రసాభాస
– విద్యార్థి సంఘాలు, ప్రైవేటు స్కూళ్ల కరస్పాండెంట్లతో అధికారుల సమావేశం
- విద్యార్థి సంఘాల ప్రశ్నలకు నీళ్లు నమిలిన కరస్పాండెంట్లు
– చందాలు ఇస్తున్నామంటూ ఎదురుదాడి
– అర్ధంతరంగా సమావేశం రద్దు చేసిన జేసీ-2
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణపై జేసీ–2 రామస్వామి ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన ప్రైవేట్ స్కూళ్ల కరస్పాండెంట్లు, హెచ్‌ఎంలు, విద్యార్థి సంఘాల సమావేశం రసాభాసగా మారింది. డీఈఓ తాహెరా సుల్తానా అధ్యక్షతన ముందుగా అధికారులు విద్యార్థి సంఘాల నాయకులు వై.ఓబులేసు(ఎస్సీ, ఎస్టీ విద్యార్థి పరిషత్), శ్రీరాములు(ఆర్‌పీఎస్‌ఎస్‌ఎఫ్), నాగమధు యాదవ్(ఎన్‌ఎస్‌యూఐ), రవికుమార్(ఆర్‌వీఎస్‌ఎఫ్), అక్బర్(ఎస్‌ఎఫ్‌ఐ) చంద్రప్ప(టీఎస్‌ఎఫ్)లతో సమావేశం అయ్యారు. ఫీజుల నియంత్రణకు సంబంధించిన జీఓలు 1, 42, 37, 99 లను పకడ్బందీగా అమలు చేయాలని కోరారు.
దూసుకొచ్చిన విద్యార్థి సంఘాల నేతలు
ప్రైవేట్ స్కూళ్ల అసోసియేషన్ నాయకులు జి.పుల్లయ్య, కట్టమంచి జనార్దన్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, కార్పొరేట్ పాఠశాలల హెచ్‌ఎంలతో సమావేశమైన జేసీ–2 అధికంగా ఫీజులను వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రైవేట్ స్కూళ్ల అసోసియేషన్ నాయకులు స్పందిస్తూ కార్పొరేట్ స్కూళ్లలోనే అధికంగా ఫీజులను వసూలు చేస్తున్నారని, ఆయా పాఠశాలల యాజమాన్యాలను పిలిపించి మాట్లాడితే బాగుంటుందని సూచించారు. మరో సమావేశాన్ని ఏర్పాటు చేసి వారిని కూడా పిలిపిస్తామని అధికారులు పేర్కొంటుండగా విద్యార్థి సంఘాల నాయకులు సమావేశంలోకి దూసుకొచ్చి నగరంలోని కొన్ని ప్రైవేట్‌పాఠశాలల్లో ఎంత ఫీజులు వసూలు చేస్తున్నారో వివరించారు. ముఖ్యంగా రిడ్జ్, కట్టమంచి, అథెనా తదితర స్కూళ్లు ఒక్కో ఏడాదికి రూ.లక్ష వసూలు చేస్తున్నాయన్నారు. అందుకు వారు ప్రతిగా సంఘాల పేరుతో చందాలు వసూలు చేయడం లేదా అని ప్రశ్నించారు. ఇందుకు ఎవరికీ చందాలు ఇచ్చారో చెప్పాలని విద్యార్థి సంఘాలు పట్టుబట్టాయి. విద్యార్థి సంఘాల నాయకులు, ప్రైవేట్ స్కూళ్ల అసోసియేషన్ నాయకుల మధ్య తీవ్ర వాగ్వావాదం చోటుచేసుకోవడంతో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో సమావేశాన్ని రద్దు చేస్తున్నట్లు జేసీ–2 ప్రకటించి వెళ్లిపోయారు. ఇదిలా ఉండగా డీఈఓ మాత్రం సమావేశంలో నోరు మెదకపోవడం గమనార్హం.