రెండో విడత ‘జగనన్న వసతి దీవెన’ | CM YS Jagan to be deposit Jagananna Vasathi Deevena in Nandyal | Sakshi
Sakshi News home page

రెండో విడత ‘జగనన్న వసతి దీవెన’

Published Fri, Apr 8 2022 4:28 AM | Last Updated on Fri, Apr 22 2022 1:41 PM

CM YS Jagan to be deposit Jagananna Vasathi Deevena in Nandyal - Sakshi

సాక్షి, అమరావతి: జగనన్న వసతి దీవెన పథకం కింద శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.1,024 కోట్లు జమ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2021–22 విద్యా సంవత్సరానికి రెండో విడత కింద 10,68,150 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఈ మొత్తాన్ని బటన్‌ నొక్కి సీఎం జమ చేస్తారు. ఇందుకు నంద్యాల ఎస్‌పీజీ గ్రౌండ్‌ వేదిక కానుంది. నగదు జమ చేశాక సీఎం వైఎస్‌ జగన్‌ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.  

భోజన, వసతి ఖర్చులకు సైతం.. 
పేదరికం కారణంగా ఏ విద్యార్థి ఉన్నత చదువులకు దూరం కాకూడదు.. చదువుల ఖర్చుతో తల్లిదండ్రులు అప్పులపాలు కాకూడదన్న సమున్నత లక్ష్యంతో జగనన్న విద్యాదీవెనను ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్‌ తదితర కోర్సులు చదివే అర్హులైన పేద విద్యార్థులు కళాశాలలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తోంది. అంతేకాకుండా క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఫీజుల మొత్తాలను నేరుగా జమ చేస్తోంది. మొన్ననే జగనన్న విద్యా దీవెన కింద అక్టోబర్‌– డిసెంబర్, 2021 త్రైమాసికానికి పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌గా రూ.709 కోట్లు ఆ త్రైమాసికం పూర్తయిన వెంటనే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ జమ చేశారు.  

జగనన్న వసతి దీవెన ఇలా.. 
భోజనం, వసతి ఖర్చులకూ విద్యార్థులు ఇబ్బంది పడకుండా జగనన్న వసతి దీవెన పథకాన్ని అందిస్తోంది. ఏటా రెండు వాయిదాల్లో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్‌ తదితర కోర్సులు అభ్యసించేవారికి రూ.20 వేల చొప్పున  ప్రభుత్వం ఇస్తోంది. 

నాడు (గత ప్రభుత్వంలో)..
► ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థులకు భోజన, వసతి ఖర్చుల సంగతి దేవుడెరుగు. పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వాలనే ఆలోచన కూడా చేయలేదు. అరకొరగా ఇచ్చిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ని కూడా ఏళ్ల తరబడి జాప్యం చేసి భారీగా బకాయిలు పెట్టింది. 
► 2017–18, 2018–19 సంవత్సరాలకైతే  ఏకంగా రూ.1,778 కోట్లు బకాయి పడింది.

నేడు (ప్రస్తుత ప్రభుత్వంలో)..
► గత ప్రభుత్వ బకాయిలు దాదాపు రూ.1,778 కోట్లతో కలిపి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 34 నెలల్లోనే జగనన్న విద్యా దీవెన కింద రూ.6,969 కోట్లు, జగనన్న వసతి దీవెన కింద రూ.3,329 కోట్లు అందించింది. ఇలా ఇప్పటివరకు విద్యార్థుల చదువులకు అందించిన మొత్తం ఆర్థిక సాయం అక్షరాలా రూ.10,298 కోట్లు. 
► కాలేజీల్లో జవాబుదారీతనం పెరిగేలా, విద్యార్థుల తల్లులకు ప్రశ్నించే హక్కు కల్పిస్తూ, తల్లుల సాధికారతకు పట్టం కడుతూ  నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement