సాక్షి, హైదరాబాద్: తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్ వ్యవహారంలో సంచలనం కలిగించే విషయాలను విద్యాశాఖ గుర్తించింది. దీని వెనుక ఓ మాఫియానే ఉందని తెలుసుకుంది. ఉన్నతాధికారులను సైతం ఈ మాఫియా రిమోట్ కంట్రోల్‌తో నడిపించినట్టు భావిస్తోంది. మంచి వ్యక్తిగత రికార్డు ఉన్న వాళ్లు సైతం అక్రమానికి అండగా నిలవడం విద్యాశాఖ ఉన్నతాధికారులను ఆశ్చర్యపరుస్తోంది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు చెందిన తెలుగు అకాడమీ నిధులు రూ. 65 కోట్లు గోల్‌మాల్ అవ్వడం తెలిసిందే.
ఈ వ్యవహారంపై ఒకపక్క పోలీసు విచారణ జరుగుతుండగానే, విద్యాశాఖ కమిషనర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఉమర్ జలీల్, అకౌంట్స్ ఆఫీసర్ రాంబాబు, కాలేజీ ఎడ్యుకేషన్ జాయింట్ డైరెక్టర్ యాదగిరితో విచారణ కమిటీని వేసింది. గోల్‌మాల్‌ను అన్ని కోణాల్లో పరిశీలించిన ఈ కమిటీ ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఇందులో కొన్ని కొత్త అంశాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.
మాఫియా గుప్పిట్లో అధికారుల గుట్టు!
విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం... నిధుల గోల్‌మాల్ వ్యవహారంలో ఇప్పటివరకు తెరమీద కన్పించిన పాత్రలే కాకుండా, మరికొంత మంది కూడా ఉన్నారు. రాష్ట్ర లీడ్ బ్యాంక్ ఎస్‌బీఐలో చేయాల్సిన డిపాజిట్లను అనేక బ్యాంకులకు దారి మళ్లించేందుకు ఈ మాఫియానే ముందుగా ప్రణాళిక రూపొందించినట్టు సమాచారం. తెలుగు అకాడమీ, విద్యాశాఖకు చెందిన కొంతమంది ఉద్దేశపూర్వకంగా దీనికి చేయూతనిచ్చినట్లు తెలుస్తోంది.
మరికొంత మందిని వారి వ్యక్తిగత బలహీనతలను ఆధారంగా చేసుకుని ట్రాప్ చేసినట్టు విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ వ్యవహారంలో కీలకపాత్ర పోషించిన మహిళా బ్యాంకు అధికారి గురించి అనేక కోణాల్లో విచారణ జరిపారు. ఆమె డబ్బుకు లొంగిందా? ట్రాప్‌లో చిక్కుకుందా? అనే అనుమానాలున్నాయని ఆ అధికారి వ్యాఖ్యానించారు. ఆమె ఆర్థిక లావాదేవీలు క్షుణ్ణంగా పరిశీలిస్తే తప్ప ఓ నిర్థారణకు రాలేమని చెప్పారు.
అయితే గోల్‌మాల్ వ్యవహారం మొత్తం తెలిసినా బయటకు పొక్కకుండా జాగ్రత్త పడటం వెనుక బలమైన కారణాలున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నతాధికారుల లావాదేవీలు, వ్యక్తిగత సమాచారం మొత్తం మాఫియా గుప్పిట్లో ఉండటం, వాళ్ళ చేత బ్లాక్ మెయిల్‌కు గురి కావడమూ కొట్టిపారేయలేమని అధికారులు అంటున్నారు.
డబ్బులు వెనక్కి రావాల్సిందే
కుంభకోణంలో మాయమైన ప్రతి పైసా తెలుగు అకాడమీ ఖాతాలోకి రప్పించి తీరుతామని విద్యాశాఖ విశ్వాసం వ్యక్తం చేస్తోంది. ఈ దిశగా ఇప్పటికే ఆర్‌బీఐ ఉన్నతాధికారులతో పలు దఫాలు చర్చలు జరిగాయి. ‘అకాడమీ సొమ్ము దొంగలెత్తుకుపోలేదు... వివిధ బ్యాంకుల్లోకే వెళ్ళింది. కాబట్టి పూర్తి బాధ్యత ఆర్‌బీఐదే’అని అధికారులు అంటున్నారు.
బ్యాంకు వర్గాలు కూడా ఈ వాదనతో ఏకీభవిస్తున్నాయని చెబుతున్నారు. ఇటీవల జరిగిన ఓ సమావేశంలో దీనిపై కొంత స్పష్టత వచ్చినట్టు తెలిసింది. ఆర్‌బీఐకి పూర్తిస్థాయి నివేదిక అందించి, అనుమతి తీసుకున్న తర్వాత అకాడమీ నిధులు తిరిగి ఖాతాలోకి రప్పించే వీలుందని అధికారవర్గాలు చెబుతున్నాయి.
సీనియర్లతో ప్రత్యేక కమిటీ
తెలుగు అకాడమీ నిధులు గోల్‌మాల్ నేపథ్యంలో ఆర్థిక పరమైన విభిన్న కోణాలు తెరమీదకొస్తున్నాయి. వీటిని దర్యాప్తు బృందాలు, విద్యాశాఖ ఉన్నతాధికారులు నిగ్గు తేల్చడం కష్టమని భావిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇద్దరు సీనియర్ ఆడిటర్లతో ఓ కమిటీని ఏర్పాటు చేయాలని విద్యాశాఖకు చెందిన త్రిసభ్య కమిటీ భావిస్తోంది. డిజిటల్ లావాదేవీలతో పాటు నిందితులు వాడిన సెల్‌ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను సాంకేతిక బృందం పరిశీలిస్తుంది. దీనిద్వారా అనేక లింకులు బయటకొచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
నియమ నిబంధనలు పూర్తిగా మార్పు
అకాడమీ నియమ నిబంధనలు కట్టుదిట్టం చేయాలని, పూర్తిగా మార్చాలని అధికారులు నిర్ణయించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిధులు ఇతర బ్యాంకుల్లో డిపాజిట్ చేయకుండా మార్గదర్శకాలు తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే వివిధ బ్యాంకుల్లో ఉన్న అకాడమీకి చెందిన ఫిక్స్‌డ్ డిపాజిట్లను ముందస్తు ఉపసంహరణ (ఫోర్ క్లోజర్) చేయాలని తీర్మానించారు. వడ్డీతో ప్రమేయం లేకుండా ఈ మొత్తాలను ఎస్‌బీఐలోనే సేవింగ్ బ్యాంకు ఖాతాలో వేయాలని విద్యాశాఖ కమిటీ సిఫార్సు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment