మాట్లాడుతున్న రామచంద్రయ్య
పత్తికొండ టౌన్: ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన బీజేపీ, టీడీపీ ఏరుదాటిన తర్వాత తెప్ప తగలేసిన చందంగా ప్రజలను మోసం చేశాయని సీపీఐ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు పి.రామచంద్రయ్య విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ సమర్పించడాన్ని నిరసిస్తూ శుక్రవారం పత్తికొండలో వామపక్ష పార్టీలు భగ్గుమన్నాయి. సీపీఐ, సీపీఎం, లోక్‌సత్తా పార్టీలు ర్యాలీగా వచ్చి, స్థానిక నాలుగుస్తంభాల మంటపం వద్ద రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించిందన్నారు. అపుడు ఓట్లు వేయించుకుని ఇప్పుడు ఇవ్వలేమని చెప్పడం రాజకీయాల్లో దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు.
కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వంలో 4 ఏళ్లు భాగస్వామిగా ఉన్న టీడీపీ ఏపీకి ప్రత్యేక హోదా సాధించడంలో విఫలమైందన్నారు. ప్రత్యేక హోదా కోసం తామే పోరాడుతున్నట్లు ప్రజలను మభ్యపెట్టేందుకు సీఎం చంద్రబాబు, టీడీపీ నాయకులు డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదా సాధించేంత వరకు పోరాటం కొనసాగించాలన్నారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు గురుదాస్, కారన్న, రాజాసాహెబ్, సురేంద్ర, రంగన్న, సీపీఎం నాయకులు వెంకటేశ్వర్లు, దస్తగిరి, వెంకటేశ్వరరెడ్డి, లోక్‌సత్తా నాయకులు ఆనందాచారి, జయరాముడు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment