ఆందోళన చెందుతున్న 2 లక్షలమంది ఉపాధ్యాయులు
పెన్షనర్లకూ తప్పని ఆర్థిక కష్టాలు
సాక్షి, అమరావతి: తమది ఉద్యోగుల ప్రభుత్వమని, అందరికీ ప్రతినెల ఒకటో తేదీనే జీతాలు ఇస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పిన విధంగా కూటమి ప్రభుత్వం వేతనాలివ్వడంలేదని ఉపాధ్యాయులు వాపోతున్నారు. అధికారంలోకి వచ్చాక జూలై నెలలో మాత్రమే ఒకటో తేదీన జీతాలిచ్చారని, తర్వాత నెలల్లో ఐదు, ఆరు తేదీల్లోనే వేస్తున్నారని తెలిపారు. ప్రతినెలా మంగళవారం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలో దాదాపు రెండులక్షల మంది ఉపాధ్యాయులకు అక్టోబర్ నెల వేతనాలను నవంబర్ ఒకటో తేదీన ఇవ్వాల్సి ఉన్నా ఇప్పటివరకు జమ చేయలేదు. పెన్షన్లు కూడా అందరికీ అందలేదు. కూటమి ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిందని, మొదటి నెలలో మాత్రం ఒకటో తేదీ జీతాలు చెల్లించి, తర్వాత ప్రతినెలా 4, 5, 6 తేదీల్లో జీతాలు ఇస్తున్నారని ఉపాధ్యాయులు చెబుతున్నారు.
పిల్లల ఫీజులు, ఇంటి ఖర్చులు, ఈఎంఐ వంటి అవసరాలతో ఇబ్బందిపడుతున్నామని పేర్కొంటున్నారు. ఒకటో తేదీన వేతనాలు ఇవ్వకపోవడంతో ఈఎంఐలు సకాలంలో చెల్లించలేక డిఫాల్టర్లుగా మారుతున్నామని ఆవేదన చెందుతున్నారు. పెన్షన్ సొమ్ముతో జీవనం సాగిస్తున్నవారి పరిస్థితి మరింత దుర్భరంగా ఉంది.
అప్పు తెచ్చి ఎంతకాలం వడ్డీలు చెల్లించాలి?
ఉపాధ్యాయులకు ఇప్పటివరకు పీఎఫ్ లోన్లు, ఏపీజేఎల్‌ఐ లోన్లు, మెడికల్ బిల్లులు, సరెండర్ లీవులు జమచేయలేదని వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.అశోక్‌కుమార్‌రెడ్డి, గెడ్డం సుదీర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తాము దాచుకున్న డబ్బును ఇవ్వకపోతే తమ పిల్లల చదువులు ఏం కావాలని ప్రభుత్వాన్ని నిలదీశారు. డబ్బులు అప్పు తెచ్చి ఎంతకాలం వడ్డీలు చెల్లించాలని ప్రశ్నించారు.
తమకు రావాల్సిన పీఎఫ్ లోను బకాయిలు, పీఆర్సీ బకాయిలు వెంటనే చెల్లించాలని, ప్రతినెలా ఒకటో తేదీన వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు అండగా ఉంటామని ఎన్నికల్లో హామీ ఇచ్చి, ఇప్పుడు ఉద్యోగస్తులపై కేసులు పెట్టిన వారికి అండగా ఉంటామని మాట్లాడడం బాధాకరమని పేర్కొన్నారు. ఇలాంటి ఉద్యోగ, ఉపాధ్యాయ వ్యతిరేక చర్యలు మానుకుని, వారి సంక్షేమం కోసం పనిచేయాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment