సాక్షి. హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మే నుంచి చేపట్టి వచ్చే విద్యా సంవత్సరం ఆరంభానికల్లా ఈ ప్రక్రియ పూర్తి చేయాలనే లక్ష్యంతో విద్యాశాఖ ఉంది. కొత్త జిల్లాలకు ఉద్యోగుల కేటాయింపు చేపట్టిన తర్వాత టీచర్ పోస్టులపై ఓ స్పష్టత వచ్చిందని అధికారులు అంటున్నారు.
ఎక్కడ టీచర్ల నియామకం చేపట్టాలి? ఎక్కడ అవసరం లేదనే విషయాలపై సమగ్ర సమాచారం సేకరించినట్టు చెబుతున్నారు. కొన్ని జిల్లాల్లో అవసరమైన దానికంటే ఎక్కువమంది టీచర్లు ఉంటే, కొన్ని జిల్లాల్లో తక్కువగా ఉన్నారు. విద్యార్థుల సంఖ్యతో పోల్చుకుంటే మొత్తంగా దాదాపు 7 వేల మంది టీచర్లు ఎక్కువగా ఉన్నట్టు తెలుసోంది. వీరిని విద్యార్థులు ఎక్కువ ఉండే పాఠశాలల్లో సర్దుబాటు చేయాలని భావిస్తున్నారు.
అదే విధంగా ప్రవేశాలు తక్కువ ఉండే స్కూళ్లను సమీపంలోని స్కూళ్లలోకి మార్చాలనే ఆలోచనలో ఉన్నారు. ప్రభుత్వం ఇంగ్లిష్ మీడియం విద్యను క్షేత్ర స్థాయి నుంచి అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో హేతుబద్ధీకరణపై ప్రధానంగా దృష్టి పెట్టారు.
వరంగల్ జిల్లాలో ప్రతి 12 మందికి ఒక టీచర్!
రాష్ట్రంలో 26 వేలకు పైగా ప్రభుత్వ స్కూళ్లున్నాయి. వీటిల్లో దాదాపు 1.03 లక్షల మంది ఉపాధ్యాయులున్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రతి 40 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉండాలి. అయితే తాజాగా విద్యాశాఖ సేకరించిన గణాంకాల ప్రకారం సగటున ప్రతి 23 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉన్నట్టు తేలింది. 0–5వ తరగతి వరకు అయితే సగటున ప్రతి 20 మందికీ ఒక ఉపాధ్యాయుడు ఉన్నారు.
20 జిల్లాల్లో విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగానే టీచర్లు కూడా ఉన్నారు. అయితే అన్ని జిల్లాల్లోనూ ఈ తరహా సగటు కన్పించడం లేదు. వరంగల్ జిల్లాలో ప్రతి 12 మందికి ఒక టీచర్ ఉంటే, జోగుళాంబ గద్వాల జిల్లాలో మాత్రం 32 మందికి ఒక టీచర్ ఉన్నారు. ఈ వివరాలన్నీ పరిశీలిస్తే ఎక్కువమంది టీచర్లు ఉన్నారని అర్థమవుతోందని విద్యాశాఖ పేర్కొంటోంది.
సబ్జెక్టు టీచర్లే సరిపడా లేరు
జాతీయ విద్యావిధానం ప్రకారం మొత్తంగా టీచర్ల సంఖ్య ఎక్కువగా ఉన్నా.. హైస్కూల్ స్థాయిలో సబ్జెక్టు టీచర్ల కొరత ఉన్నట్టు అధికారులు గుర్తించారు. గత రెండేళ్లుగా కరోనా విసిరిన సవాళ్ల నేపథ్యంలో ప్రభుత్వ స్కూళ్లల్లో విద్యార్థుల చేరికలు 2.5 లక్షల వరకు పెరిగాయి. దీనివల్ల కూడా హైస్కూల్ స్థాయిలో సబ్జెక్టు టీచర్ల కొరత ఎక్కువగా కన్పిస్తోంది.
కుమురం భీం జిల్లాలో 65 మందికి, వికారాబాద్‌లో 55 మందికి, జోగుళాంబ గద్వాల జిల్లాలో 48 మందికి, నాగర్ కర్నూల్‌లో 58 మందికి ఒక టీచర్ మాత్రమే ఉన్నట్టు తేలింది. విద్యాశాఖ గణాంకాలను పక్కన పెడితే రాష్ట్రవ్యాప్తంగా 18 వేల మంది టీచర్ల కొరత ఉందనేది అనధికార అంచనా కాగా ఇందులో సింహభాగం 6 నుంచి 10 వరకు బోధించే సబ్జెక్టు టీచర్ల కొరతే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సబ్జెక్టు టీచర్ల భర్తీ విషయంలో విద్యాశాఖ ప్రభుత్వానికి పలు సిఫారసులు చేస్తోంది.
నియామకాలా? సర్దుబాటా?
డీఎస్సీ ద్వారా ప్రత్యక్ష నియామకం చేపట్టడం మొదటిదైతే, ఇప్పటికిప్పుడు ఇది సా«ధ్యం కానప్పుడు కనీసం విద్యా వాలంటీర్లనైనా తీసుకోవాలని చెబుతోంది. ఇందులో కూడా సబ్జెక్టులు బోధించే వారికే అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంటోంది. హేతుబద్ధీకరణ చేపడితే స్కూళ్లు, టీచర్ల సర్దుబాటు పూర్తవుతుందని, అప్పుడు వాస్తవంగా ఎంత మంది టీచర్ల అవసరం ఉంటుందనేది నిర్ధారించే వీలుందని ఓ సీనియర్ అధికారి తెలిపారు. మే నుంచి ఇందుకు సంబంధించిన కసరత్తు ప్రారంభమయ్యే వీలుందని అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment