సాక్షి ప్రతినిధి, కడప : ప్రైవేటు పాఠశాలల దందా అప్పుడే మొదలైంది. గత సంవత్సరం మొదలైన ముందస్తు విద్యావిధానం రెండో సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ ఏడాది అది కొనసాగుతుందా లేదా అన్న విషయమై స్పష్టత లేకున్నా.. దానిని ఆసరాగా చేసుకుంటున్న కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు ఇంకా ప్రస్తుత సంవత్సర ఆఖరి త్రైమాసిక పరీక్షలు పూర్తికాకముందే పిల్ల లపై ఫీజుల పేర ఒత్తిడి తీసుకొస్తున్నారు. నెలాఖరులోపు పుస్తకాలు కొనుగోలు చేయాలని ఒత్తిడి తీసుకురావడమే కాదు.. పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు ఒక్కొక్కరిపైనా కచ్చితంగా కొత్త పిల్లలను చేర్పించే బాధ్యతను పెడుతున్నారు.
లేకపోతే మరుసటి ఏడాది ఉద్యోగాలకు రానక్కర్లేదని ఒక నెల జీతం కత్తిరిస్తామని కొన్ని పాఠశాలల యాజమాన్యాలు కరాఖండిగా తెగేసి చెబుతున్నాయి. జిల్లాలో 1151 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. వీటిలో నర్సరీ నుంచి పదో తరగతి వరకు సగటు ఫీజు పాఠశాల స్థాయిని బట్టి రూ. 15 వేల నుంచి రూ. 40 వేల వరకు ఉంది. సాధారణంగా ప్రతీ సంవత్సరం జూన్‌లో విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేది. దీంతో ఆ సమయంలోనే పుస్తకాలు కొనుగోలు చేసేవారు. ఫీజు కూడా మొదటి విడతను జూన్ లేదా జూలైలో చెల్లించే వారు. ఈ విద్యా సంవత్సరం నుంచి సీబీఎస్‌ఈ విధానం తరహాలో మార్చిలోనే విద్యార్థులకు పరీక్షలు పూర్తిచేసి ఏప్రిల్ నుంచి తర్వాత విద్యా సంవత్సరం తరగతులు ప్రారంభింప చేయాలని ఆదేశించారు. ఈ విధానం మంచిదనే అభిప్రాయం అందరిలోనూ ఉంది.
ప్రభుత్వ మార్గదర్శకాలు ఇలా..
తర్వాతి విద్యా సంవత్సరం తరగతులు ముందస్తుగా ప్రారంభించినా దానికి సంబంధించిన పాఠ్యపుస్తకాలను పిల్లలతో కొనుగోలు చేయించకుండా తమ వద్ద అందుబాటులో ఉన్న పుస్తకాలతో ప్రాథమికంగా నెలరోజులపాటు అవగాహన కల్పించాలని సూచించారు. ఇక ఫీజు విషయానికొస్తే ఎప్పటి మాదిరిగానే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యాక చెల్లింపు ప్రక్రియ ప్రారంభించాలని చెప్పారు. అయితే ఆచరణ మాత్రం అందుకు భిన్నంగా ఉంది. కొన్ని కార్పొరేట్ పాఠశాలల్లో ఇప్పటికే పరీక్షలన్నీ పూర్తికాగా వారం రోజుల నుంచి ఫీజులు చెల్లించాలని సతాయిస్తున్నారు. పిల్లల పోరు పడలేక కొందరు తల్లిదండ్రులు చెల్లిస్తున్నారు. కొంత మంది అయితే అప్పులు చేసి ఫీజులు చెల్లించడానికి సిద్ధమవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఒక్కో కుటుంబంపై రూ. 47 వేలు భారం
జిల్లాలో 7లక్షల కుటుంబాలుండగా వీరిలో సుమారు 4 లక్షల కుటుంబాల్లో ఎల్‌కేజీ నుంచి పదో తరగతి వరకూ చదివేవారు ఉన్నారు. ఒక్కో ఇంటికి ఇద్దరేసి పిల్లలున్నా.. ఒక్కొక్కరికి విద్యా సంవత్సరం మొత్తానికి సరాసరిన రూ. 25 వేల వరకూ ఫీజు ఉంది. కుటుంబానికి ఇద్దరనుకుంటే 8 లక్షల మంది పిల్లలకు కలిపి పైలెక్కలు ప్రకారం 2 వేల కోట్ల భారం తల్లిదండ్రులపై పడుతుంది. ఇక మొదటి విడత ఫీజు కింద దీనిలో 50 శాతం వరకూ అంటే రూ. 1,000 కోట్లు వసూలు చేస్తున్నారు. ఒక్కో కుటుంబంపై భారం లెక్కిస్తే ఇద్దరు పిల్లలకు రూ. 50 వేల చొప్పున మొదటి విడత కింద రూ. 25 వేలు చెల్లించాలి. ఇదికాకుండా పుస్తకాల కోసం ఒకొక్కరికి సరాసరిన రూ. 6 వేల చొప్పున రూ. 12 వేలు చెల్లించాలి. బస్సు ఫీజు నిమిత్తం కూడా కొందరు అడ్వాన్సుగా కట్టించుకుంటున్నారు. మొదటి విడతగా ఇద్దరికీ కలిపి 10 వేల వరకూ ఉంటుంది. సరాసరిన ఇద్దరు పిల్లలున్న ఒక్కో కుటుంబంపై రూ. 47 వేల వరకూ భారం పడుతుంది. సగటు తల్లిదండ్రులు ఈ భారాన్ని జూన్, జూలైలలో మోసేవారు. తమ జీతాల నుంచి నెలవారీ మినహాయించుకుని ఆర్థికంగా ఇబ్బంది పడకుండా చేసుకునే వారు. ఇప్పుడు ఒక్కసారిగా ఈ భారం మీదపడడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment