కర్నూలు(విద్య), న్యూస్‌లైన్: సమాజంలోని 6 నుంచి 14 ఏళ్లలోపు పిల్లలంతా బడిలో చేరి ఉచితంగా చదువుకోవాలనే ఉద్దేశంతో 2009 ఆగస్టు 27న కేంద్ర ప్రభుత్వం ‘ఉచిత, నిర్బంధ విద్య బాలల హక్కు చట్టం’ రూపొందించింది. ఎంతో ఉన్నతమైన ఈ చట్టం అపహాస్యమవుతోంది. ఇదొకటుందనే విషయాన్ని అధికారులు సైతం మరిచిపోవడం విస్మయాన్ని కలిగిస్తోంది. ఫీజుల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం పదిహేనేళ్ల క్రితం జారీ చేసిన జీవో నెం.1 అటకెక్కింది. జీవో అమలుకు ప్రైవేట్ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పేరెంట్స్ కమిటీలు యాజమాన్యాలకు కొమ్ము కాస్తున్నాయి. కమిటీలో అనుకూలురైన పేరెంట్స్‌ను నియమించుకుని ఫీ‘జులం’ చేస్తున్న పాఠశాలలే అత్యధికం.
పదేళ్ల క్రితం జిల్లాకు ఒకటి రెండు మాత్రమే కార్పొరేట్
విద్యా సంస్థలు ఉండగా.. నేడు వీధికొకటి వెలిశాయి. పాఠశాల విద్యను శాసించే స్థాయికి వీటి కార్యకలాపాలు విస్తరించడం ఆందోళన కలిగిస్తోంది. కర్నూలు నగరంలోని కొన్ని కార్పొరేట్ పాఠశాలల్లో ఎల్‌కేజీ, యూకేజీలకు ఏడాదికి రూ.13 వేల ఫీజు వసూలు చేస్తుండటం గమనార్హం. పుస్తకాలు, యూనిఫాం, పాఠశాలల్లో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల పేరిట అదనంగా మరో రూ.10 వేలు ఖర్చవుతోంది. ఒకటి నుంచి 7వ తరగతి వరకు హాస్టల్ అయితే రూ.40 వేల నుంచి రూ.70 వేలు ముట్టజెప్పాల్సిందే. పుస్తకాలు.. పరీక్ష ఫీజు.. సాంస్కృతిక కార్యక్రమాల పేరిట మరో రూ.20 వేలు వసూలు చేస్తున్నారు.
స్థానికంగా పేరుమోసిన పాఠశాలల్లో ఫీజులు వింటే తల్లిదండ్రులకు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. అడ్మిషన్ల పేరిట యథేచ్ఛగా డొనేషన్లు వసూలు చేస్తున్నా అడిగే నాథుడే కరువయ్యాడు. తరగతిని బట్టి అడ్మిషన్ ఫీజు రూ.4 వేల నుంచి రూ.8 వేల వరకు ఉంటోంది. వాస్తవానికి ఈ ఫీజును పాఠశాలల్లో పేరెంట్స్ కమిటీ మీటింగ్‌లో చర్చించి అనుమతి తీసుకోవాల్సి ఉంది. దానిని డీఈఓ దృష్టికి తీసుకెళ్లి వసూలు చేసుకోవాలనే నిబంధన ఉంది. ఎక్కడా ఈ నిబంధన అమలుకు నోచుకుంటున్న దాఖలాల్లేవు. ఇక నగరంలోని 90 శాతం పాఠశాలలకు మైదానాలు, పార్కింగ్ స్థలాలు లేవనేది అధికారులకు తెలియనిది కాదు. విద్యార్థినీ విద్యార్థులకు తగినన్ని బాత్‌రూమ్‌లు ఏర్పాటు చేయడంలోనూ యాజమాన్యాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. అర్హులైన బీఈడీ, డీఈడీ ఉపాధ్యాయులు, ఎంఈడీ చేసిన హెచ్‌ఎంను నియమించాల్సి ఉన్నా.. ఎక్కడా వీరి ఊసే లేకపోతోంది.
ప్రైవేట్ పాఠశాలల్లో ఫీ'జులుం'
Published Thu, May 29 2014 12:51 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM
Advertisement
Advertisement