‘‘జగన్ అనే నేను..’’ అభిమాన జనం.. జయజయధ్వానాల మధ్య ఆ మాట వినిపించి సరిగ్గా సంవత్సరమయ్యింది. ప్రమాణస్వీకారం నాడు ప్రారంభమైన సంక్షేమ రథం విరామంలేకుండా పరుగులు తీస్తోంది. పేదల కోసం రెండడుగులు ముందుకే వేస్తున్నాడని అడుగడుగునా నిరూపితమయ్యింది. అనుభవజ్ఞులను మించిన ‘మంచి ముఖ్యమంత్రి’ అంటూ దేశమంతా కితాబులిచ్చింది. పథకాల అమలులోనే కాదు పాలనలోనూ ఓ కొత్త శైలి.. ప్రతి అడుగులో ఓ కొత్త ఒరవడి...
నేటి కంటే రేపు బావుండటాన్ని.. అభివృద్ధి అంటాం. ప్రతి పేదవాడి ఇంట్లో నుంచి ఒక ఇంజనీరో, ఒక డాక్టరో, ఒక కలెక్టరో వచ్చినప్పుడే వారు పేదరికం నుంచి బయటపడినట్లు, అభివృద్ధి చెందినట్లు లెక్క. ఈ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తొలి ఏడాదిలోనే బలంగా అడుగులు ముందుకు వేశారు. అన్ని వర్గాల వారికి భరోసా ఇచ్చేలా రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు, కార్యక్రమాలే ఇందుకు నిదర్శనం.
సాక్షి, అమరావతి: ఏడాది పాలనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ సంతకం చేశారు. ఏడాది పాలనలో వినూత్న, విప్లవాత్మక నిర్ణయాలకు శ్రీకారం చుట్టడం ద్వారా చరిత్ర గతిని మార్చారు. ప్రతి గడపకు ప్రభుత్వ సేవలను తీసుకెళ్లిన ఘనతను సొంతం చేసుకున్నారు. ఎన్నికల్లో తనపై అత్యధిక శాతం ప్రజల్లో వ్యక్తమైన విశ్వాసం మరింతగా పెంపొందించేలా.. అత్యల్ప శాతం ప్రజల్లో వ్యక్తమైన అనుమానాలను నివృత్తి చేసేలా.. అన్ని వర్గాల ప్రజలు సగర్వంగా తలెత్తుకునేలా ఏడాది పాలన జనరంజకంగా సాగింది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే పెన్షన్‌లను రూ.2,250కి పెంచుతూ మొదటి సంతకం చేసి ‘ఎన్నికల మేనిఫెస్టో’ అమల్లో తొలి అడుగే బలంగా వేశారు. అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా.. సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ 25 మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయడం ద్వారా సరి కొత్త చరిత్రను లిఖించారు. ప్రజల జీవన ప్రమాణాలను పెంచడమే రాష్ట్ర సమగ్రాభివృద్ధికి సూచిక(ఇండెక్స్)గా నిర్దేశించుకున్న వైఎస్ జగన్.. అన్ని రంగాల్లోనూ సంస్కరణలకు శ్రీకారం చుట్టారు.
నాణ్యమైన విద్య నుంచి ఉపాధి దాకా..
► విద్యార్థులకు బంగారు భవిత కోసం విద్యా రంగంలో విప్లవాత్మక సంస్కరణల అమలుకు నడుం బిగించారు. పిల్లలందరినీ బడులకు పంపేలా తల్లులకు ఆర్థికంగా ఊతమిచ్చేలా ‘అమ్మ ఒడి’ కింద రూ.15 వేలు అందజేయడంతోపాటు ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా.. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ‘నాడు–నేడు’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు.
► పిల్లలకు ఉచితంగా పుస్తకాలు, నోట్‌బుక్స్, యూనిఫామ్‌లు తదితరాలు సమకూర్చేలా ‘విద్యా కానుక’.. ఉన్నత చదువులను నిరుపేద విద్యార్థులకు అందించే లక్ష్యంతో ఫీజు రీయింబర్స్ చేయడానికి ‘విద్యా దీవెన’.. ఉన్నత చదువులు చదివే విద్యార్థుల వసతి, హాస్టల్ ఖర్చుల కోసం ‘వసతి దీవెన’ పథకాలు ప్రారంభించారు. క్రమం తప్పకుండా ప్రభుత్వ ఉద్యోగాల నియామకానికి పరీక్షలు నిర్వహిస్తామని ఇచ్చిన హామీ అమలులో భాగంగా తొలి ఏడాదే గ్రామ సచివాలయాల్లో 1.34 లక్షల మంది ఉద్యోగులను, 2.75 లక్షల మందిని వలంటీర్లుగా నియమించారు.
► పరిశ్రమల్లో స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని చట్టం చేసి– ఉపాధికి ఢోకా లేకుండా చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధన చేయడం ద్వారా పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడం నుంచి ఉపాధికి భరోసా కల్పించేలా సంస్కరణలను అమలు చేస్తూ విద్యారంగంలో సరి కొత్త చరిత్ర సృష్టించారని విద్యావేత్తలు అభినందిస్తున్నారు.
ఆరోగ్యమే మహాభాగ్యం
► వైద్యం కోసం పేదలు అప్పుల పాలు కాకూడదన్నది సీఎం వైఎస్ జగన్ అభిలాష. ప్రైవేటు ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పించడానికి ‘నాడు–నేడు’కు శ్రీకారం చుట్టారు.
► డాక్టర్లు, నర్సులు తదితర ఉద్యోగాలు భర్తీ చేయాలని ఆదేశించారు. ఏడాదికి రూ.5 లక్షల వరకూ ఆదాయం ఉన్న వారందరినీ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చారు. వైద్య చికిత్స వ్యయం రూ.వెయ్యి దాటితే.. వాటిని ఆరోగ్యశ్రీ కింద చెల్లింపులు చేయాలని నిర్ణయించారు. ఆరోగ్యానికి భరోసా కల్పించడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను పెంచడానికి బాటలు వేశారంటూ వైద్య నిపుణులు, సామాజికవేత్తలు అభినందిస్తున్నారు.
► మద్యపాన నియంత్రణ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారని.. ఇప్పటికే బెల్ట్ షాపులు మూతపడ్డాయని.. మద్యం దుకాణాల సంఖ్య గణనీయంగా తగ్గించారని.. మద్యం సీసాను ముట్టుకోవాలంటేనే షాక్ కొట్టేలా ధరలు పెంచారని, ఇది ప్రజల జీవన ప్రమాణాలపై గణనీయమైన ప్రభావం చూపుతోందని సామాజికవేత్తలు విశ్లేషిస్తున్నారు.
► విదేశాల నుంచి వచ్చిన వారిని క్వారంటైన్‌లో ఉంచి, వైద్య సేవలు అందించడం.. ఎక్కువ పరీక్షలు చేయడం ద్వారా బాధితులను గుర్తించి ఆసుపత్రుల్లో చికిత్స అందించడం ద్వారా కరోనా వ్యాధి విస్తరణకు అడ్డుకట్ట వేయడంలో సీఎం వైఎస్ జగన్ విజయం సాధించారని వైద్య నిపుణులు ప్రశంసిస్తున్నారు.
మేనిఫెస్టోకు సిసలైన నిర్వచనం
► ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా 341 రోజులపాటు 3,648 కిలోమీటర్ల మేర నిర్వహించిన పాదయాత్ర ద్వారా కష్టాల్లో ఉన్న ప్రజలకు ‘నేను విన్నాను.. నేను ఉన్నాను’ అని భరోసా ఇస్తూ ఇచ్చిన హామీలనే ఎన్నికల మేనిఫెస్టోగా ప్రకటించిన వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ 50 శాతం ఓట్లతో.. 86 శాతం శాసనసభ.. 92 శాతం లోక్‌సభ స్థానాలను దక్కించుకుని చారిత్రాత్మక విజయాన్ని సాధించింది.
► ప్రజలు తనపై పెట్టుకున్న విశ్వాసాన్ని.. మరింతగా పెంపొందించేలా అధికారం చేపట్టాక తొలి ఏడాదిలోనే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 90 శాతానికిపైగా అమలు చేయడం ద్వారా వైఎస్ జగన్.. ప్రజాస్వామ్య చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెర తీశారని రాజకీయ విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు.
► టీడీపీ సర్కార్ చేసిన అప్పుల వల్ల రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, లాక్ డౌన్ నేపథ్యంలో ప్రభుత్వ ఆదాయం తగ్గిపోయినప్పటికీ, సంక్షేమ పథకాల అమలుకు బ్రేక్ వేయకుండా.. నిధులు విడుదల చేయడాన్ని బట్టి చూస్తే సామాజిక భద్రతకు సీఎం జగన్ ఎంత ప్రాముఖ్యతను ఇస్తున్నారన్నది విశదమవుతుందని సామాజిక వేత్తలు స్పష్టం చేస్తున్నారు.
► నామినేటెడ్ పదవులు, పనుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏకంగా చట్టం తీసుకొచ్చారు. మహిళల భద్రత కోసం దేశం యావత్తు మనవైపు చూసేలా ‘దిశ’ చట్టం చేశారు.
పండగలా వ్యవసాయం
► పెట్టుబడులకు రైతులు ఇబ్బందులు పడకుండా ‘రైతు భరోసా’ కింద ఏటా రూ.13,500ను ప్రభుత్వం అందజేస్తోంది. రాయితీపై విత్తనాలు, ఎరువులను సరఫరా చేస్తోంది. వ్యవసాయ సహాయకుల ద్వారా పంటల సాగులో సలహాలను అందజేస్తోంది.
► పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం కోసం సర్కారే కొనుగోలు చేస్తుండటంతో వ్యాపారులు కనీస మద్దతు ధర మేరకు పంటలను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెట్టుబడి నుంచి పంట కొనుగోలు వరకూ.. రైతుకు ప్రభుత్వం దన్నుగా నిలుస్తుండటంతో వ్యవసాయం పండగలా మారిందని వ్యవసాయ శాస్త్రవేత్తలు ప్రశంసిస్తున్నారు.
సుపరిపాలన.. పారదర్శకత..
► సుపరిపాలన అందించడానికి విప్లవాత్మక సంస్కరణలకు సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేయడం కోసం దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని రీతిలో సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు.
► టీడీపీ సర్కార్ ఇంజనీరింగ్ పనుల్లో పాల్పడిన అక్రమాలను ప్రక్షాళన చేసి.. వాటికి రివర్స్ టెండరింగ్ నిర్వహించడం ద్వారా తొలి ఏడాదిలోనే రూ.2,080 కోట్లను ఖజానాకు మిగిల్చారు.
సమగ్రాభివృద్ధి దిశగా అడుగులు
► రాష్ట్రంలో ఎన్నడూ లేని రీతిలో ఈ ఏడాది రికార్డు స్థాయిలో గోదావరి, కృష్ణా, వంశధార, పెన్నా, నాగావళి నదీ జలాలను ఆయకట్టుకు అందించడంలో సర్కార్ విజయవంతమైంది.
► ఖరీఫ్‌లో కోటి ఎకరాలకు.. రబీలో 20.77 లక్షల ఎకరాలకు నీళ్లందించడం వల్ల రికార్డు స్థాయిలో దిగుబడులు రావడంతో రైతులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు.
► రాష్ట్రాన్ని సుభిక్షం చేయడానికి దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా చేపట్టిన పోలవరంతోపాటు ఇతర ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయడం.. నదీ వరద జలాలను ఒడిసి పట్టి బంజరు భూములను సుభిక్షం చేసి.. రాష్ట్రానికి అన్నపూర్ణగా ఉన్న నామధేయానికి సార్థకత చేకూర్చడం కోసం పంచశీల ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు.
► పారిశ్రామికాభివృద్ధికీ పెద్దపీట వేస్తున్నారు. తొలి ఏడాదిలోనే 39 భారీ, మధ్యతరహా పరిశ్రమలు ఉత్పత్తిని ప్రారంభించేలా చేశారు. దీనివల్ల 34,822 మందికి ఉపాధి దొరికింది. కొత్తగా ఏడాదిలో 13,122 సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. వీటి వల్ల రూ.2503 కోట్ల పెట్టుబడితో 63,897 మందికి ఉద్యోగాలు వచ్చాయి. ప్రభుత్వ పారదర్శక విధానాల వల్ల రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారు.
ఏడాది పాలనపై నిజాయితీగా సమీక్ష
ఏడాది పాలనపై గత ఐదు రోజులుగా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిజాయితీగా సమీక్షించుకున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబులా నేల విడిచి సాము చేయలేదన్నారు. తొలి ఏడాదిలోనే మేనిఫెస్టోలోని హామీలు దాదాపు పూర్తి చేశారని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ట్వీట్ చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వచ్చిన వారికి చేసిన మంచి పనులు, సంక్షేమ పథకాలు తెలియజేసి నిజాయితీగా, వినమ్రతతో సలహాలు సూచనలు తీసుకున్నారని వివరించారు. ఏడాది కాలంలో సీఎం వైఎస్ జగన్ పూర్తిగా పని మీదే దృష్టి పెట్టారని చెప్పారు. సంక్షేమ పథకాల క్యాలెండర్‌ను విడుదల చేసి కొత్త ఒరవడికి పునాదులు వేశారన్నారు. వీటి అమలును పటిష్టం చేసుకుంటూ నీటిపారుదల, పారిశ్రామికరంగం, విద్యా వైద్య రంగాల్లో మౌలికసదుపాయాల కల్పనతో దేశంలోనే నంబర్–1 చేసే దిశలో అడుగులేస్తున్నారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment