అల్ప సంఖ్యాకులకు అగ్రపీఠం  | A top seat for low numbers | Sakshi
Sakshi News home page

అల్ప సంఖ్యాకులకు అగ్రపీఠం 

Published Thu, Sep 28 2023 3:56 AM | Last Updated on Thu, Sep 28 2023 3:56 AM

A top seat for low numbers - Sakshi

రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాల ద్వారా మైనార్టీలకు అండగా నిలుస్తోంది.  2019 నుంచి ఇప్పటివరకు 50,07,259 మంది మైనార్టీలకు రూ. 23,167.93 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో డీబీటీ ద్వారా రూ. 12,366.91 కోట్లు, నాన్‌డీబీటీ ద్వారా రూ. 10,801.02 కోట్లు అందించింది. స్వతంత్ర భారతదేశంలో మైనార్టీలను ఓటు బ్యాంకు కోసమే వినియోగించుకున్నారు.

కానీ మైనార్టీ సంక్షేమం కోసం గతంలో వైఎస్సార్, ఇప్పుడు జగన్‌ మాత్రమే కృషి చేశారు. మైనార్టీ సంక్షేమమంటే గుర్తొచ్చేది దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ పేరే. సీఎం వైఎస్‌ జగన్‌ కూడా మైనార్టీల సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. గత టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో మైనార్టీల కోసం రూ. 2,665 కోట్లు ఖర్చు చేస్తే, జగన్‌ ప్రభుత్వం 50 నెలల్లో రూ. 23,167.93 కోట్లు ఖర్చు చేసి, గత ప్రభుత్వం కంటే 10 రెట్లు అధికంగా నిధులు వెచ్చించింది.   – డిప్యూటీ సీఎం అంజద్‌ బాషా 

మైనార్టీ రెసిడెన్షియల్‌ స్కూల్‌ ఏర్పాటు చేయండి 
ప్రభుత్వం మైనార్టీల కోసం 38 పథకాలు అమలు చేస్తోంది. గత ప్రభుత్వంలో ఇమామ్‌లు, మౌజమ్‌లకు, పాస్టర్లకు ఎ­లాంటి గుర్తింపుగాని, గౌరవ వేతనంగాని ఇవ్వలేదు. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ అందరితోపాటు మైనార్టీ కుటుంబా­లు ఆర్థికంగా ఎదిగేలా చేశారు. పీలేరు చుట్టుపక్కల మైనార్టీ బాలికలు చదువుకునేందుకు దూరంలో ఉన్న కర్నూలుకు వెళ్లాల్సి వస్తోంది. దాం­తో చాలామంది చదువును మధ్యలోనే మానేస్తున్నారు. పీలేరులో మైనార్టీ బా­­లికల రెసిడెన్షియల్‌ పాఠశాల, కళాశాల ప్రారంభిస్తే వారికి మేలు జరుగుతుంది.   – చింతల రామచంద్రారెడ్డి, పీలేరు ఎమ్మెల్యే  

విద్యా సంస్కరణల్లో మనమే మేటి 
ఆంధ్రప్రదేశ్‌లో విద్యారంగానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. ముఖ్యమంత్రి ప్రాధాన్య అంశాల్లో విద్య మొదటి స్థానంలో ఉంది. విద్యా ప్రమాణాల పెంపునకు ఉపాధ్యాయులకు శిక్షణనిస్తున్నాం, విద్యార్థులకు టోఫెల్‌ బోధనకు కూడా టీచర్లకు శిక్షణ ఇవ్వనున్నాం. గతంలో అక్షరాస్యతపై అంటే కేరళ గుర్తుకువచ్చేది. ఇప్పుడు కేంద్ర విద్యాశాఖ మంత్రి సైతం ఆంధ్రప్రదేశ్‌ విద్యా సంస్కరణలను చూసి నేర్చుకోవాలని సూచిస్తున్నారంటే మనం ఎంత ప్రగతి సాధించామో తెలుస్తుంది.

మూడో విడత నాడు–నేడులో రూ. 8 వేల కోట్లతో పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నాం. డిసెంబర్‌ 21న 8వ తరగతి విద్యార్థులకు బైజూస్‌ కంటెంట్‌తో ట్యాబ్స్‌ ఇవ్వనున్నాం. ప్రభుత్వ బడుల్లో సీబీఎస్సీ అమలుతో ఆ బోర్డు మన రాష్ట్రంలో ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేసింది. ఉన్నత విద్యలో రూ. 15,600 కోట్ల నిధులను విద్యాదీవెన, వసతి దీవెన కింద ఖర్చు చేశాం. ఇంజినీరింగ్‌ చదువుతున్న 1.69 లక్షల మందికి మైక్రోసాఫ్ట్‌ సర్టిఫికేషన్‌ కోర్సులు ఉచితంగా అందిస్తున్నాం.

వర్సిటీల్లో 15 ఏళ్లుగా ఖాళీగా ఉన్న 3,268 పోస్టులను భర్తీ చేసేందుకు సీఎం నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులకు విదేశీ వర్సిటీలతో జాయింట్‌ సర్టిఫికేషన్‌ కూడా అందించనున్నాం. దీనివల్ల మన విద్యార్థులకు అంతర్జాతీయంగా అవకాశాలు వేగంగా పొందుతారు. రెసిడెన్షియల్‌ పాఠశాలల్లోని విద్యార్థుల ఆరోగ్యం పరిశీలించేందుకు కొందరు ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నాం.  – మంత్రి బొత్స సత్యనారాయణ   

ఏజెన్సీ పాఠశాలలకు అధిక నిధులివ్వండి 
పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అనేక సంస్కరణలు అమలు చేస్తున్నారు. ఇంగ్లిష్‌ మీడియం, సీబీఎస్‌ఈ సిలబస్‌ వంటివి మన విద్యారంగం గతిని మార్చాయి. నాడు–నేడు కింద 56 వేల స్కూల్స్‌ను బాగుచేస్తున్నారు. ఇందులో గిరిజన నియోజకవర్గాల్లో 1,400 స్కూళ్లు కూడా ఉన్నాయి.

ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న 1,000 సింగిల్‌ టీచర్‌ పాఠశాలలకు భవనాలు లేవు. నాడు–నేడు కింద భవనాలు నిర్మిస్తే గిరిజన పిల్లలకు మేలు జరుగుతుంది. అదనపు గ్రాంట్‌ మంజూరు చేసి భవనాలు నిరి్మంచాలి. గతంలో ఆశ్రమ స్కూల్స్‌లో హెల్త్‌ వలంటీర్లు ఉండేవారు. రాత్రివేళ ఆయా పిల్లలకు ఆరోగ్య సమస్యలను తీర్చేందుకు హెల్త్‌ వలంటీర్లను నియమించాలి.   – నాగులపల్లి ధనలక్ష్మి , రంపచోడవరం ఎమ్మెల్యే 

విద్యలో విప్లవాత్మక మార్పులు 
విద్యారంగంలో ఇటు తల్లిదండ్రులకు, అటు విద్యార్థులకు మేలు జరిగేలా అనేక పథకాలను సీఎం ప్రవేశపెట్టారు. ప్రతి మండలానికి రెండు జూనియర్‌ కాలేజీలు కూడా మంజూరు చేశారు. మా నియోజకవర్గంలోని మూడు మండలాల్లోనూ కాలేజీలు వచ్చాయి. పెరవలి మండలం అన్నవరప్పాడు గ్రామంలో ఎంపీపీ స్కూల్‌ అభివృద్ధికి నిధులు కేటాయించాలి. నిడదవోలు టౌన్‌లో అంతర్భాగమైన లింగంపల్లి గ్రామం.. టౌన్‌కు దూరంగా ఉంది. ఇక్కడి స్కూల్‌ను మెర్జింగ్‌ చేయడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ స్కూల్‌ను డీమెర్జింగ్‌ చేయాలి.   – జి.శ్రీనివాసనాయుడు, నిడదవోలు ఎమ్మెల్యే  

మన విద్యార్థుల అంతర్జాతీయ ఖ్యాతి 
నాలుగున్నరేళ్లలో ప్రభుత్వ నిర్ణయాలతో విద్యారంగం మెరుగుపడింది. మన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అంతర్జాతీయంగా రాణిస్తున్నారు. ఫౌండేషన్‌ స్కూల్స్‌ను తీసుకువచ్చాం. అయితే ఉత్తమ ఫలితాలు రావాలంటే వాటిలో బోధకులకు శిక్షణ ఇవ్వాలి. సీఎం లక్ష్యం నెరవేరాలంటే శిక్షణ, బోధనపై పూర్తి అజమాయిషీ అవసరం. దీనికోసం సరైన కార్యాచరణ రూపొందించాలి.   – డాక్టర్‌ ఎం.జగన్మోహన్‌రావు, నందిగామ ఎమ్మెల్యే 

పాఠశాలల్లో పిల్లలకు డైనింగ్‌ ఏర్పాటు చేయండి 
గత ప్రభుత్వం విద్యను వ్యాపారం చేయడంతో పేద కుటుంబాలు అక్షరానికి దూరమయ్యాయి. ఇప్పుడు సీఎం జగన్‌ విద్యకు అధిక ప్రాధాన్యం ఇచ్చి అనేక పథకాల ద్వారా 42 లక్షల మంది పిల్లలను బడిబాట పట్టించారు. నాడు–నేడు కింద 56 వేల స్కూల్స్‌ను బాగుచేస్తున్నారు. సీబీఎస్సీ సిలబస్, బైలింగువల్‌ బుక్స్, పౌష్టికాహారం అందిస్తున్నారు. అయితే, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం చేసేందుకు పిల్లలకు డైనింగ్‌ హాల్‌ ఏర్పాటు చేయాలి. దీనికి స్కూల్లో ఓ గదిని కేటాయిస్తే మంచిది. విద్యారంగంలో మెరుగైన ఫలితాల కోసం ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలి.   – కిలారి వెంకట రోశయ్య, పొన్నూరు ఎమ్మెల్యే 

ఏపీలో బెస్ట్‌ విద్యా వ్యవస్థ ఉంది 
రాష్ట్రంలో పాఠశాలల అభివృద్ధికి నాడు–నేడు విధానాలు పరిశీలించేందుకు తెలంగాణ అధికారులు ఇక్కడకు వస్తున్నారు. చాలా స్కూల్స్‌లో ప్లస్‌ 2 అందుబాటులోకి తెచ్చాం. అయితే, టీచర్లకు సరైన శిక్షణ లేదని తల్లిదండ్రుల్లో నిరుత్సాహం కనిపిస్తోంది. దీనిపై అధికారులు, మంత్రులు దృష్టిపెట్టి, ఇంటర్‌ బోధించేవారికి శిక్షణ ఇవ్వాలి. నైపుణ్యం ఉన్నవారికే ఆ స్కూల్స్‌లో బోధనా అవకాశం ఇవ్వాలి. దీంతో పాటు ప్రభుత్వ స్కూళ్లలో విశాలమైన మైదానాలు ఉన్నాయి. స్పోర్ట్స్‌ను కూడా ప్రోత్సహించాలి. అన్ని స్కూళ్లలోను పీఈటీలను నియమించాలి.   – సామినేని ఉదయభాను, జగ్గయ్యపేట ఎమ్మెల్యే 

విద్యార్థుల్లో రీడింగ్‌ స్కిల్స్‌ పెంచండి 
స్వతంత్ర భారత చరిత్రలో విద్యలో ఇన్ని సంస్కరణలు తీసుకువచ్చిన రాష్ట్రం దేశంలో ఆంధ్రప్రదేశ్‌ మాత్రమే. అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి. అయితే, ఆ­రు, ఏడు తరగతులకు రీడింగ్‌ స్కిల్స్‌ తక్కువగా ఉన్నాయి. ఉపాధ్యాయులు సి­ల­­బస్‌ పూర్తిచేసేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారు తప్ప నైపుణ్యం పెంపుపై దృష్టి పెట్టలేదు. ఆరు నుంచి 8 తరగతులకు స్పోకెన్‌ ఇంగ్లిష్‌ శిక్షణ ఇస్తే రెండేళ్లలో అద్భుతంగా రాణిస్తారు. దీంతోపాటు అన్ని స్కూళ్లకు వాచ్‌మెన్లను నియమించాలి.  
– కేపీ నాగార్జునరెడ్డి, మార్కాపురం ఎమ్మెల్యే 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement