ప్రైవేటు బడి.. నిండా దోపిడీ
ప్రైవేటు స్కూళ్లలో ఫీజులపై నియంత్రణ కరువు
- ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్న యాజమాన్యాలు
- నిబంధనలకు విరుద్ధంగా కేపిటేషన్ ఫీజులు, డొనేషన్లు
- ఐఐటీ, ఒలంపియాడ్,టెక్నో, కాన్సెప్ట్, ఈ–టెక్నో వంటి పేర్లతో గాలం
- ఇంత జరుగుతున్నా పెద్దగా స్పందించని సర్కారు
- ఫీజుల కమిటీ పేరుతో కాలయాపన
- ఉన్న జీవో ప్రకారమైనా నియంత్రణ చర్యలు కరువు
సాక్షి, హైదరాబాద్:
► హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ స్కూల్‌లో గతేడాది నాలుగో తరగతి ఫీజు రూ.45 వేలు ఉండగా ఈసారి రూ. 65 వేలకు పెంచింది.
► హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఫీజులను ఈసారి 19 శాతం పెంచుతున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. కానీ 30 శాతం పెంచిందని తల్లిదండ్రులు విద్యాశాఖకు ఫిర్యాదు చేశారు. ట్రాన్స్‌పోర్టు ఫీజును రూ. 15 వేల నుంచి రూ. 25 వేలకు పెంచినట్లు పేర్కొన్నారు.
► అబిడ్స్ ప్రాంతంలోని ఓ ప్రముఖ పాఠశాల ఒకటో తరగతిలో ప్రవేశానికి డొనేషన్‌గా రూ. లక్ష వసూలు చేస్తోంది. అది కాకుండా ఏటా ఫీజు రూ.32 వేలు కట్టాల్సిందే.
► శంషాబాద్‌లోని ఓ సాధారణ స్కూల్లో గతేడాది 6వ తరగతికి రూ. 14 వేలు ఫీజు ఉండగా.. ఈసారి రూ. 22 వేలకు పెంచింది.
► వరంగల్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో గతేడాది ఆరో తరగతి ఫీజు రూ. లక్షకాగా.. వారు ఏడో తరగతికి వచ్చే సరికి రూ. 1.08 లక్షలకు పెంచింది.
► కరీంనగర్‌లోని ఓ ప్రముఖ ప్రైవేటు పాఠశాలలో గతేడాది నాలుగో తరగతి ఫీజు రూ.33 వేలు. ఇప్పుడా విద్యార్థి ఐదో తరగతికి వచ్చే సరికి రూ.42 వేలు చెల్లించాలంటోంది.
...ఇవే కాదు రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రైవేటు పాఠశాలల్లో సాగుతున్న ఫీజుల దందా తీరు ఇది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 11 వేల ప్రైవేటు పాఠశాలలు ఉండగా.. వాటిల్లో 29 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీటిల్లో దాదాపు 8 వేల స్కూళ్లలో అడ్డగోలు ఫీజుల వసూళ్లు జరుగుతున్నట్లు అంచనా. సాధారణ జనం, కిందిస్థాయి ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగుల వంటివారు ఫీజుల భారాన్ని మోయలేని పరిస్థితి నెలకొంది. కొద్దిగా పేరున్న ప్రైవేటు పాఠశాలల్లో చదివించాలంటే ఏకంగా ఏటా లక్షల రూపాయల్లో సమర్పించుకోవాల్సిన పరిస్థితి. ఇంత జరుగుతున్నా విద్యాశాఖ పెద్దగా స్పందించడం లేదు.
ఇలాంటి పేర్లు వద్దన్నా..
తమ పిల్లలను బాగా చదివించాలన్న తల్లిదండ్రుల ఆకాంక్షను ఆసరాగా చేసుకుని దండుకునేందుకు ప్రైవేటు యాజమాన్యాలు సరికొత్త పేర్లతో మభ్యపెడుతున్నాయి. దాదాపు 62 రకాల ఆకర్షణీయమైన పేర్లతో ప్రలోభపెడుతున్నాయి. ఇలా ఆకర్షణీయ పేర్లు పెట్టవద్దని, ఆ పేర్లతో ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేయవద్దని జీవో నంబర్ 1 చెబుతున్నా.. అది అమలుకావడం లేదు.
– ఐఐటీ, ఒలంపియాడ్, టెక్నో, కాన్సెప్ట్, ఈ–టెక్నో, ఈ–శాస్త్ర, కాన్వెంట్, భ్యాస, అకాడమీ, అమెరికా, బాలసదన్, బాల విహార్, బ్రిలియంట్, సెంట్రల్, కంప్లీట్, కాన్సెప్ట్, కాన్వెంట్, క్రియేటివ్, డిజి, డ్రీమ్స్, ఎంబసీ, ఎక్సలెన్స్, ఎక్సలెంట్, ఫౌండేషన్, గ్లోబల్, జ్ఞానమందిర్, గ్రామర్, గురుకులం, హెరిటేజ్, హైటెక్, ఐడియల్, ఇన్నోవేటివ్, ఇంటిగ్రల్, ఇంటర్నేషనల్, జాయ్, కిడ్స్, కిండర్ గార్టెన్, మెమోరియల్, మిషన్ మోడల్, మోడర్న్, నేషనల్, ఒలంపియాడ్, ప్లానెట్, ప్లే, ప్రోగ్రెసివ్, పబ్లిక్, సైనిక్, శిశుమందిర్, స్మార్ట్, స్పెషల్, టాలెంట్, వ్యాల్యూ, విద్యాకేంద్ర, విద్యా సంస్థ, విద్యావిహార్, విద్యాభారతి, విద్యాభవన్, విద్యాలయ, విద్యామందిర్, విద్యానికేతన్, విద్యా నిలయం, విద్యాపీఠ్, విద్యా సద¯న్ వంటి పేర్లతో స్కూళ్లు కొనసాగుతూనే ఉన్నాయి.
నర్సరీ నుంచే ఐఐటీ, ఐఏఎస్ పాఠాలా?
రకరకాల ఆకర్షణీయ పేర్లతో.. ఏకంగా నర్సరీ నుంచే ఐఐటీ, ఐఏఎస్ ఫౌండేషన్ కోర్సులు అందిస్తామంటూ పలు ప్రైవేటు పాఠశాలలు ప్రకటనలు గుప్పిస్తుండడం దారుణం. పిల్లల తల్లిదండ్రులు ఆ ప్రచార ఆర్భాటానికి లొంగిపోయి.. రూ.లక్షల్లో కేపిటేషన్ ఫీజులు, డొనేషన్లు కట్టడానికి సిద్ధమవుతున్నారు.
హైకోర్టు ప్రశ్నించినా స్పందనేదీ..?
ప్రైవేటు పాఠశాలలు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తుంటే మీరేం చేస్తున్నారంటూ గతేడాది ఓ పిల్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. ‘వన్‌టైం స్పెషల్ యాక్టివిటీ ఫీ’పేరుతో లక్షలు వసూలు చేస్తున్న స్కూళ్లపై ఏం చర్యలు చేపట్టారో వివరించాలనీ ఆదేశించింది. దీంతో కేవలం 162 స్కూళ్లకు నోటీసులు జారీ చేసిన విద్యా శాఖ.. ఆ తర్వాత ఈ విషయాన్ని గాలికొదిలేసింది. ఇటీవల మళ్లీ ఫీజుల గొడవ మొదలు కావడంతో అవే స్కూళ్లకు తిరిగి నోటీసులు జారీ చేసి వదిలేసింది. చర్యలు మాత్రం లేవు.
కమిటీలు.. కాలయాపనలు
రాష్ట్రంలో దాదాపు ఐదేళ్లుగా ఫీజుల నియంత్రణ.. కమిటీలు– కాలయాపన ప్రహసనంలా మారింది. 2009లో నవీన్ మిట్టల్ కమిటీ నివేదిక, దానిపై జారీ చేసిన 91, 92 జీవోలు బుట్టదాఖలయ్యాయి. ప్రస్తుతం ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీ అధ్యయనం కొనసాగుతోంది. ఈ కమిటీకి ఇప్పటికే మూడుసార్లు గడువు పొడిగించినా.. ఇంకా నివేదికే ఇవ్వలేదు.
చదువులు అంతంతే..
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత విద్యాశాఖ నిర్వహించిన సర్వే సందర్భంగా ప్రైవేటు స్కూళ్లలోనూ బోధనా నాణ్యత అంతంత మాత్రమేనని... వసూలు చేస్తున్న ఫీజులకు చదువుకు సంబంధమే ఉండడం లేదని వెల్లడైంది. గణితంలో కూడికలు, తీసివేతలు, గుణకారం, భాగాహారాలు వంటివి 4వ తరగతి పూర్తయ్యే సరికే విద్యార్థులు చేయగలగాలి. కానీ 6, 7, 8, 9, 10 తరగతుల విద్యార్థులు కూడా ఈ లెక్కలు చేయలేకపోతున్నారు.
రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలలు (సుమారు) 11,000
వీటిలో చదువుతున్న విద్యార్థులు 29,00,000
అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నవి 8,000
ఆకర్షణీయ పేర్లతో కొనసాగుతున్నవి 3,487
నిబంధనల ప్రకారం గరిష్టంగా తీసుకోవాల్సిన లాభం 5%
ప్రైవేటు స్కూళ్లు అడ్డగోలుగా వసూలు చేస్తున్నది 50% పైనే
మరింత దోపిడీకి ఇవే మార్గం..
యూనిఫారాలు
పుస్తకాలు
నోటుబుక్స్
స్పెషల్ రిఫరెన్స్ బుక్స్
స్కూల్ బ్యాగులు, బూట్లు
ట్రాన్స్‌పోర్టు ఫీజు