డీసీఈబీ ప్రశ్నపత్రాలు పక్కనబెట్టి సొంతంగా పరీక్షలు
90 శాతం సర్కారు స్కూళ్లలో డిజిటల్ ఏర్పాట్లు
డీజీ రికార్డులు నిర్వహిస్తున్నది 50 శాతమే..
20 శాతం ప్రైవేట్ బడుల్లో మాత్రమే డిజిటల్ పాఠాలు
అన్నింటిలోనూ రెసిడెన్షియల్ పాఠశాలలు టాప్
ప్రత్యేక బృందాల తనిఖీల్లో వెలుగుచూసిన వాస్తవాలు
నల్లగొండ : విద్యార్థుల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ప్రవేశపెట్టిన నిరంతర సమగ్ర మూల్యాంకన (సీసీఈ) విధానం జిల్లాలో సక్రమంగా అమలుకావడం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విధానం అమలు మెరుగవుతున్నా.. ప్రైవేట్ స్కూళ్లలో మాత్రం మొక్కుబడిగా సాగుతోంది. విద్యార్థుల్లో సృజనాత్మకను పెంచి.. వారిలో ఆచరణాత్మక విజ్ఞానాన్ని పెంపొందించేందుకు రాష్ట్ర విద్యాశాఖ అధికారులు సీసీఈ విధానానికి శ్రీకారం చుట్టారు. విద్యార్థుల సామర్థ్యాన్ని బట్టి ఒక్కో పాఠ్యాంశానికి 20 మార్కులు కలుపుతున్నారు.
ఈ క్రమంలో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో సీసీఈ విధానం అమలు, బోధన సామర్థ్యం వంటి అంశాలను పరిశీలించాలని రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సీనియర్ ప్రధానోపాధ్యాయులు, నిపుణులైన ఉపాధ్యాయులతో జిల్లా విద్యాశాఖ మొత్తం 49 బృందాలను ఏర్పాటు చేసింది. గత నెల తొమ్మిది నుంచి 21వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా 488 ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్, మోడల్ స్కూళ్లు, ఆశ్రమ పాఠశాలలు, కేజీబీవీలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో తనిఖీలు చేపట్టగా.. అనేక వాస్తవాలు వెలుగుచూశాయి.
సమగ్ర మూల్యాంకనానికి తూట్లు....
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో సీసీఈ విధానం అమలు మెరుగవుతున్నా.. ప్రైవేట్ బడుల్లో మాత్రం తూట్లు పొడిచారు. బట్టీ చదువులు, గైడ్లు, స్టడీ మెటిరీయల్‌ను విద్యార్థులకు అలవాటు చేస్తూ సీసీఈ విధానాన్ని నిర్వీర్యం చేస్తున్నట్లు పర్యవేక్షణ బృందాల పరిశీలనలో తేలింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారనం పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఒక్కో సబ్జెక్ట్‌కు 80 మార్కులు పోను మిగిలిన 20 మార్కులను విద్యార్థుల అంతర్గత మూల్యాంకనం (సామరŠాథ్యలు, వారు తయారు చేసిన ప్రాజెక్టులు, పుస్తక సమీక్షలు, ఇంటి పని, ఎఫ్‌ఏ, ఎస్‌ఏలో సాధించిన ఫలితాలు) ద్వారా కేటాయించాలి. ఈ 20 మార్కుల కేటాయింపులో ప్రైవేట్ యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని పరిశీలన బృందాలు గుర్తించాయి. డీసీసీఈబీ ప్రశ్నపత్రాలు కాకుండా సొంత క్వశ్చన్ పేపర్లతో పరీక్షలు నిర్వహిస్తున్నాయని గమనించాయి. ఈ మేరకు సీసీఈ విధానం నిర్వహణపై బృందాల సభ్యులు మరోసారి అవగాహన కల్పించారు.
తనిఖీల్లో తేలిన వాస్తవాలు..
జిల్లావ్యాప్తంగా 488 పాఠశాలలను విద్యా శాఖ బృందాలు సందర్శించాయి. 210 ప్రైవేట్, 230 ప్రభుత్వ, 10 ఆశ్రమ పాఠశాలలు, 22 కేజీబీవీలు, 16 ఆదర్శ పాఠశాలలను పరిశీలించాయి. ప్రభుత్వ పాఠశాలల్లో సీసీఈ అమలు పర్వాలేదని, ప్రైవేట్ పాఠశాలల్లో పాక్షికంగా మాత్రమే అమలవుతోందని జిల్లా విద్యాశాఖ అధికారులకు నివేదిక సమర్పించాయి. ప్రధానంగా ప్రైవేట్ స్కూళ్లలో టీచర్లకు సీసీఈ విధానంపై అవగాహన లేదని.. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రైవేట్ పాఠశాలల్లో ఈ విధానం అమలు కావడం లేదని.. పట్టణ ప్రాంతాల్లో పేరొందిన స్కూళ్లలో మాత్రమే సక్రమంగా అమలవుతోందని పేర్కొన్నారు. బృందాలు సమర్పించిన నివేదిక ప్రకారం..
సంగ్రహణాత్మక మూల్యాంకనంలో డీసీఈబీ ప్రశ్నపత్రాలతో పరీక్షలు నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాలు వంద శాతం ఈ ప్రశ్నపత్రాలతోనే నిర్వహించాయి. అన్ని సబ్జెక్టుల జవాబులు దిద్దినప్పటికీ.. సూచికల ప్రకారం జవాబు పత్రాలను మూల్యాంకనం చేసినవి 60 శాతం పాఠశాలలు మాత్రమే.
పరీక్ష ఫలితాలపై తల్లిదండ్రులతో చర్చించడం, క్యుములేటివ్ రికార్డులు అందజేసే విధానాన్ని ప్రభుత్వ పాఠశాలలు 80 శాతం పాటించగా, ప్రైవేట్ స్కూళ్లు 50 శాతం మాత్రమే పాటిస్తున్నాయి.
వంద శాతం ప్రభుత్వ పాఠశాలలు సమ్మేటివ్ పరీక్షల వివరాలను సీసీఈ రిజిస్టర్‌లో నమోదు చేస్తుండగా.. 40 శాతం ప్రైవేటు పాఠశాలల్లో మాత్రమే ఇది అమలవుతోంది.
భాషా సబ్జెక్టుల్లో పుస్తక సమీక్షలు నిర్వహించి మార్కులు కేటాయించడం ప్రభుత్వ పాఠశాలల్లో 60 శాతం అమలవుతుండగా.. ప్రైవేటు పాఠశాలల్లో 30 శాతం మాత్రమే అమలవుతోంది. గ్రంథాలయ పుస్తకాలు పంపిణీ చేస్తున్నట్లు కొన్ని ప్రైవేట్ స్కూళ్లలో మాత్రమే గమనించారు.
విజ్ఞాన శాస్త్ర ప్రయోగాలు, రికార్డులు, నివేదికలు 70 శాతం ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగ్గానే ఉన్నాయి. 30 శాతం ప్రైవేట్ పాఠశాలల్లో మాత్రమే ప్రయోగాలు చేయిస్తున్నారు.
గణిత శాస్త్రంలో నూతన సమస్యలు రూపొందించడం ఏ పాఠశాలల్లోనూ సక్రమంగా జరగడం లేదు. దీనికి ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువ మంది విద్యార్థులు తెలివైన వారు లేకపోవడం ఒక కారణం కాగా, ప్రైవేట్ పాఠశాలల్లో తెలివైన విద్యార్థులు ఉన్నప్పటికీ, వాటిని రూపొందించడంలో ఉపాధ్యాయులకు అవగాహన లేనట్లు కనిపిస్తోంది.
పిల్లలు ఎక్కువ శాతం గైడ్లు చూసి రాస్తున్నారు. ఇది ప్రైవేట్ పాఠశాలల్లో 80 శాతం ఉంది.
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 50 శాతం వరకు సృజనాత్మకంగా ప్రాజెక్టులు రూపొందిస్తున్నారు. వాటి గురించి వివరిస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఎక్కువగా ‘ఇంటర్నెట్’ పై ఆధారపడుతూ, కట్ అండ్ పేస్ట్ పద్ధతిలో ప్రాజెక్టులు చేస్తున్నారు. ప్రాజెక్టు రికార్డులను 80 శాతం పాఠశాలల్లో బాగా డెకరేట్ చేస్తున్నారు. మిగిలిన 20 శా తం పాఠశాలల్లో నామమాత్రంగా లేవు.
90 శాతం ప్రభుత్వ పాఠశాలలు డిజిటల్ పాఠాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నాయి. డీజీ పాఠాలను మన టీవీ, డీజీ కంటెంట్‌ను ప్రొజెక్టర్ల ద్వారా చూపిస్తున్నారు. దీనికి రికార్డులు 50 శాతం పాఠశాలలు మాత్రమే నిర్వహిస్తున్నాయి. ‘డీజీ స్కూల్స్’ పేర్లతో ఉన్న ప్రైవేట్ పాఠశాలలో డీజీ తరగతులు లేకపోవడం శోచనీయం. 20 శాతం పాఠశాలల్లో డీజీ పాఠాలు బోధిస్తునప్పటికీ వాటికి సంబంధించిన ఇతర సీడీలు మాత్రమే చూపిస్తున్నారు.
సహపాఠ్య కార్యక్రమాలకు బోధనాభ్యసన ప్రక్రియలు 80 శాతం ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహిస్తున్నా.. రికార్డులు లేవు. 20 శాతం ప్రైవేట్ పాఠశాలల్లో మాత్రమే సహ పాఠ్య కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. మిగిలిన పాఠశాలల్లో సబ్జెక్టులు మాత్రమే చదివిస్తున్నారు. సహపాఠ్య కార్యక్రమాలు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు.
తల్లిదండ్రుల సమావేశాలు ఏర్పాటు చేయడంలో.. సమ్మేటివ్–1 సమాధాన పత్రాలు తల్లిదండ్రులకు చేరవేయడంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు వెనుకబడ్డాయి.
ప్రభుత్వ ఉపాధ్యాయులతో పోలిస్తే ప్రైవేట్ టీచర్లు సీసీఈ శిక్షణలకు హాజరుకాకపోవడం.. హాజరైనా అమలుపై అంతగా శ్రద్ధ చూపకపోవడం జరుగుతోంది. ప్రైవేట్ యాజమాన్యాలు వారికి స్వేచ్ఛనివ్వకపోవడమే ఇందుకు కారణం.
ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలతో పోలిస్తే సీసీఈ అమలుతోపాటు మిగిలిన అన్ని విషయాల్లోనూ రెసిడెన్షియల్ పాఠశాలలు టాప్‌లోనే ఉన్నాయి. కనీస సామర్థ్యం విషయంలో ప్రభుత్వ పాఠశాలలు అధిక సంఖ్యలో వెనుకబడ్డాయి.
తిలోదకాలు
Published Thu, Feb 16 2017 1:05 AM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM
Advertisement