దోపిడీకే మొగ్గు నిబంధనలు ఉఫ్..
♦ ఫీజుల నిర్ణయంపై జరగని సమావేశాలు
♦ ఇదీ జిల్లాలోని ప్రైవేట్ స్కూళ్ల తీరు
♦ చేతులెత్తేసిన విద్యాశాఖ
సంగారెడ్డి మున్సిపాలిటీ: ప్రైవేటు విద్యాసంస్థలు విద్యాహక్కు చట్టాన్ని కాలరాస్తున్నాయి. ఫీజుల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ అమలుకు నోచుకోవడం లేదు. ఫలితంగా విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రు ల నుంచి ఇష్టానుసారంగా ఫీజులు దండుకుంటున్నాయి. గుర్తింపు పొందని విద్యాసంస్థలు సైతం ఫీజుల వసూళ్లపై దృష్టిసారించాయి. ఏం చేయలేక విద్యాశాఖ చేతులెత్తేసింది. జిల్లాలోని ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు ఈనెల 15లోగా విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశమై ఫీజులపై నిర్ణయం తీసుకోవాలని డీఈఓ ఇదివరకే నోటీసులు జారీ చేశారు.
ఒకటి జనవరి 1994లో జారీ అయిన ఉత్తర్వుల ప్రకారం పాఠశాల స్థాయిలో గవర్నింగ్ బాడీ సమావేశాలు ఏర్పాటు చేయాలి. తరగతుల వారీగా ఎంత ఫీజు వసూలు చేయాలో నిర్ణయం తీసుకోవాలి. కానీ ఈ విద్యా సంవత్సరం ప్రారంభమైనా ఏ ఒక్క విద్యా సంస్థలో గవర్నింగ్ బాడీ సమావేశాలు నిర్వహించిన దాఖలాలు కనిపించడం లేదు. సమావేశాలు ఏర్పాటు చేయకపోగా విద్యార్థులను చేర్పించుకుంటూ వారి తల్లిదండ్రుల నుంచి భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నాయి. అప్పుడే తరగతులను సైతం ప్రారంభించాయి. ఫలితంగా ఒక్కో తరగతికి ఒక్కో రకమైన ఫీజుతోపాటు అడ్మిషన్, ట్యూషన్ ఫీజుల పేరిట నెల వారీగా వేలాది రూపాయలు వసూలు చేస్తున్నాయి.
విద్యాహక్కు చట్టం పక్కదారి...
విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లను ఎస్సీ, ఎస్టీ, బీసీ, అనాథ విద్యార్థులకు ఉచితంగా కేటాయించాలి. కానీ ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఆ నిబంధనను సైతం పట్టించుకోవడం లేదు. చట్టం తీసుకొచ్చి ఐదేళ్లు గడుస్తున్నా ఏ ఒక్క విద్యాసంస్థలో ఈ విధానం అమలుకు నోచుకోవడం లేదు.
అనుమతులు లేని స్కూళ్లు సంగతేంటో...
జిల్లాలో దాదాపు 274 ప్రైవేటు స్కూళ్లు అనుమతి లేకుండా నడుస్తున్నట్టు సమాచారం. సదరు పాఠశాలలు ఇప్పటివరకు విద్యాశాఖ నుంచి ఎలాంటి అనుమతులు పొందలేకపోయాయి. ఇలాంటి పాఠశాలలు జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో పదివరకు ఉంటాయి. కానీ ఒకటి నుంచి పదోతరగతి వరకు అడ్మిషన్లు ఇస్తూ విద్యార్థులను చేర్పించుకుంటూ వేలాది రూపాయలను డొనేషన్ల రూపంలో వసూలు చేస్తున్నాయి. ఈ పాఠశాలలను సైతం అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కలెక్టర్‌కు నివేదిస్తాం..
నిబంధనల ప్రకారం ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఈనెల 15లోగా గవర్నింగ్ బాడీ సమావేశాలు నిర్వహించి ఫీజులపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించి ఫీజులపై నిర్ణయం తీసుకున్నట్టు చేసిన తీర్మాన ప్రతులను డిప్యూటీ ఈఓ, ఎంఈఓల ద్వారా డీఈఓ కార్యాలయానికి పంపాల్సి ఉంది. బుధవారం సాయంత్రం 4 గంటల వరకు కూడా ఒక్క పాఠశాలలోనూ సమావేశాలు నిర్వహించినట్టు మాకు సమాచారం లేదు. కలెక్టర్ ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాం.
- నజీమొద్దీన్, డీఈఓ