గుంజుడే..
♦ ప్రైవేటు స్కూళ్ల ఫీజు దందా
♦ ఖర్చుల మోతతో తల్లిదండ్రుల గుండెల్లో రైళ్లు
♦ టై నుంచి పుస్తకాల వరకు అదనపు వసూళ్లు
♦ పాఠశాల స్థాయి చదువుకే రూ.లక్షల్లో ఖర్చు
♦ తల్లిదండ్రులపై ఏడాదికి రూ.50 కోట్ల అదనపు భారం?
జూన్.. ఈ నెలొచ్చిందంటే విద్యార్థుల తల్లిదండ్రులకు ఫీజు గండమే! ప్రైవేట్ స్కూలు యాజమాన్యాలు నిర్ణయించే ఫీజులు దడపుట్టిస్తాయి. టై నుంచి పుస్తకాల వరకు అన్నీ కలిపి తడిసి మోపెడవుతాయి. ఇక సీబీఎస్‌ఈ, ఇంటర్నేషనల్ సిలబస్ బోధించే స్కూళ్లలో ఫీజుల మాట వింటే కళ్లుబైర్లు కమ్మేస్తాయి. పిల్లలకు నాలుగు అక్షరం ముక్కలు నేర్పించేందుకు అప్పోసప్పో చేసేందుకూ తల్లిదండ్రులు వెనుకాడటం లేదు. ఇప్పటికే స్కూళ్లు మొదలయ్యాయి. దోపిడీకి మరింత తెర లేవడంతో పాటు ఫీజుల వసూళ్లు తారస్థాయికి చేరాయి. బహిరంగంగా నిలువు దోపిడీ చేస్తున్నా ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలను నియంత్రించే దిక్కులేదు.
జోగిపేట: జిల్లాలో 1,274 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నా యి. ఫీజులే కాకుండా బుక్స్, నోట్‌బుక్స్, షూ, బ్యాగుల అమ్మకాల ద్వారా పాఠశాలల యాజ మాన్యాలు రూ.కోట్లు వెనకేసుకుంటున్నాయి. ఇదంతా నిబంధనలకు విరుద్ధమే. తనిఖీలకు వెళ్లిన అధికారులు ఇవన్నీ చూసినా.. కళ్లు మూసుకుంటుండటం విమర్శలకు దారితీస్తోంది.
నిబంధనలు బేఖాతరు..
పాఠశాలల పునఃప్రారంభ సమయాన్ని స్కూళ్ల యజమానులు బాగా వాడుకుంటున్నారు. ఇప్పటికే ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తుండగా మరోవైపు పాఠ్య పుస్తకాలు, నోట్‌బుక్స్, యూనిఫారాలు, షూ, టై, డైరీ తదితర రూపాల్లో అదనంగా గుంజుతున్నారు. వాస్తవంగా ఇవన్నీ పాఠశాలల్లోనే కొనుగోలు చేయాలన్న నిబంధన ఎక్కడా లేదు. అయినా వారు స్కూళ్లలో ఏకంగా వీటికోసం ప్రత్యేకంగా కౌంటర్లు తెరిచి అధిక ధరలకు విక్రయిస్తుండడం గమనార్హం. బహిరంగ మార్కెట్‌లో ఇవి తక్కువ ధరకు లభిస్తాయి. అయినా ఇక్కడే కొనాలంటూ యాజమాన్యాలు ఒత్తిడి తెస్తున్నాయి.
ఎల్‌కేజీ పుస్తకాలు ఇలా...
ఎల్‌కేజీ పుస్తకాలకు రూ.3 వేల నుంచి రూ.3,500 వరకు వసూలు చేస్తున్నారంటే దోపిడీ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇవే పుస్తకాలు బయట రూ.1,500కే లభిస్తున్నాయి. రూ.150కే లభించే షూ కొన్ని పాఠశాలల్లో రెట్టింపు ధరకు అంటగడుతున్నారు. స్కూళ్లలో సామగ్రి అమ్మడం జీఓ నం 91కి విరుద్ధం. ఒకవేళ యాజమాన్యాలు విక్రయించాలనుకుంటే సదరు స్కూల్‌కు సంబంధించిన అభ్యాసన సామగ్రి తదితరాలు లభ్యమయ్యే రెండు షాపులను ప్రత్యామ్నాయంగా చూపాలి. ఎక్కడ తక్కువ ధర ఉంటే అక్కడ తల్లిదండ్రులు కొనుగోలు చేస్తారు. అయితే ఈ నిబంధన ఎక్కడా అమలు కావడం లేదు.
ప్రచారంతో ఆకట్టుకునే ప్రయత్నం
విద్యార్థులను తమ పాఠశాల వైపు ఆకట్టుకునేందుకు ప్రైవేట్ యాజమాన్యాలు పోటీ పడి ప్రచారం చేసుకుంటున్నాయి. ప్రచారానికే లక్షలాది రూపాయలు వెచ్చిస్తున్నాయి. విద్యార్థులు తమ పాఠశాలలో చేరేలా ఉపాధ్యాయులను యాజమాన్యాలు ఇంటింటికీ పంపుతున్నాయి.
ఒక్క అడ్మిషన్ తెస్తే రూ.500..
పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచుకునేందుకు యాజమాన్యాలు జిమ్మిక్కులు ప్రదర్శిస్తున్నాయి. పాఠశాలల్లో పీఆర్‌ఓల పేరుతో ముగ్గురు నుంచి ఐదుగురిని ఏర్పాటు చేసుకొని ఒక్క అడ్మిషన్ తెస్తే సదరు వ్యక్తికి రూ.500 నుంచి రూ.1,000 చెల్లిస్తున్నాయి. ప్రధాన పట్టణాల్లో ఈ పద్ధతి కొనసాగుతోంది. పీఆర్‌ఓలు తమ వ్యక్తిగత పలుకుబడితో ఈ సీజన్‌లోనే అడ్మిషన్లు తీసుకు వచ్చి వేలాది రూపాయలు సంపాదించుకుంటున్నారు. కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులకు కూడా ఇలాంటి ఇన్సెంటివ్‌లు చెల్లిస్తున్నారు.
దాదాపు రూ.50 కోట్ల అదనపు భారం
జిల్లాలో 1,274 ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. ఈ జాబితాలో సీబీఎస్‌ఈ, ఇంటర్నేషనల్ సిలబస్ బోధించే స్కూళ్లు ఉన్నాయి. వీటిలో సుమారుగా 4 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని కొన్నింటిలో ఒక్కో పాఠశాలలో 2,000 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఒక్కో విద్యార్థి సగటున స్కూలు ఫీజుగా రూ.50 వేలు చెల్లిస్తున్నట్టు అంచనా. ఈ ఏడాదికి యాజమాన్యాలు దండుకుంటున్న మొత్తం రూ.50 నుంచి రూ.60 కోట్ల వరకు ఉండవచ్చని తెలుస్తోంది. సీబీఎస్‌ఈ స్కూల్‌లో నర్సరీలో చేరేందుకు (హాస్టల్‌తో కలిపి) రూ.52 వేల చొప్పున వసూలు చేస్తున్నారు. డేస్ స్కాలర్‌కు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు చెల్లించాల్సి వస్తుంది. ఒక్కో విద్యార్థి 14 ఏళ్లపాటు పాఠశాల విద్యను పూర్తి చేసేందుకు ఒక్కో విద్యార్థికి రూ.10 లక్షలకు పైగానే వెచ్చించాల్సి వస్తుంది.