ఫీజుల దరువు.. బతుకు బరువు
రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల మోత
- చదువు తక్కువ... ఫీజులు ఎక్కువ
- నోటీసు బోర్డుల్లో పెట్టి మరీ అడ్డగోలుగా దందా
- ఒలింపియాడ్, టెక్నో, కాన్సెప్ట్, ఇంటర్నేషనల్ పేర్లతో టోకరా
- ఎల్‌కేజీకి ట్యూషన్ ఫీజు రూ.25 వేలు వసూలు
- ఇతర రుసుములతో కలిపి రూ.50 వేలకు పైగానే ఖర్చు
- పదో తరగతి చదవాలంటే రూ.లక్షన్నర పైగా వదిలించుకోవాల్సిందే
- అడ్డగోలుగా డబ్బు వసూలు చేస్తున్నా సౌకర్యాలు అంతంతే
- స్తోమతకు మించిన ఖర్చుతో తల్లిదండ్రులు అప్పులపాలు
- నియంత్రణను గాలికొదిలేసి చోద్యం చూస్తున్న ప్రభుత్వం
- ఫీజులపై సర్కారు నియంత్రణ ఉండాల్సిందేనంటున్న నిపుణులు
పిల్లలను ఉన్నత స్థానాల్లో చూడాలనుకోవడం మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి తల్లిదండ్రుల ఆశ. ఒక ఆటో డ్రైవర్ సైతం తన పిల్లల బం గారు భవిష్యత్ కోసం కార్పొరేట్ స్కూల్‌లో చేరుస్తున్నాడు. ఒక విద్యార్థి ఎల్‌కేజీ మొదలు పదో తరగతి పూర్తి చేయాలంటే నేటి రోజుల్లో తక్కువలో తక్కువ రూ.10 లక్షలకు పైగా అవుతుంది. ఏళ్ల తరబడి రెక్కలు ముక్కలు చేసి సంపాదించిన ఇంత డబ్బును వారు తృణప్రాయంగా ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలకు ధారపోస్తున్నారు. మరికొందరు అప్పులు చేసి చదివిస్తున్నారు. ఇంతా చేస్తే.. ప్రచారార్భాటం, శిక్షణ లేని ఉపాధ్యాయుల వల్ల విద్యార్థులు అనుకున్న రీతిలో రాణించలేక చతికిలపడుతున్నారు. దీంతో తల్లిదండ్రుల్లో కొందరు అప్పులపాలై ఆస్తులమ్ముకుంటుండగా, మరికొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సాక్షి, అమరావతి: నాలుగేళ్ల పిల్లాడు ఎల్‌కేజీలో చేరాలంటే అక్షరాలా రూ.25 వేలు చెల్లించాలట! ఇది కేవలం ట్యూషన్ ఫీజు మాత్రమే. దీంతోపాటు డొనేషన్, బిల్డింగ్ ఫండ్, రిజిస్ట్రేషన్ ఫీజు, అడ్మిషన్ ఫీజు, రవాణా, యూనిఫాం, పుస్తకాలు, పెన్నుల ఖర్చులు అదనం. అంతా కలిపి ఎల్‌కేజీ పూర్తి చేయడానికి రూ.50 వేలకు పైగా సమర్పించుకోవాల్సిందే. తరగతి పెరిగే కొద్దీ ఈ ఫీజులు కూడా పెరిగిపోతుంటాయి. పదో తరగతి చదవడానికి రూ.లక్షన్నరకు పైగా ఖర్చు చేయక తప్పడం లేదు. ప్రైవేట్ పాఠశాలల్లో వసూలు చేస్తున్న ఫీజులు విద్యార్థుల తల్లిదండ్రులకు కంట నీరు తెప్పిస్తున్నాయి. నగరాల్లో పేరున్న పాఠశాలల్లోనే కాదు ద్వితీయ శ్రేణి పట్టణాల్లోని సాధారణ ప్రైవేట్ స్కూళ్లలోనూ ఫీజులు అదిరిపోతున్నాయి. తల్లిదండ్రుల వెన్ను విరిచేస్తున్నాయి. అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నాయి. విద్యారంగాన్ని ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తుండడం ప్రజల పాలిట శాపంగా మారుతోంది. చూస్తూ చూస్తూ పిల్లలను సర్కారు బడికి పంపలేక, తల తాకట్టు పెట్టయినా ప్రైవేట్ స్కూళ్లలో చదివించాలన్న తల్లిదండ్రుల తపనను యాజమాన్యాలు భారీగా సొమ్ము చేసుకుంటున్నాయి.
యథేచ్ఛగా దందా..
రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల దోపిడీ వికృతరూపం దాల్చింది. ఒకటో తరగతి నుంచే ఐఐటీ ఫౌండేషన్ అంటూ విద్యార్థుల తల్లిదండ్రులను పట్టపగలే నిలువునా దోచుకుంటున్నారు. వీటిని నియంత్రించాల్సిన ప్రభుత్వం మరింతగా ప్రోత్సహిస్తోంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 16,000 ప్రైవేట్ పాఠశాలలు ఉండగా, వాటిలో 27 లక్షల మంది చదువుతున్నారు. ఏటా ఈ స్కూళ్లలో ఎల్‌కేజీ, యూకేజీ, మొదటి తరగతుల్లో లక్షలాది మంది విద్యార్థులను చేర్చుకుంటున్నారు. బహిరంగంగానే నోటీసు బోర్డుల్లో పెట్టి మరీ అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నారు. ముఖ్య నగరాలు, పట్టణాలతోపాటు అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో ఈ దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. ప్రభుత్వ గుర్తింపు పొందిన వాటితోపాటు ఎలాంటి గుర్తింపు లేకుండా అక్రమంగా కొనసాగుతున్న స్కూళ్లలోనూ ఫీజుల మోత మోగుతోంది. వసూలు చేస్తున్న ఫీజులకు, అక్కడి సౌకర్యాలకు పొంతనే ఉండదు. అపార్ట్‌మెంట్లలో స్కూళ్లు, అగ్గిపెట్టెల్లాంటి గదుల్లో తరగతులు, శిక్షణ లేని ఉపాధ్యాయులు, మౌలిక సదుపాయాల కొరత పట్టి పీడిస్తున్నాయి. ఒలింపియాడ్, టెక్నో, కాన్సెప్ట్, ఇంటర్నేషనల్, ఈ–టెక్నో, ఈ–శాస్త్ర.. ఇలా తల్లిదండ్రులకు అర్థంకాని పేర్లతో స్కూళ్లు నడిపిస్తూ ఫీజుల దందా సాగిస్తున్నారు.
వసూళ్లే వసూళ్లు
ట్యూషన్ ఫీజులతోపాటు బిల్డింగ్ ఫండ్, డొనేషన్లు ఇవ్వాలని ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు షరతు విధిస్తున్నాయి. పుస్తకాలు, యూనిఫారాలు తమ వద్దే కొనుగోలు చేయాలని నిర్దేశిస్తున్నాయి. ఇటీవల విజయవాడ సమీపంలోని ఓ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం తల్లిదండ్రులకు ఇచ్చిన ఫీజుల పత్రంలోని అంకెలను చూస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే. డే స్కాలర్లకు, హాస్టళ్లలో ఉండే వారికి వేర్వేరుగా ఫీజులను కరపత్రాల్లో ముద్రించి మరీ ఇచ్చింది. డే స్కాలర్ ఎల్‌కేజీ విద్యార్థి రూ.25,000, యూకేజీ విద్యార్థి రూ.26,000 చెల్లించాలి. ఇక మూడో తరగతి నుంచే హాస్టల్ నిర్వహిస్తోంది. డే స్కాలర్‌కు అయితే మూడో తరగతికి రూ.29,000, హాస్టల్‌లో ఉంటే రూ.1.05 లక్షలు, చివరకు పదో తరగతి వచ్చేసరికి డే స్కాలర్ రూ.40,000, హాస్టల్‌లో ఉంటే రూ.1.20 లక్షలు చెల్లించాలని పేర్కొంది. ఇది కాకుండా డే స్కాలర్ రిజిస్ట్రేషన్, అడ్మిషన్ ఫీజు కింద రూ.5,000 చొప్పున వేర్వేరుగా చెల్లించాలి. హాస్టల్‌లో ఉండే వారైతే రూ.10,000 చెల్లించాలి. పాకెట్ మనీ కింద డే స్కాలర్ రూ.7,000, హాస్టలర్ అయితే రూ.10,000 కట్టాలి. హాస్టల్‌లో ఉండే విద్యార్థి ధోబీ ఖర్చు కింద రూ.2,500 చెల్లించాలని నోటీసు బోర్డులో పెట్టారు.
ప్రభుత్వ జీవోలు ఏం చెబుతున్నాయంటే...
హైకోర్టు ఆదేశాల మేరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2009లో జీవో నంబర్ 91 జారీ చేసింది. అందులో పేర్కొన్న నిబంధనల ప్రకారం..
► ప్రతి ప్రైవేట్ పాఠశాలలో గవర్నింగ్ బాడీలను ఏర్పాటు చేయాలి.
► జిల్లా స్థాయిలో జిల్లా ఫీజుల నియంత్రణ కమిటీలను (డీఎఫ్‌ఆర్‌సీ) ఏర్పాటు చేయాలి.
► పాఠశాల గవర్నింగ్ బాడీలు ప్రతిపాదించే ఫీజులను డీఎఫ్‌ఆర్‌సీ పరిశీలించి తుది ఫీజులను ఖరారు చేయాలి. వాటినే స్కూళ్లలో వసూలు చేయాలి. అయితే అందులోనూ గరిష్టంగా వసూలు చేయాల్సిన ఫీజులను ప్రభుత్వం పేర్కొంది.
► ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో గరిష్టంగా ఏటా రూ.24,000, ఉన్నత పాఠశాలల్లో రూ.30,000 మాత్రమే వసూలు చేసుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది.
జీవోలకు పాతరేశారు
ప్రైవేట్ స్కూళ్లు ఎల్‌కేజీ నుంచే వేల రూపాయలు వసూలు చేస్తున్నాయి. పదో తరగతికి వచ్చేసరికి ఫీజు రూ.లక్ష వరకు చేరుతోంది. విద్యాహక్కు చట్టం తర్వాత 2013లో ప్రభుత్వం జీవో 41, 42 జారీ చేసింది. పట్టణ ప్రాంతాల్లోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఏడాదికి గరిష్టంగా రూ.9,000, ఉన్నత పాఠశాలల్లో రూ.12,000 తీసుకోవాలని పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక, ప్రాథమికోన్నత స్కూళ్లలో రూ.7,800, ఉన్నత పాఠశాలల్లో రూ.10,800లకు మించి వసూలు చేయవద్దని తేల్చిచెప్పింది. అయినా అవేవీ అమలు కావడం లేదు. విద్యాహక్కు చట్టం ప్రకారం కేపిటేషన్ ఫీజు, డొనేషన్లు వసూలు చేయడానికి వీల్లేదు. స్కూళ్ల ఆవరణలో వ్యాపార కార్యకలాపాలు, ప్రవేశాల కోసం తల్లిదండ్రులకు, పిల్లలకు ఎలాంటి స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించకూడదు.
నిబంధనలున్నా.. అమలు సున్నా..
ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు కేపిటేషన్ ఫీజు, డొనేషన్లు వసూలు చేస్తే అంతకు 10 రెట్లు జరిమానా విధించే అధికారం ప్రభుత్వానికి ఉంది. ప్రవేశాల కోసం పరీక్ష నిర్వహిస్తే మొదటిసారి అయితే రూ.25 వేలు, అంతకంటే ఎక్కువసార్లు అయితే ప్రతిసారి రూ.50 వేల చొప్పున జరిమానా విధించవచ్చు. గుర్తింపు లేని స్కూళ్లను కొనసాగించడానికి వీల్లేదు. గుర్తింపు రద్దు చేసిన స్కూళ్లను మళ్లీ కొనసాగిస్తే రూ.లక్ష వరకు జరిమానా విధించి, సీజ్ చేయాలి. ఈ నియమ నిబంధనలను ప్రైవేట్ స్కూళ్లు లెక్క చేయడం లేదు. అక్రమాలను అరికట్టాల్సిన విద్యాశాఖ అధికారులు ముడుపులు తీసుకుంటూ మౌనం దాలుస్తున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ప్రైవేట్ స్కూళ్లు ఫీజుల నియంత్రణ పాటించాలి
ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులను అధికంగా వసూలు చేస్తున్న విషయం వాస్తవమే. ఉన్నత విద్యాకోర్సుల కంటే కొన్ని స్కూళ్లలో ఫీజులు అధికంగా ఉంటున్నాయి. ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలు రూపొందించింది. వీటిని పకడ్బందీగా అమలు చేయాలి. సామాజిక బాధ్యతను గుర్తెరిగి ప్రైవేట్ విద్యాసంస్థలు ఫీజుల విషయంలో స్వీయ నియంత్రణ పాటించాలి.
– ప్రొఫెసర్ విజయరాజు, చైర్మన్, ఉన్నత విద్యామండలి
ఫీజులపై కచ్చితమైన చట్టం చేయాలి
ఆంధ్రప్రదేశ్‌లో ఫీజుల నియంత్రణకు కచ్చితమైన చట్టం లేదు. గతంలో కొన్ని జీవోలు ఇచ్చినా అందులో సరైన విధివిధానాలను నిర్దేశించలేదు. చట్టాన్ని తేవాల్సిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఏదో ఒక సాకుతో వాయిదా వేస్తోంది. పాఠశాలలను గ్రేడులుగా విభజించి, ఫీజులు నిర్ణయించాలి. ఫీజులు, ఉపాధ్యాయుల జీతాల వివరాలను ఆన్‌లైన్‌లో ఉంచాలి. దాని ప్రకారమే విద్యార్థుల నుంచి వసూలు చేయాలి.
– విఠపు బాలసుబ్రహ్మణ్యం, ఎమ్మెల్సీ
తల్లిదండ్రుల ఆశలతో వ్యాపారం
కార్పొరేట్ విద్యాసంస్థలు తల్లిదండ్రుల ఆశలతో వ్యాపారం చేస్తున్నాయి. ఫీజులు చెల్లించడానికి మధ్యతరగతి వర్గాలు అప్పుల పాలు కావాల్సి వస్తోంది. విద్య కోసం రూ.లక్షలు ఖర్చు చేయలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం కార్పొరేట్ విద్యాసంస్థలకే అనుకూలంగా వ్యవహరిస్తోంది. ఫీజుల పేరిట రూ.కోట్లు దండుకుంటున్న విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలి.
– శర్వాణీ మూర్తి, సత్యనారాయణపురం, విజయవాడ
జనం అప్పుల పాలవుతున్నారు
కార్పొరేట్ విద్యాసంస్థలు విద్య వ్యాపారం సాగిస్తూ మధ్యతరగతి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. రెక్కాడితే గానీ డొక్కాడని పేదలు సైతం తమ పిల్లలను కార్పొరేట్ కళాశాలల్లో చదివించాలనే తపనతో అప్పుల పాలవుతున్నారు. కార్పొరేట్ విద్యా సంస్థలపై నియంత్రణ తప్పనిసరిగా ఉండాలి. ఫీజులను తగ్గించేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలి.
– పడమటి రామకృష్ణ, మారుతీనగర్, విజయవాడ