టెన్త్‌లో ఈసారీ ఆరు పేపర్లే | Telangana Govt Key Decision Of 10th Class Exams 2022 | Sakshi
Sakshi News home page

టెన్త్‌లో ఈసారీ ఆరు పేపర్లే

Published Fri, Oct 14 2022 2:55 AM | Last Updated on Fri, Oct 14 2022 2:55 AM

Telangana Govt Key Decision Of 10th Class Exams 2022 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పదో తరగతి పరీక్షల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతేడాది తరహాలోనే ఈ ఏడాది కూడా పదో తరగతి పరీక్షలను 11 పేపర్లకు బదులుగా ఆరు పేపర్లతోనే నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. టెన్త్‌తోపాటు మిగతా క్లాసుల పరీక్షలూ ఆరు పేపర్లతోనే జరపనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు స్కూల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని జిల్లా విద్యాధికారులను ఆదేశించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా విద్యార్థులపై భారం పడకుండా ఉండేందుకు టెన్త్‌ పరీక్ష పేపర్లను రాష్ట్ర ప్రభుత్వం 2020–21 విద్యాసంవత్సరంలోనే 11 నుంచి 6కు కుదించింది. అయితే కరోనా తీవ్రత దృష్ట్యా ఆ ఏడాది పరీక్షలను రద్దు చేసింది. ఇక 2021–22 విద్యాసంవత్సరంలోనూ ఆ ప్రకారమే 6 పేపర్లతో పరీక్ష నిర్వహించింది.

ప్రతి సబ్జెక్టులోనూ పేపర్‌–1, పేపర్‌–2 బదులు­గా ఒకే పేపర్‌ను 80 మార్కులకు ఇచ్చింది. మిగి­లి­న 20 మార్కులకు ఇంటర్నల్స్‌లో విద్యార్థులు పొందిన మార్కులను జతచేసింది. తాజాగా 2022–­23 విద్యాసంవత్సరంలోనూ ఇదే విధానా­న్ని కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నవంబర్‌ 1 నుంచి మొదలుకానున్న సమ్మెటివ్‌ అసెస్‌మెంట్‌–1 పరీక్షలను ఇదే విధానంలో నిర్వహించనున్నట్లు పేర్కొంటూ టైంటేబుల్‌ను విడుదల చేసింది.

పేపర్ల ముద్రణ జరిగే వేళ...
వాస్తవానికి సమ్మెటివ్‌ అసెస్‌మెంట్‌–1 పరీక్షలు 11 పేపర్లతో ఉంటాయని తొలుత పాఠశాల విద్యాశాఖ పేర్కొనడంతో జిల్లా అధికారులు ఈ తరహాలోనే పేపర్లు రూపొందించారు. కొన్నిచోట్ల వాటిని ప్రింటింగ్‌కు కూడా పంపారు. ఈ దశలో విద్యాశాఖ 11కు బదులు 6 పేపర్లే ఉంటాయని చెప్పడంతో జిల్లా విద్యాశాఖ అధికారులు గందరగోళంలో పడ్డారు. విద్యార్థులు కూడా 11 పేపర్ల పరీక్షకు సిద్ధమై ఇప్పుడు 6 పేపర్లతో రాయాల్సి రానుండటంతో ఆందోళన చెందుతున్నారు. అయితే స్కూళ్ల ప్రారంభంలోనే ఈ మార్పు గురించి వివరించి ఉంటే విద్యార్థులను సంసిద్ధులను చేయడానికి వీలుండేదని పలువురు ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు.

కొరవడిన సమన్వయం..
రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) పరీక్షా పేపర్లపై వారం క్రితమే విద్యాశాఖ డైరెక్టర్‌కు కొన్ని సూచనలు చేసినట్లు తెలిసింది. తొలుత ఈ సూచనలను పట్టించుకోకుండా పక్కన పడేసిన డైరెక్టర్‌.. ఆ తర్వాత ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఒత్తిడి నేపథ్యంలో ఎస్‌సీఈఆర్‌టీ ప్రతిపాదనను అమలు చేయాలని నిర్ణయించినట్టు సమాచారం.

ఇప్పటికే దసరా సెలవులను రెండు వారాలపాటు ఇస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు ఇవ్వడం.. గతంలో ఇచ్చిన సెలవులను మినహాయించి దసరా సెలవులను కుదించాలంటూ ఎస్‌ఈసీఆర్‌టీ సిఫార్సు చేయడం.. దాన్ని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ పట్టించుకోకపోవడం చూస్తుంటే ఈ రెండు విభాగాల మధ్య సమన్వయం కొరవడిందన్న విమర్శలు వస్తున్నాయి.

తక్కువ సమయంలో విద్యార్థులను ఎలా సిద్ధం చేయాలి?
పరీక్షల తీరును ఉన్నఫళంగా మార్చడం వల్ల ఉపాధ్యాయులు, విద్యార్థులు గందరగోళంలో పడే ప్రమాదం ఉంది. కరోనా తర్వాత ఇప్పుడిప్పుడే పరీక్షలపై దృష్టి పెడుతున్న విద్యార్థులను అధికారులు పరిగణనలోకి తీసుకోవాలి. 11 పేపర్లతో టెన్త్‌ పరీక్ష ఉంటుందని విద్యార్థులను తయారు చేశాం. తక్కువ వ్యవధిలో ఆరు పేపర్లకు సిద్ధం చేయాల్సి రావడం కొంత ఇబ్బందిగానే ఉంటుంది.
– రాజా భానుచంద్ర ప్రకాశ్, ప్రభుత్వ హెచ్‌ఎంల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement