‘నిష్ట’ మనమే ఫస్ట్‌  | Teaching methods in Andhra Pradesh are good in Covid Time | Sakshi
Sakshi News home page

‘నిష్ట’ మనమే ఫస్ట్‌ 

Published Fri, Dec 31 2021 6:10 AM | Last Updated on Fri, Dec 31 2021 6:10 AM

Teaching methods in Andhra Pradesh are good in Covid Time - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వేళ విద్యార్థులకు బోధన కుంటుపడకుండా జాగ్రత్తలతోపాటు ఉపాధ్యాయుల సామర్థ్యాలను పెంపొందించేలా శిక్షణ కార్యక్రమాలను నిర్వహించేందుకు ఉద్దేశించిన ప్రతిష్టాత్మక ‘నిష్ట’ కార్యక్రమాల అమలులో ఏపీ దేశంలో అగ్రగామిగా నిలిచిందని కేంద్ర విద్యా శాఖ ప్రశంసించింది. డిజిటల్‌ విద్యాబోధనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ అనుసరించిన పద్ధతులను కేంద్రం అభినందించింది. డిజిటల్‌ బోధనకు సంబంధించిన 18 అంశాలనూ అమలు చేసిందని పేర్కొంది. నూతన అంశాలను అన్వయిస్తూ విద్యార్థులు, ఉపాధ్యాయుల సామర్థ్యాన్ని పెంపొందించేలా ఆన్‌లైన్‌ శిక్షణతో ఏపీలో పలు డిజిటల్‌ కార్యక్రమాలు అమలయ్యాయని పేర్కొంది.

ప్రభుత్వ పాఠశాలల్లో నాడు – నేడులో భాగంగా లాంగ్వేజ్‌ లాబ్‌లు ఏర్పాటుతోపాటు 120 గంటలపాటు ఏకధాటిన ప్రసారమయ్యేలా ఆరు సబ్జెక్టులకు సంబంధించిన కంటెంట్‌ పెన్‌డ్రైవ్‌లో 1,610 వీడియోలను పొందుపరిచారని తెలిపింది. వెయ్యి ఆదర్శ గ్రంథాలయాల ఏర్పాటుతోపాటు లైబ్రరీల డిజిటలైజేషన్‌పై రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు డిజిటల్‌ ఎడ్యుకేషన్‌పై చేపట్టిన కార్యక్రమాలను విశ్లేషిస్తూ ఇండియన్‌ డిజిటల్‌ ఎడ్యుకేషన్‌ నివేదికను కేంద్రం విడుదల చేసింది.  

నివేదికలో ముఖ్యాంశాలు ఇవీ..
నిష్ట.. ఆన్‌లైన్‌ కోర్సులు:  కేంద్ర ప్రభుత్వం ‘నిష్ట’ ఆన్‌లైన్‌ ఫ్లాగ్‌షిప్‌ కార్యక్రమాన్ని పైలెట్‌ ప్రాజెక్టుగా తొలుత ఆంధ్రప్రదేశ్‌లోనే ప్రారంభించింది. ఇందులో ఏపీ దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. 18 మాడ్యూళ్లలో 90 రోజులపాటు ‘నిష్ట’ ఆన్‌లైన్‌ కోర్సులు నిర్వహించారు. 1,03,897 మంది ఉపాధ్యాయులు ప్రైమరీ స్థాయి శిక్షణ పూర్తి చేసుకున్నారు. 97,894 మంది అన్ని మాడ్యూళ్లు పూర్తిచేశారు. వీరందరికీ దీక్ష ప్లాట్‌ఫామ్‌ ద్వారా ధ్రువపత్రాలు అందజేశారు.  
విద్యావారధి... టీవీ పాఠాలు:  ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు దూరదర్శన్‌ ద్వారా నిపుణులతో బోధన అందించారు. పాఠశాలల మూసివేత సమయంలో విద్యార్థుల అభ్యాసానికి ఆటంకం కలగకుండా 2020 జూన్‌ 10 నుంచి 2021 జనవరి 31 వరకు బోధన కొనసాగింది.  
జాగ్రత్తలపై ఉపాధ్యాయులకు శిక్షణ:  కరోనా మహమ్మారి సమయంలో ఎలిమెంటరీ, సెకండరీ స్కూళ్లలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్త్రృత అవగాహన కల్పిస్తూ వాల్‌పోస్టర్లు ప్రచురించారు. ఉయ్‌ లవ్‌ రీడింగ్‌ వర్చువల్‌ ఓరియెంటేషన్‌ కార్యక్రమం ద్వారా భాగస్వాములకు అవగాహన కల్పించింది. 

దీక్షతో లెర్నింగ్‌ సెషన్లు  
ఆంధ్రప్రదేశ్‌లో 2020 ఏప్రిల్‌ 1 నుంచి 2021 జూలై వరకు ‘దీక్ష’లో భాగంగా 12,14,22,509 లెర్నింగ్‌ సెషన్లు పూర్తయ్యాయి. 1,46,324 ఎలిమెంటరీ లెర్నింగ్‌ సెషన్లు పూర్తి చేశారు. 
► పాఠశాలలకు దూరమైన చిన్నారులకు ఇంటివద్దే సేవలందిస్తున్న ఫిజియో థెరఫిస్ట్‌ల పనితీరును ప్రభుత్వం ఎప్పటికప్పుడు డాష్‌బోర్డ్‌ ద్వారా తెలుసుకుంది.  
► టీవీ ద్వారా బోధన అర్థం చేసుకునేందుకు విద్యార్థులకు వర్క్‌బుక్స్‌ అందజేసింది.  
► తొమ్మిది, పదో తరగతి విద్యార్థులతో వాట్సాప్‌ గ్రూపులను ఉపాధ్యాయులు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించారు. ఈ–కంటెంట్‌ను ఎప్పటికప్పుడు వాట్సాప్‌ ద్వారా విద్యార్థులకు అందజేశారు. 
► విద్యార్థులకు సాంకేతిక సదుపాయాలపై సర్వే చేపట్టారు.  
► కఠినమైన పాఠ్యాంశాలకు సంబంధించి జూమ్‌ తరగతులు నిర్వహించారు.  
► పాఠశాలు పునఃప్రారంభం కాగానే పాఠశాలల్లో విద్యార్థులను ట్రాక్‌ చేసేందుకు యాప్‌ ద్వారా పర్యవేక్షించారు. 
► కరోనా సమయంలో వర్చువల్‌ విధానంలో వ్యాసరచన, వక్తృత్వ తదితర పోటీలు నిర్వహించారు. 
► ప్రైవేట్‌ పాఠశాలల్లో ఆన్‌లైన్‌ బోధనపై డైట్‌ ఉపాధ్యాయులతో సర్వే చేశారు. 
► మార్చి 23, 2021 నుంచి ఏప్రిల్‌ 4, 2021 వరకూ పాఠశాలలకు దూరమైన విద్యార్థులను గుర్తించేందుకు ‘మన బడికి పోదాం మొబైల్‌ యాప్‌’ ద్వారా ఇంటింటి సర్వే నిర్వహించారు. బడికి దూరమైన వేల మంది విద్యార్థులు, వలస కార్మికుల పిల్లలను ఇలా గుర్తించి తిరిగి పాఠశాలలకు రప్పించగలిగారు.  
► రాజ్యాంగ విలువలను మిళితం చేస్తూ భాష, గణితంలో నైపుణ్యాలను విద్యార్థుల్లో పెంపొందించేలా నూతన పాఠ్యాంశాలు ప్రవేశపెట్టారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement