ప్రైవేటు స్కూళ్ల ఫీ‘జులుం’ | Over Fees at Private School | Sakshi
Sakshi News home page

ప్రైవేటు స్కూళ్ల ఫీ‘జులుం’

Published Sat, Dec 9 2017 4:09 AM | Last Updated on Mon, Oct 1 2018 5:40 PM

Over Fees at Private School - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలలు మరోమారు దోపిడీకి రంగం సిద్ధం చేశాయి. వచ్చే ఏడాదికి సంబంధించి ఫీజులను పెంచేందుకు చర్యలు చేపట్టాయి. ఫీజుల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై ప్రభుత్వం నియమించిన ప్రొఫెసర్‌ తిరుపతిరావు కమిటీ అధ్యయనం ఇంకా కొనసాగుతుండగానే.. వచ్చే ఏడాది వసూలు చేసే ఫీజులపై యాజమాన్యాలు ఇప్పుడే తల్లిదండ్రులకు సమాచారం ఇస్తున్నాయి. పాఠశాలల స్థాయిని బట్టి 10 శాతం నుంచి 30 శాతం వరకు ఫీజుల పెంపును సూచిస్తుండటంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. 2017–18 విద్యా సంవత్సరంలోనే ఫీజుల నియంత్రణ అమల్లోకి వస్తుందని భావించినా అది సాధ్యం కాలేదు. కనీసం వచ్చే విద్యా సంవత్సరమైనా ఫీజుల నియంత్రణ సాధ్యమవుతుందా.. అనే అనుమానం తల్లిదండ్రుల నుంచి వ్యక్తమవుతోంది. 

హడావుడితోనే సరి.. 
రాష్ట్రంలో 30 లక్షల మంది విద్యార్థులు చదువుతున్న ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ ఇప్పటికీ సాధ్యం కావడం లేదు. ఒక్కోసారి ఒక్కో కారణంతో 8 ఏళ్లుగా ఫీజుల నియంత్రణకు అ డ్డుకట్ట పడుతూనే ఉంది. విద్యా సంవత్సరం ప్రారంభంలో ని యంత్రణకు చర్యలంటూ హడావుడి చేయడం.. ఆ తర్వాత మిన్నకుండిపోవడం పరిపాటిగా మారింది. కొన్నిసార్లు న్యాయ వివాదా లు, ఇంకొన్ని సార్లు విద్యా శాఖ అలసత్వం, మరికొన్నిసార్లు అధ్యయనాల పేరుతో వాయిదా పడుతూనే వస్తోంది. 

కమిటీ వేసినా ఫలితమేదీ? 
2017–18లో ఫీజుల నియంత్రణకు మార్గదర్శకాలు ఖరారు చేసేందుకు మార్చిలో ఓయూ మాజీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ తిరుపతిరావు చైర్మన్‌గా రాష్ట్ర ప్రభుత్వం కమిటీని నియమించింది. ఈలోపే పలు పాఠశాలలు భారీగా ఫీజులను పెంచేశాయి. హైదరాబాద్‌లోనే కాదు.. రంగారెడ్డి, నల్లగొండ తదితర జిల్లా కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి. హైదరాబాద్‌ నిజాంపేట రోడ్డులోని ఓ సీబీఎస్‌ఈ పాఠశాల ఫీజును ఒక్కసారిగా రూ.48,000 నుంచి రూ.66,000కు పెంచింది. అంటే 37.5 శాతం ఫీజులను పెంచింది. ప్రొఫెసర్‌ తిరుపతిరావు కమిటీ అప్పటికే తల్లిదండ్రుల కమిటీలు, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలతో పలుమార్లు సమా వేశమై చర్చించింది. గుజరాత్‌ తదితర రాష్ట్రాల్లో ఫీజుల నియంత్రణ చర్యలపై అధ్యయనం చేస్తామంటూ నివేదిక ఇవ్వలేదు. దీంతో మొన్నటి జూన్‌లో తల్లిదండ్రులపై భారం తప్పలేదు.  

నోటీసులకు స్పందనేదీ? 
ప్రైవేటు పాఠశాలల మూడేళ్ల ఆదాయ వ్యయాలను తీసుకొని, ఏయే పాఠశాలలకు ఫీజులు ఎలా ఉండాలో నిర్ధారించాలని తిరుపతిరావు కమిటీ నిర్ణయించింది. ఆ మేరకు యాజమాన్యాలకు విద్యా శాఖ నోటీసులు జారీ చేసింది. ఇది జరిగి రెండు నెలలైనా అన్ని స్కూళ్ల నుంచి ఆదాయ వ్యయాల వివరాలు అందలేదు. తెలంగాణలో 11 వేలకు పైగా ఉన్న ప్రైవేటు పాఠశాలల్లో ఇప్పటివరకు 5 వేల పాఠశాలలు మాత్రమే ఆదాయ వ్యయాలను సమర్పించాయి. మిగతా 6 వేలకు పైగా పాఠశాలలు ఇవ్వలేదు. అందులో ఓ మోస్తరు స్కూళ్లతోపాటు ముఖ్యమైన ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలలు ఉన్నాయి. ఇదే అదునుగా యాజమాన్యాలు 30 శాతం వరకు ఫీజుల పెంపునకు చర్యలు ప్రారంభించాయి. 

హైదరాబాద్‌లోనే దారుణం 
విద్యార్థుల నుంచి అత్యధిక ఫీజులు వసూలు చేయడంలో హైదరాబాద్‌ పాఠశాలలు దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నాయి. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై తదితర నగరాల్లో ఫీజులు రూ.లక్షన్నరలోపే ఉన్నాయి. హైదరాబాద్‌లో మాత్రం రూ.3.50 లక్షల వరకు ఫీజులున్నాయి. ఢిల్లీలో ఏటా 10 శాతం లోపే ఫీజులు పెరుగుతున్నాయి. కాని హైదరాబాద్‌లో మాత్రం 15–40 శాతం వరకు పెరుగుతున్నాయి. ఇక ఇతర రకాల ఫీజులు కలిపితే మరో లక్ష ఉంటుంది. ఓ ప్రముఖ ఇంజనీరింగ్‌ కళాశాలను నిర్వహిస్తున్న యాజమాన్యం ఇంటర్నేషనల్‌ పేరిట పాఠశాలను ప్రారంభించింది. అక్కడ ప్రస్తుతం ఒకటో తరగతి విద్యార్థికే రూ.2.73 లక్షలు వసూలు చేస్తున్నారు. ఏటా కనీసం 10 శాతం పెరిగినా ఆ విద్యార్థి 5వ తరగతికి వచ్చేసరికి కేవలం ట్యూషన్‌ఫీజు ఏడాదికి రూ.4 లక్షలు చెల్లించాల్సి వస్తుంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement