
మూడు కేటగిరీల్లో పాఠశాలల ఫీజులు
రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల ప్రాంతం, స్థాయిని బట్టి మూడు కేటగిరీలుగా ఫీజులను నిర్ణయించాలని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు
- నిర్ణయించాలని కోరిన ప్రైవేటు యాజమాన్యాలు
- తొలిసారి భేటీ అయిన ఫీజుల నియంత్రణ కమిటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల ప్రాంతం, స్థాయిని బట్టి మూడు కేటగిరీలుగా ఫీజులను నిర్ణయించాలని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు కోరగా, పాఠశాలల ఆదాయ వ్యయాలను బట్టే ఫీజుల నిర్ధారణకు చర్యలు చేపట్టాలని తల్లిదండ్రుల కమిటీలు కోరాయి. ఉస్మానియా మాజీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ తిరుపతిరావు చైర్మన్‌గా, పాఠశాల విద్యా కమిషనర్ కిషన్ కన్వీనర్‌గా ప్రభుత్వం నియమించిన ఫీజుల నియంత్రణ కమిటీ గురువారం పాఠశాల విద్యా డైరెక్టరేట్ కార్యాలయంలో మొదటిసారిగా సమావేశమైంది.
ఈ సందర్భంగా తెలంగాణ తల్లిదండ్రుల సంఘం, హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్, ప్రైవేటు పాఠశాలల యాజమాన్య సంఘా లు తమ వాదనలను వినిపించాయి. రాత పూర్వకంగా ప్రతిపాదనలను అందజేశాయి. గ్రామీణ, మండల స్థాయిలోని పాఠశాలలను ఒక కేటగిరిగా తీసుకోవాలని, పట్టణ ప్రాంతాలు, జిల్లా హెడ్ క్వార్టర్‌లోని స్కూళ్లను రెండో కేటగిరిగా, కార్పొరేట్, ఇంటర్నేషనల్ స్కూళ్లను మూడో కేటగిరిగా తీసుకుని ఫీజులను నిర్ణయించాలని యాజమాన్య సంఘాల ప్రతినిధులు శ్రీనివాస్‌రెడ్డి, ఎస్‌ఎన్‌రెడ్డి కోరారు. అన్ని పాఠశాలలను ఒకేలా చూడవద్దని, ప్రాంతాలను బట్టి కూడా తేడాలు ఉంటాయన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ తల్లిదండ్రుల సంఘం, హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఎన్.నారాయణ, అరవింద్, వెంకట్ తదితరులు.. వృత్తి విద్యా కోర్సుల్లో ఫీజులను నిర్ధారిస్తున్నట్లుగా రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ఏఎఫ్‌ఆర్‌సీని ఏర్పాటు చేసి ఫీజులను నిర్ణయించాలని కోరారు. పాఠశాలల ఆదాయ వ్యయాలను బట్టే ఫీజులను నిర్ణయించాలని విజ్ఞప్తి చేశారు.
ఇప్పటికే ఫీజుల నిర్ధారణకు ప్రభుత్వం జారీ చేసిన ఉత్వర్వులు ఉన్నాయని, వాటిని పరిగణనలోకి తీసుకోవడంతో పాటు ఫీజుల నియంత్రణను త్వరగా తేల్చాలని కోరారు. అయితే ఈ సందర్భంగా ఒక్కో సంఘం నుంచి ఒక్కరే సమావేశంలో పాల్గొనాలని కమిటీ సూచించింది. ఒక్కో సంఘం నుంచి ముగ్గురిని అనుమతించాలని కోరినా కాదనడంతో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు వెళ్లిపోయాయి. ప్రభుత్వం వద్దకు వెళ్లి ఒక్కో సంఘం నుంచి ముగ్గురు చొప్పున ప్రతినిధులను అనుమతించాలని కోరతామని యాజమాన్యాల ప్రతినిధులు చెప్పారు. దీంతో ఏప్రిల్ 4న మరోసారి సమావేశం నిర్వహించి ప్రతిపాదలను స్వీకరించాలని కమిటీ నిర్ణయించింది.