పలు స్కూళ్లకు నోటీసులు జారీ చేసిన విద్యా శాఖ
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు స్కూళ్లలో ఫీజు దోపిడీపై సర్కారులో కదలిక మొదలైంది. నగరంలో నిబంధనలకు పాతరేసి ఇష్టారాజ్యంగా పిల్లల నుంచి ఫీజు వసూలు చేస్తున్న పలు స్కూళ్లకు పాఠశాల విద్యా శాఖ తాజాగా నోటీసులు జారీ చేసింది. పాఠశాలల ఆదాయ వ్యయాలపై వివరాలు సమర్పించాలని సూచిం చింది. 15 రోజుల్లోగా వివరాలను తమకు అందజేయాలని స్పష్టం చేసింది. వాస్తవంగా నోటీసులు జారీ చేసిన స్కూళ్లలో ఎల్ కేజీ సీటు కోసం రూ.లక్ష నుంచి రూ.2.5 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. ఈ విషయంపై మీడియాలో గతంలోనే విస్తృతంగా కథనాలు వచ్చాయి.
ఈ క్రమంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి నేతృత్వంలో గతేడాది ఆగస్టులో ప్రత్యేక తనిఖీ బృందాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి విద్యాశాఖ హైదరాబాద్ రీజియన్ జాయింట్ డెరైక్టర్ సుధాకర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల డీఈఓలు, ఎస్‌ఎస్‌ఏ నుంచి ఇద్దరు ఆడిటర్లు ఈ బృందంలో సభ్యులు. పలు స్కూళ్లను తనిఖీ చేసిన ఈ బృందం గత సెప్టెంబర్ లో నివేదికను ప్రభుత్వానికి అందించింది.
ఇంతవరకు ఈ నివేదికను బహిర్గతం చేయలేదు. అయితే దోపిడీ వాస్తవమేనని తనిఖీల్లో వెల్లడైన నేపథ్యంలోనే సదరు స్కూళ్ల యాజమాన్యాల ఒత్తిడితో నివేదికను గోప్యంగా ఉం చారన్న విమర్శలు వెల్లువెత్తాయి. జీఓ నంబర్ ఎంఎస్ 1 ప్రకారం యాజమాన్యాలు 5 శాతానికి మించి లాభాలు తీసుకోకూడదు. అయితే నగరంలో తనిఖీ లు జరిగిన స్కూళ్లు.. 80 శాతానికి పైబడి లాభాలు ఆర్జిస్తున్నాయని తెలిసింది. ఈ విషయాన్ని పాఠశాల విద్యాశాఖ డెరైక్టరే స్వయంగా ఒప్పుకోవడం విశేషం. స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీలతో సంబంధంలేకుండా గత ఐదేళ్లలో 300% ఫీజు లు పెంచినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది.
నోటీసులు అందిన స్కూళ్లు...
ఢిల్లీ పబ్లిక్ స్కూల్, సంఘమిత్ర, విద్యారణ్య హైస్కూల్, మెరీడియన్, అభ్యుదయ హైస్కూల్, జాన్సన్ గ్రామర్ స్కూల్, ఓక్రిడ్జి ఇంటర్నేషనల్ స్కూల్, చిరక్ ఇంటర్నేషనల్ స్కూల్, శాంటారియా, డీవీఆర్.
ఆ స్కూళ్ల గుర్తింపు రద్దు చేయాలి...
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో అధిక ఫీజలు వసూలు చేస్తున్న స్కూళ్లకు ప్రభుత్వం నోటీసులు జారీ చేయడంపై బాలల హక్కుల సంఘం హర్షం వ్యక్తం చేసింది. నేరుగా ఆ స్కూళ్ల గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేసింది. చట్టాన్ని ఉల్లంఘిస్తూ విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే ప్రవేశాలు పూర్తి చేస్తున్నాయని విమర్శించింది.
ఫీజు దోపిడీపై కదలిక
Published Sat, Mar 5 2016 2:31 AM | Last Updated on Mon, Oct 1 2018 5:41 PM
Advertisement
Advertisement