ప్రైవేట్‌ విద్యతో పేదలకు పిడుగుపాటే | Mallepalli Laxmaiah Article On New Education Policy | Sakshi
Sakshi News home page

ప్రైవేట్‌ విద్యతో పేదలకు పిడుగుపాటే

Published Thu, Sep 10 2020 12:43 AM | Last Updated on Thu, Sep 10 2020 4:11 AM

Mallepalli Laxmaiah Article On New Education Policy - Sakshi

‘‘సమానత్వం, సామాజిక న్యాయం సాధనలో ఒకే ఒక గొప్ప సాధనం విద్య. సమ్మిళిత, సమభావనతో కూడిన విద్య సమసమాజం సాధించడంలో కీలక భూమిక పోషిస్తుంది. ప్రతి పౌరుడు సమాజంలో గౌరవస్థానం పొందడానికి కలలుకంటూ వాటిని సాధించుకోవడానికి నిరంతరం తపనపడుతుంటారు. భారతదేశంలోని ప్రతి బాలుడు, బాలిక తాము అభివృద్ధి చెంద డానికి అవకాశాలు ఉండాలి. వారి పుట్టుక, సామాజిక నేపథ్యం వల్ల వాళ్ళు నిరాదరణకు గురి కావద్దు’’ అని కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టబోతోన్న ‘జాతీయ విద్యా విధానం’ విధాన పత్రంలో పేర్కొన్నారు. కస్తూరి రంగన్‌ నాయకత్వంలో నియమించిన కమిటీ తన నివేదికను డిసెంబర్‌ 15, 2018న ప్రభుత్వానికి సమర్పించింది. దాదాపు ఒకటిన్నర ఏడాది తర్వాత 2020, జూలై 19వ తేదీన కేంద్ర మంత్రి మండలి ఈ నివేదికకు ఆమోదం తెలిపింది. దాదాపు 484 పేజీలతో కూడిన ఈ నివేదిక సారాన్ని 66 పేజీలకు కుదించి, కేంద్ర ప్రభుత్వం తన విధానంగా ప్రకటించుకున్నది. అందులో 27 అంశా లను పొందుపరిచారు. పైన పేర్కొన్న వాక్యాలు ఆరవభాగంలోనివి. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన జాతీయ విద్యావిధానంపైన ఇప్పటికే చాలా మంది తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. కానీ అందరూ విస్మరించిన ఏకైక అంశం ఆరవ భాగం. ఈ మొత్తం విధానంలో ఇదే కీలకమైనదని భావిస్తున్నాను.

వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యత లభిస్తుందా?
చారిత్రకంగా విద్య సముపార్జనలో ప్రాతినిధ్యం లేని వర్గాలకు న్యాయం జరగాలని ఆ ఆరవభాగం సారాంశం. దీనికి అనుబంధంగా ఈ విధానంలో 14వ భాగాన్ని కూడా జోడించారు. ఈ వర్గాలను సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన బృందాలుగా పేర్కొన్నారు. ఇందులో మళ్ళీ కొన్ని విభజనలు చేశారు. ఇందులో లింగ వివక్షను ఎదుర్కొంటోన్న మహిళలు, ట్రాన్స్‌ జెండర్స్, సామాజికంగా, సాంస్కృతికంగా అణగారిన వర్గాలుగా ఉన్న ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు, మైనారిటీలు, భౌగోళికంగా వివక్షకు గురవుతోన్న గ్రామీణ, చిన్నపట్టణాల, వెనుకబడిన జిల్లాల విద్యార్థులు, దివ్యాంగులు, అంతిమంగా సామాజికంగా, ఆర్థికంగా సమస్యలు ఎదుర్కొంటోన్న వలస కార్మికులు, స్వల్ప ఆదాయ వర్గాలు, ఇలా ఎన్నో వర్గాలను ఇందులో పేర్కొన్నారు. 

యునైటెడ్‌ డిస్ట్రిక్ట్‌ ఇన్‌ఫర్మేషన్‌ సిస్టం ఫర్‌ ఎడ్యుకేషన్‌(యు.డైస్‌) సర్వే ప్రకారం ఎస్సీ, ఎస్టీలలో, దివ్యాంగుల్లో బడిమానేస్తున్న వారి సంఖ్య అధికంగా ఉన్నదని కూడా ఈ నివేదికలో పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల పిల్లలు విద్యను ప్రత్యేకించి, నాణ్యమైన విద్యను అందుకోలేకపోతున్నారని కూడా నివేదిక స్వయంగా ప్రకటిం చుకున్నది. ఈ విషయాన్ని ఇంత వివరంగా చెప్పడానికి ఒక కారణం ఉన్నది. జాతీయ విద్యావిధాన పత్రంలో ఉన్న 27 భాగాల అంశాలు సాంకేతికపరమైనవి, పాలనాపరమైనవి, విధానపరమైనవి. అయితే ప్రభుత్వం నామకరణం చేసిన ఎస్‌.ఇ.డి.జి వర్గాలకు విద్య అందడా నికి ప్రభుత్వాలు నిర్దేశిస్తున్న విద్యను అందించడానికి ఎటువంటి విధానాలు అవలంబించాలనే దానిపై సమగ్రమైన ప్రణాళిక లేదని స్పష్టమౌతోంది. 

ప్రత్యేక నిధుల కేటాయింపు అభినందనీయం
ఈ విధానపత్రంలోని 14వ భాగంలో ఏవో కొన్ని సూచనలు చేశారు. అందులో ప్రభుత్వం ఎన్‌.ఇ.డి.జి వర్గాల ఉన్నత విద్యకు అవసరమైన నిధులను ప్రత్యేకంగా కేటాయించాలని పేర్కొన్నారు. ప్రైవేట్, ప్రభుత్వ ఉన్నత విద్యాసంస్థల్లో చదివే ఈ వర్గాల విద్యార్థు లకు ఆర్థిక సహాయం, స్కాలర్‌షిప్‌లు అందించాలని సూచించారు. వీటితో పాటు మరికొన్ని ప్రతిపాదనలు చేశారు. సంతోషమే. అటువంటి నిర్ణయం చేయడంలో శ్రద్ధ చూపించినందుకు అభినందించాలి. అయితే వాటిని ఎట్లా అమలు చేస్తారు? అందులో ప్రభుత్వం ఏమేరకు చిత్తశుద్ధితో పనిచేస్తుందనేదీ ప్రశ్నార్థకమే. 
అయితే ఇప్పటివరకు గత ఆరేళ్ళలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ వర్గాల పట్ల అనుసరిస్తున్న వైఖరికీ, ఇప్పుడు వీరి విద్యా భివృద్ధికి మాట్లాడుతున్న మాటలకు ఎక్కడా పొంతన కుదరడం లేదు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు ప్రతి సంవత్సరం ఇచ్చే పోస్ట్‌మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌లు గణనీయంగా క్షీణించడం ఒక ఉదాహరణ మాత్రమే. అయితే ప్రభుత్వం గత అనుభవాలను సమీక్షించుకొని, తన విధానాలలో మార్పులు తీసుకువస్తే, మంచి పరిణామమే అవుతుంది.

అణగారిన వర్గాల అభివృద్ధే ప్రగతికి కొలమానం
భారతదేశంలో అణగారిన వర్గాల సంఖ్య విస్మరించదగినది కాదు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ విద్యా విధానంలో పేర్కొన్న ఎస్‌.ఇ.డి.జి.లు దాదాపు 80 శాతం నుంచి 90 శాతం వరకు ఉంటారు. ఈ దేశంలోని ఏ అభివృద్ధినైనా కొలవాలంటే వీరి ప్రగతిపైనే ఆధారపడి ఉంటుంది. భారతదేశం విద్యారంగంలో తలెత్తుకొని నిల బడాలంటే, ఈ వర్గాలు ఆత్మగౌరవంతో ఆర్థిక, సామాజిక రంగాల్లో ముందడుగు వేయాలి. అందుకుగాను విద్య ఎంతో ముఖ్యమైన అంశం అవుతుందని జాతీయ విద్యా విధాన పత్రమే స్పష్టం చేసింది. ఈ విషయంలో దక్షిణాదిలో ఉన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్రాలు మార్గదర్శకంగా ఉన్నాయనడంలో సందేహం లేదు. అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్టాలు ఇంకా కొంత నిర్దిష్ట విధానాలను అవలంబిస్తున్నాయి. జాతీయ విద్యా విధానంలో పేర్కొన్న వర్గాల కోసం, ఈ రాష్ట్రాలు ఒక నమూనాగా నిలుస్తున్నా యనడంలో ఆశ్చర్యం లేదు. 

రెసిడెన్షియల్‌ స్కూల్‌ విధానం ప్రాణాధారం
ఈ వర్గాల్లో విద్యావ్యాప్తి వారి సామాజిక, ఆర్థిక పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. కనీసం చదువుకొనేందుకు సైతం వారి ఇండ్లు, పరిసరాలు అనువుగా ఉండవనేది ఒక సత్యం. అందుకుగాను ప్రత్యేక హాస్టల్స్, రెసిడెన్షియల్‌ పాఠశాలలు, కళాశాలలు కావాలనేది 1927లో బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ బొంబాయి ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌లో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. అందుకు అనుగుణంగానే ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో రెసిడెన్షియల్‌ స్కూల్‌ విధానం ప్రారంభమైంది. 2012 సంవ త్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఆమోదించిన సబ్‌ప్లాన్‌ చట్టం తర్వాత ఈ సంఖ్య గణనీయంగా పెరిగింది.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ రెసిడెన్షియల్‌ పాఠశాలలు 188, ఎస్టీ 190, బీసీ 104లకు కొత్తగా అనుమతి లభించగా, ఇప్పటికే 84 రెసిడెన్షియల్‌ పాఠశాలలు ఉన్నాయి. తెలంగాణలో ఎస్సీలకు 268, ఎస్టీలకు 183, బీసీలకు 142, మైనారిటీలకు 204 రెసిడెన్షియల్‌ విద్యా లయాలున్నాయి. తెలంగాణలో డిగ్రీ విద్యార్థులకు 30 రెసిడెన్షియల్‌ కళాశా లలున్నాయి. కర్ణాటకలో కూడా ఎస్సీలకు 500, ఎస్టీలకు 153, బీసీలకు 165 రెసిడెన్షియల్‌ పాఠశాలలున్నాయి. అయితే తెలంగాణలో మైనారిటీల కోసం నిర్వహిస్తున్న రెసిడెన్షియల్‌ పాఠశాలలు దేశంలోనే తొలి ప్రయత్నం.

అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం, పాఠశాల విద్య కోసం ఎన్నో వినూత్న ప్రయోగాలు మొదలుపెట్టింది. పాఠశాలలు, కళాశా లల్లో మౌలిక వసతుల కోసం పన్నెండు వేలకోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించారు. ఈ సంవత్సరం 3,800 కోట్లు ఖర్చు చేయాలని అంచనా వేశారు. అది పెరిగే అవకాశం కూడా ఉంది. దీనితో పాటు బడికి వెళ్ళే పిల్లల కుటుంబాలకు ఒక్కొక్కరికి 15 వేల చొప్పున దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారిని ఎంపిక చేసి ఇస్తున్నారు. దీన్నే అమ్మఒడి పథకంగా పిలుస్తున్నారు. జగనన్న విద్యాకానుక పేరుతో మూడు జతల యూనిఫాం, పుస్తకాలు, నోట్‌ బుక్స్, ఒక జత బూట్లు, బెల్ట్, బ్యాగ్‌తో సహా బడికెళ్ళిన రోజే అందిస్తున్నారు. 43 లక్షల మంది పిల్లలు దీని వల్ల లబ్ధిపొందుతున్నారు. 648 కోట్ల రూపాయలు దీనికి కేటా యించారు.


గోరుముద్దతో పౌష్టికాహారానికి హామీ
మధ్యాహ్న భోజన పథకానికి అదనపు బడ్జెట్‌ కేటాయించి, మంచి పౌష్టికాహారాన్ని జగనన్న గోరుముద్ద పేరుతో అందిస్తున్నారు. ఇది ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల్లో ఆత్మ స్థైర్యాన్ని నింపుతుంది. వారికొక భరోసానిస్తుంది. ప్రభుత్వ విద్యను బలోపేతం చేసే, ప్రభుత్వ పాఠశాలలకు గౌరవం తెచ్చిపెట్టే ఇటు వంటి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా అమలుచేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. జాతీయ విద్యావిధాన పత్రంలో అత్యంత లోపభూయిష్టంగా ఉన్న విషయం, సమకాలీన, సామాజిక, ఆర్థిక పరిస్థితులను విస్మరించడం. ఈ రోజు డ్రాపౌట్స్‌ సంఖ్య విపరీతంగా పెరగడానికీ, నైపుణ్యత కలిగిన విద్యను అందుకోలేకపోవడానికి పేదరికమే ప్రధాన కారణం. దేశంలోని ఎస్‌.ఇ.డి.జి. వర్గాల సామాజిక, ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు తీసుకు రాకుండా ఎటువంటి సంస్కరణలైనా తాత్కాలికమే అన్న విషయం ఇప్పటికైనా గుర్తించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా విద్య ప్రైవేటీకరణ విషయంలో సన్నాయినొక్కులు నొక్కుతున్నారు. దానికి ఫిలాంత్రఫీ అనే ఒక పదాన్ని పదే పదే వాడారు. ప్రైవేట్‌ విద్యకు ఫిలాంత్రఫిస్టులు (ధర్మదాతలు) చేత ప్రోత్సహించాలని రాసు కున్నారు. ఇప్పటికీ జరుగుతున్నదదే. 

ప్రైవేట్‌ విద్యతో సమాజ సేవ బూటకం
ప్రతి ప్రైవేట్‌ పాఠశాల, కార్పొరేట్‌ విద్యాసంస్థల అధినేతలందరూ తాము వ్యాపారం కోసం మాత్రమే కాక, సమాజ సేవకోసం విద్యా సంస్థలు నడుపుతున్నామనే చెప్పుకుంటారు. కానీ అసలు నిజం అందరికీ తెలుసు. ప్రైవేట్‌ విద్యను ప్రోత్సహించడమంటేనే, ఈ దేశం లోని 90 శాతం మంది ప్రజలను, విద్యార్థులను చీకట్లోకి నెట్టివేయ డమే తప్ప మరొకటి కాదు. లక్షల రూపాయల ఫీజులు కట్టి, చదివే విద్యార్థులతో చెట్లకింద చదివే విద్యార్థులు పోటీపడటం అసాధ్యం. అందుకే ప్రభుత్వాలు మాట్లాడే మాటలను ఆచరణతో పోల్చి చూసు కుంటే నిజా నిజాలు తేటతెల్లం అవుతాయి.

మల్లెపల్లి లక్ష్మయ్య
వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్‌ : 81063 22077

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement