
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పాఠశాలల్లో 8వ తరగతి సిలబస్‌ను మార్పు చేయాలని విద్యా శాఖ నిర్ణయించింది. ఇందుకు ఈ నెల 21న విద్యావేత్తలు, నిపుణులతో సదస్సు నిర్వహించనుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్‌ఈ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) విధానాన్ని అమలు చేయాలని సంకల్పించిన నేపథ్యంలో ఆ దిశగా 8వ తరగతి సిలబస్‌ను రూపొందించనున్నారు.
ఇప్పటికే 7వ తరగతి వరకు ఉన్న పాఠ్యపుస్తకాల సిలబస్‌ను మార్పు చేసి.. దాన్ని అమలులోకి తీసుకువచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ఏర్పాటు చేసినందున విద్యార్థులకు బైలింగ్యువల్ (ద్విభాష) పాఠ్యపుస్తకాలను రూపొందించి పంపిణీ చేశారు. ఇప్పుడు 8వ తరగతి సిలబస్‌ను కూడా సీబీఎస్‌ఈ విధానానికి అనుగుణంగా మార్పులు చేసి వచ్చే విద్యా సంవత్సరంలో కొత్త పాఠ్యపుస్తకాలను అందించనున్నారు. ఈ నెల 21న జరిగే సదస్సులో విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ దిశానిర్దేశం చేయనున్నారు.
కాగా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో దశలవారీగా సీబీఎస్‌ఈ విధానాన్ని అమలు చేసేందుకు విద్యా శాఖ సీబీఎస్‌ఈకి ప్రతిపాదనలు పంపిన సంగతి తెలిసిందే. సీబీఎస్‌ఈ నిబంధనలకు అనుగుణంగా ఉన్న పాఠశాలలను ఎంపిక చేసి.. వాటిలో ముందుగా ఈ విధానాన్ని అమల్లోకి తేనున్నారు. ఇప్పటికే 1,092 స్కూళ్లను అధికారులు గుర్తించారు. వీటిలో మోడల్ స్కూళ్లు 164, ఏపీఆర్‌ఐఈ సొసైటీ స్కూళ్లు 50, బీసీ వెల్ఫేర్ స్కూళ్లు 78, కేజీబీవీలు 352, ఎంపీపీ, జడ్పీ స్కూళ్లు 126, మున్సిపల్ స్కూళ్లు 5, సోషల్ వెల్ఫేర్ స్కూళ్లు 180, ప్రభుత్వ స్కూళ్లు 4, ట్రైబల్ వెల్ఫేర్ స్కూళ్లు 126, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ స్కూళ్లు 7 ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment