సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో అధికంగా ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలపై చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం ఉపక్రమించింది. పాఠశాల విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ ఆధ్వర్యంలో గురువారం రాష్ట్రవ్యాప్తంగా 130 పాఠశాలలను అధికారులు తనిఖీలు చేశారు. నిబంధనలు అతిక్రమించిన పాఠశాలలపై చర్యలు తీసుకున్నారు. ఈ తనిఖీల్లో పాఠశాలల్లో వసూలు చేసే ఫీజుల వివరాలు, విద్యార్థులకు సౌకర్యాల కల్పన, బోధించే వారి అర్హతలు, పాఠశాల భవనాలు తదితరాలను పరిశీలించారు.
విజయనగరం జిల్లా వ్యాప్తంగా 24 పాఠశాలలలో తనిఖీలు చేపట్టి.. మౌలిక సదుపాయాలు, తదితర అంశాలపై ఆరా తీశారు. అనంతపురం జిల్లాలోని ఏపీ పాఠశాల విద్య కమిషన్ ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. పలు ప్రైవేట్, కొర్పొరేట్ పాఠశాలలకు వెళ్లి మౌలిక సదుపాయాలు, ఫీజు వివరాలపై అధికారులు ఆరా తీశారు. రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏపీ పాఠశాల విద్యా కమిషన్ సభ్యులు ఆలూరు సాంబశివారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అధిక ఫీజులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలపై రాష్ట్ర వ్యాప్తంగా 130 పాఠశాలలలో తనిఖీలు చేపట్టామన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మొదటిసారి నిబంధనలు అతిక్రమిస్తే జరిమానాలు విధిస్తామని, పదేపదే చేస్తే లైసెన్స్‌లను రద్దు చేస్తామని చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి నిబంధనలను మరింత పకడ్బంధీగా అమలు చేస్తామని పేర్కొన్నారు. ప్రైవేట్ విద్యాసంస్థల్లో వెట్టి చాకిరి సహించేది లేదని స్పష్టం చేశారు. తిరుపతి, ప్రకాశం, ఒంగోలు, టంగుటూరు, దర్శి, చీరాలలోని పలు ప్రైవేట్ పాఠశాలలో అధికారులు తనిఖీలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment