కూడిన ఉచిత ట్యాబ్‌లు, నాడు–నేడు ద్వారా ఇప్పటికే అభివృద్ధి చేసిన పాఠశాలల్లో 6వ తరగతి పైన ప్రతి క్లాస్‌రూమ్‌లో 30,213 ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్, 10,038 ఫౌండేషన్, ఫౌండేషన్ ప్లస్ స్కూళ్లలో స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేసింది.
అధికారంలోకి వచ్చిన ఈ 46 నెలల కాలంలోనే ఒక్క విద్యా రంగంపై రూ.58,555.07 కోట్లు వెచ్చించింది. కాగా, బుధవారం ఉదయం సీఎం వైఎస్ జగన్ ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.20 గంటలకు నార్పల ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలకు చేరుకుంటారు. అనంతరం నార్పల క్రాస్‌రోడ్స్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని, జగనన్న వసతి దీవెన కింద లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తారు. తిరిగి 2.50 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment