సీఎం జగన్ సమక్షంలో సత్యసాయి చారిటబుల్ ట్రస్టు ప్రతినిధులు, విద్యా శాఖ అధికారుల ఎంవోయూ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యా రంగంలో అత్యున్నత ప్రమాణాలు నెలకొనేలా అనేక కార్యక్రమాలను చేపడుతున్నామని, ముఖ్యంగా పేద, బడుగు, బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ మైనార్టీల పిల్లలకు మేలు చేసేలా ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. ఈ రంగంలో ఎక్కడా అమలు కాని రీతిలో మనబడి నాడు–నేడు, జగనన్న అమ్మ ఒడి, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా కానుక వంటి అనేక విప్లవాత్మక పథకాలు, కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామన్నారు.
తాజాగా జగనన్న గోరుముద్ద కింద విద్యార్థులకు మరింత పౌష్టిక ఆహారాన్ని ఇవ్వడంలో భాగంగా ప్రస్తుత మెనూకు అదనంగా వచ్చే నెల 2 నుంచి రాగిజావను కూడా అందించనున్నామన్నారు. ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కానున్న శ్రీ సత్యసాయి చారిటబుల్ ట్రస్టు, విద్యా శాఖ అధికారులు గురువారం క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ సమక్షంలో ఎంఓయూ కుదుర్చుకున్నారు.
ఈ సందర్భంగా సీఎంమాట్లాడుతూ.. సత్యసాయి ట్రస్టు భాగస్వామ్యం కావడం ద్వారా.. భగవాన్ సత్యసాయి కూడా ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించి ముందుకు తీసుకుపోతున్నారని చెప్పవచ్చన్నారు. గోరుముద్ద కార్యక్రమంలో రాగి జావను అదనంగా చేర్చడం ద్వారా మరింత పౌష్టికాహారం పిల్లలకు అందుతుందన్నారు.
కేవలం గోరుముద్ద కార్యక్రమానికే రూ.1,700 కోట్లు ఖర్చు పెడుతున్నామని చెప్పారు. మూడున్నరేళ్ల క్రితం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని, గతంలో కేవలం రూ.600 కోట్లు మాత్రమే మధ్యాహ్న భోజన పథకానికి ఖర్చు పెడితే మన ప్రభుత్వ హయాంలో ఆ ఖర్చు దాదాపు మూడు రెట్లు పెరిగిందని వివరించారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే..
విద్యా రంగంలో కీలక సంస్కరణలు
► విద్యా రంగంలో అనేక కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టాం. తల్లులు తమ పిల్లలను బడికి పంపించేందుకు అవసరమైన ప్రోత్సాహాన్నివ్వడానికి ఉద్దేశించిన అమ్మఒడి మొదలు.. నాడు–నేడు ద్వారా స్కూళ్ల వ్యవస్థను మార్పు చేసే వరకు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం.
►6వ తరగతి, ఆ పై తరగతుల్లో ప్రతి తరగతి గదిలో ఇంటరాక్టివ్ ఫ్లా్లట్ ప్యానల్స్(ఐఎఫ్‌పీ)ను ఏర్పాటు చేస్తున్నాం. 30,230 తరగతి గదుల్లో వీటిని పెడుతున్నాం. నాడు–నేడు తొలిదశ పూర్తి చేసుకున్న సుమారు 15 వేల స్కూళ్లలో జూన్ నాటికి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం.
►నాడు–నేడులో ఆఖరు కాంపొనెంట్ కింద 6వ తరగతి, ఆపై తరగతులను డిజిటలైజ్ చేసే కార్యక్రమం చేస్తున్నాం. అంతకంటే దిగువ తరగతుల వారికి స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేస్తున్నాం. వీటితో పాటు పిల్లలకు విద్యాకానుక, గోరుముద్ద, ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్‌ఈ సిలబస్, బైలింగువల్ పాఠ్యపుస్తకాలు, 3వ తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్ల కాన్సెప్ట్, 8వ తరగతి పిల్లలకు ట్యాబ్‌ల పంపిణీ వంటి అనేక విప్లవాత్మక కార్యక్రమాలు చేపడుతున్నాం. పిల్లల కరిక్యులమ్‌ను బైజూస్ కంటెంట్‌తో అనుసంధానం చేస్తూ.. విద్యా రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తున్నాం.
►గతంలో ఎన్నడూ లేని విధంగా ఉన్నత విద్యలో చేరే పిల్లలందరికీ ప్రభుత్వం పూర్తి స్థాయి అండదండలు అందిస్తోంది. ఉన్నత విద్యను అభ్యసిస్తున్న పిల్లల కోసం విద్యా దీవెన కింద 100 శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్ అందిస్తున్నాం. రూ.20 వేల వరకు వసతి దీవెన అమలు చేస్తున్నాం.
►విదేశీ విద్యా దీవెన కూడా అమలు చేస్తున్నాం. ఈ పథకం కింద ప్రపంచ వ్యాప్తంగా అత్యుత్తమమైన 50 కాలేజీలలో, 21 రకాల విభాగాలు, లేదా కోర్సులకు సంబంధించి సీట్లు సాధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రూ.1.25 కోట్ల వరకు, మిగిలిన వారికి రూ.1 కోటి వరకు ప్రభుత్వం అందిస్తుంది.
►రేపు (నేడు) కళ్యాణమస్తు ప్రారంభిస్తున్నాం. ఈ పథకంలో అర్హత పొందాలంటే కనీసం పదోతరగతి పాస్ కావాలనే నిబంధన విధించాం. ఈ కార్యక్రమంలో విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, పాఠశాల విద్యా శాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్, ఏపీఈడబ్ల్యూఐడీసీ ఎండీ సీ ఎన్ దీవాన్‌రెడ్డి, మిడ్ డే మీల్స్ డైరెక్టర్ నిధి మీనా, సత్యసాయి సెంట్రల్ ట్రస్టు ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
37,63,698 విద్యార్థులకు పౌష్టికాహారం
జగనన్న గోరుముద్ద ద్వారా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 44,392 స్కూళ్లలో 37,63,698 మంది విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందిస్తోంది. పిల్లల్లో ఐరన్, కాల్షియం లోపాలు లేకుండా నివారించడానికి ఈ పథకం కింద తాజాగా రాగి జావను చేర్చింది.
బడి ఈడు పిల్లల నమోదును పెంచడంతో పాటు వారిలో ధారణ సామర్థ్యం మెరుగుపర్చి, డ్రాపౌట్స్‌ను తగ్గించే కార్యక్రమాల్లో భాగంగా వారికి స్కూల్లోనే రుచికరమైన పౌష్టికాహారాన్ని మధ్యాహ్న భోజనంలో అందిస్తోంది.
రోజుకో మెనూలో భాగంగా పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించడానికి వారంలో 5 రోజులు గుడ్డు, మూడు రోజులు బెల్లం, పల్లీ చిక్కీ.. చిక్కీ ఇవ్వని రోజుల్లో చిరుధాన్యాలను మధ్యాహ్న భోజనంలో భాగం చేయించారు. తాజాగా వారంలో మూడు రోజులు రాగి జావ ఇవ్వనున్నారు.
ఒప్పందం మూడేళ్లు
సీఎం ఆలోచనలు, ఆదేశాలతో మార్చి 2 నుంచి రాగి జావను జగనన్న గోరుముద్ద పథకంలో భాగంగా అందించనున్నాం. దీనికి రూ.86 కోట్లు అదనంగా ఖర్చవుతుంది. ఇందులో సత్యసాయి ట్రస్టుకు భాగస్వామ్యం కల్పించాం.
దీనికి అవసరమైన రాగి పిండి, బెల్లం పిండి ట్రస్టు సరఫరా చేస్తుంది. దీని ఖరీదు సుమారు రూ.42 కోట్లు ఉంటుంది. మూడేళ్ల పాటు వీరు సరఫరా చేస్తారు. దీనికి సంబంధించి ఇవాళ ఒప్పందం చేసుకుంటున్నాం.
– బొత్స సత్యనారాయణ, విద్యా శాఖ మంత్రి
సీఎం కృషితో విద్యా రంగానికి పునరుజ్జీవం
పిల్లలకు రాగి జావ ఇవ్వడం మంచి కార్యక్రమం అని మా ట్రస్టు సభ్యులందరూ చెప్పడంతో ముందుకొచ్చాం. సీఎం జగన్ నాయకత్వంలో విద్యా రంగానికి పునరుజ్జీవనం వచ్చింది. సీఎం చెబుతున్న ప్రతి మాట అమలు చేసి చూపిస్తున్నారు.
విద్యా రంగంలో పథకాలన్నీ అద్భుతం. అమ్మచేతి గోరుముద్ద గుర్తుకు వచ్చేలా మధ్యాహ్న భోజనానికి మంచి పేరు పెట్టారు. ప్రభుత్వ బడులను కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా మారుస్తున్నారు. కొత్త జిల్లాకు శ్రీ సత్యసాయి జిల్లాగా పేరు పెట్టినందుకు ధన్యవాదాలు.
– రత్నాకర్, శ్రీ సత్యసాయి మేనేజింగ్ ట్రస్టీ
Comments
Please login to add a commentAdd a comment