విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలొద్దు | Minister Adimulapu Suresh Comments Over Private Aided School Issue In YSR District | Sakshi
Sakshi News home page

విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలొద్దు

Published Wed, Oct 27 2021 2:49 PM | Last Updated on Thu, Oct 28 2021 3:41 AM

Minister Adimulapu Suresh Comments Over Private Aided School Issue In YSR District - Sakshi

మంత్రి ఆదిమూలపు సురేష్‌ (ఫైల్‌)

బద్వేలు అర్బన్‌: రాజకీయ ప్రయోజనాల కోసం విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడొద్దని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ టీడీపీపై మండిపడ్డారు. బుధవారం ఆయన బద్వేలులో విలేకరులతో మాట్లాడారు. ఎయిడెడ్‌ విద్యా సంస్థలపై ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ టీడీపీకి తోడు ఓ వర్గం మీడియా దుష్ప్రచారం చేస్తుండటం భావ్యం కాదన్నారు. ప్రైవేటు యాజమాన్యం కింద నడిచే విద్యా సంస్థల పనితీరుపై సీఎం వైఎస్‌ జగన్‌ ఒక కమిటీ వేసి ఆ కమిటీకి కొన్ని బాధ్యతలు అప్పగించారన్నారు. ప్రైవేటు, ఎయిడెడ్‌ స్కూళ్లు, జూనియర్, డిగ్రీ కాలేజీలు ఏ విధంగా పని చేస్తున్నాయి.. టీచర్, విద్యార్థి నిష్పత్తి ఎలా ఉంది.. ఫలితాలు ఎలా వస్తున్నాయి.. నాణ్యతా ప్రమాణాలు పెంచడానికి, వాటిలో మౌలిక సదుపాయాల కల్పనకు ఏ విధమైన చర్యలు తీసుకోవాలి.. తదితర విషయాల్లో సూచనలివ్వాలని కమిటీని ఆదేశించారన్నారు. ఆ కమిటీ నివేదిక ఆధారంగా నిర్ణయాలు తీసుకున్నామన్నారు. మంత్రి ఇంకా ఏమన్నారంటే..

ఎయిడెడ్‌ స్కూళ్ల పరిస్థితి దారుణం
► ఎయిడెడ్‌ స్కూళ్లు దాదాపుగా నిర్వీర్యమయ్యాయి. కొన్ని చోట్ల టీచర్లకు, యాజమాన్యం మధ్య సఖ్యత లేదు. చాలా స్కూళ్లలో మౌలిక వసతులు లేవు. అందువల్ల విద్యార్థులు ఆ స్కూళ్లలో చేరడం లేదు.   
► ఈ పరిస్థితిలో యాజమాన్యాలు స్కూళ్లను ప్రభుత్వానికి అప్పగిస్తే అవసరమైన మేరకు టీచర్లను నియమించడంతో పాటు నాడు–నేడు ద్వారా అభివృద్ధి చేయవచ్చని నిర్ణయించాం. 
► అయితే ఎయిడెడ్‌ విద్యా సంస్థలను ప్రభుత్వంలో విలీనం చేస్తే స్కూళ్లు మూత పడిపోతాయని ప్రతిపక్షం, ఓ వర్గం మీడియా పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నాయి. విద్యార్థులు, తల్లిదండ్రులను రెచ్చగొడుతున్నాయి. వాస్తవానికి స్కూళ్లు అప్పగించాలని ప్రభుత్వం ఏ ఒక్క స్కూలు యాజమాన్యాన్ని బలవంత పెట్టడం లేదు. 

ప్రైవేటు విద్యా సంస్థలుగా నడుపుకోవచ్చు
► ఎయిడెడ్‌ యాజమాన్యాలు తమకు గ్రాంట్‌ అవసరం లేదని, టీచర్లను ప్రభుత్వానికి సరెండర్‌ చేసి ప్రైవేటు విద్యా సంస్థలుగా నడుపుకుంటామని చెబితే ఎలాంటి అభ్యంతరం లేదు. 
► రాష్ట్రంలో ఉన్న సుమారు 137 పైచిలుకు డిగ్రీ కాలేజీల్లో 7 డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు స్టాఫ్‌తో పాటు వాటికి సంబంధించిన ఆస్తులు ఇస్తామని రాత పూర్వకంగా తెలిపారు. 124 డిగ్రీ కాలేజీలు స్టాఫ్‌ను మాత్రమే సరెండర్‌ చేస్తామని, ఆస్తులను తామే ఉంచుకుని ప్రైవేటు కళాశాలలుగా నడుపుకుంటామని తెలిపాయి. మొత్తంగా 93 శాతం డిగ్రీ కాలేజీలు విల్లింగ్‌నెస్‌ ఇచ్చాయి. 
► 122 ఎయిడెడ్‌ జూనియర్‌ కళాశాలలు ఉంటే 5 జూనియర్‌ కాలేజీలు ఆస్తులతో, 103 కాలేజీలు కేవలం స్టాఫ్‌ను ఇస్తామని తెలిపాయి. 
► 1,988 స్కూళ్లకు గాను 1200 స్కూళ్ల యాజమాన్యాలు స్టాఫ్‌ను ప్రభుత్వానికి అప్పగిస్తామని రాత పూర్వకంగా తెలిపాయి. 88 స్కూళ్లు ఆస్తులతో పాటు స్టాఫ్‌ను ఇస్తున్నట్లు ఒప్పుకున్నాయి. 
► విశాఖలో సెయింట్‌పీటర్స్, కాకినాడలో సెయింట్‌ యాన్స్‌ స్కూళ్ల యాజమాన్యాలు తాము స్కూళ్లు మూసి వేస్తున్నామని చెప్పాయి. కాబట్టి మీ పిల్లలను వేరే స్కూళ్లలో చేర్పించుకోండని చెప్పడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఎవరైనా ఎయిడెడ్‌ పాఠశాలల యాజమాన్యం విల్లింగ్‌నెస్‌ ఇచ్చినప్పటికీ, తిరిగి విత్‌డ్రా చేసుకుంటామంటే వారి ఆప్షన్‌ను నిరభ్యంతరంగా వెనక్కి తీసుకోవచ్చు. 
► రాష్ట్రంలో ఎయిడెడ్‌ స్కూళ్ల దుస్థితికి గత టీడీపీ ప్రభుత్వమే కారణం.     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement