సాక్షి, కడప : నిబంధనలు పాటించని ప్రైవేటు పాఠశాలల అనుమతి ఇక రద్దు కానుంది. రాష్ట్ర ప్ర భుత్వం ఇటువంటి పాఠశాలలపై కొరఢా ఝు లి పించడానికి చర్యలు తీసుకుంటోంది. ఇందుకుగాను జిల్లా స్థాయిలో కమిటీ ఏర్పాటు చేయనున్నారు. ఇందులో డీఈవో, డీటీసీ లాంటి అధికారులు సభ్యులుగా ఉంటూ పాఠశాలల్లో వసతులు పరిశీలించనున్నారు. వారిచ్చిన నివేదిక ఆధారంగా అనుమతి పునరుద్ధరించాలా? వద్దా? అన్నది నిర్ణయించి చర్యలు తీసుకోనున్నారు. ఇలా ప్రైవేటు బడుల్లో వసతులను తరగతులు ప్రారంభం కాక ముందే పరిశీలించడానికి విద్యాశాఖ కొన్ని నిబంధనలు తయారు చేయనుంది. ఈ మేరకు ఈనెల 24న సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.
జిల్లాలో మొత్తం ప్రైవేటు పాఠశాలలు 1151 ఉన్నాయి. వీటిల్లో 1,99,524 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రీ ప్రైమరీ, ప్రైమరీ, ఉన్నత పాఠశాలలు ఇక్కడ నిర్వహిస్తున్నారు. వీరంతా ప్రభుత్వ నిబంధనల మేరకు గదులు, ఇతర సదుపాయాలు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది. ఎక్కువ పాఠశాలలు కనీస సదుపాయాలు లేకుండానే నడిపిస్తున్నారు. వీరిలో కొందరికి రాజకీయ పలుకుబడి ఉండడంతో నెట్టుకొస్తున్నారు. ఇలాంటి వాటి నిర్వహణ ఇక కష్టం కానుంది. జిల్లాస్థాయి కమిటీ పరిశీలన తర్వాత సదుపాయాలపై నివేదిక ఇస్తారు. ఈ నివేదిక ఆధారంగా బడులకు అనుమతి పునరుద్ధరణ చేస్తారు. ప్రైవేటు పాఠశాలలు నిర్వహణ కోసం గదులు, మరుగుదొడ్లు, ప్రాంగణం, నిపుణులైన ఉపాధ్యాయులు ఉండాలి. చాలా వరకు పాఠశాలలు అద్దె భవనాల్లో నడిపిస్తున్నారు. అక్కడ గదుల కొరత ఉంది. ఇరుకు గదుల్లో తరగతులు నిర్వహిస్తున్నారు. ఎక్కువ పాఠశాలల్లో మరుగుదొడ్లు ఉండటం లేదు. ఒకటో రెండో మరుగుదొడ్లు ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంటున్నారు. సొంత భవనాలున్న బడులకు సైతం మౌలిక వసతులు లేవు. క్రీడా ప్రాంగణం లేని బడులు 80 శాతం వరకు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. పిల్లలను చదువుల యంత్రాలుగా చేస్తున్న సంస్థలు ఎక్కువగా ఉన్నాయి.
అగ్నిమాపక శాఖ అనుమతి తప్పనిసరి..
బహుళ అంతస్తులున్న భవనాల్లో ప్రమాదాల సమయంలో రక్షణ చర్యలు కోసం ప్రతి పాఠశాల ప్రత్యేక మెట్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇందుకు గాను అగ్నిమాపక శాఖ ఇచ్చే ధ్రువీకరణ తీసుకోవాల్సి ఉంది. అదే విధంగా శానిటేషన్ ధ్రువీకరణ స్థానిక సంస్థల ద్వారా తప్పనిసరిగా తీసుకోవాలి. ఇవన్ని లేని పాఠశాలలు జిల్లాలో ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. అలాగే పాఠశాల ఆడిట్ క్రమం తప్పకుండా చేయించా లి. వీటిని ఏటా సంబంధిత విద్యాశాఖకు నివేదించాలి. వచ్చే ఆదాయంలో 10 శాతం మాత్రమే యాజమాన్యం తీసుకోవాల్సి ఉంది. మిగిలిన సొమ్ము పాఠశాల మౌలిక వసతులు, ఉపాధ్యాయులు జీతభత్యాలకు ఖర్చు చేయాల్సి ఉంది. ఉపాధ్యాయులకు అరకొర జీతాలు ఇస్తున్న సంస్థలు ఎక్కువే ఉన్నాయి. అలాంటి యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటారు.
నిపుణులు తక్కువే..
ఇక్కడ పనిచేస్తున్న వారిలో ఎక్కువ బీఈడీ చేసిన వారు ఉండటం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్న మాట. ఇలాంటి ఉపాధ్యాయుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంది. వారి వివరాలకు ఆధార్‌కు అనుసంధానం చేస్తారు. అర్హత ఉన్న ఉపాధ్యాయులంతా టెట్ పాసై ఉండాలి. ధ్రువపత్రాలు ఒకరివి చదువులు చెప్పేది వేరొకరు ఉండరాదు. ఇవన్ని పరిశీలన చేయనున్నారు. ఎక్కువ పాఠశాలల్లో ధ్రువీకరణ పత్రాలకు పనిచేస్తున్న వారికి తేడా ఉంటోంది. తక్కువ మొత్తంలో నగదు చెల్లించి వీరిని చదువుల కోసం తీసుకుంటున్నారు. ఇలాంటి వారికి ఇక చెక్ పడనుంది.
Comments
Please login to add a commentAdd a comment