ప్రైవేటు బడుల్లో భద్రతెంత? | Private Schools Not Comply With The Minimum Requirements | Sakshi
Sakshi News home page

ప్రైవేటు బడుల్లో భద్రతెంత?

Published Tue, Jul 26 2022 1:13 PM | Last Updated on Tue, Jul 26 2022 1:17 PM

Private Schools Not Comply With The Minimum Requirements - Sakshi

కడప ఎడ్యుకేషన్‌ : ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి వేలకు వేలు ఫీజులు దండుకునే విషయంలో ఉన్నంత శ్రద్ధ వారికి మౌలిక వసతులను కల్పించడంలో లేదనే చెప్పాలి. విద్యార్థులకు ఆటపాటలటుంచితే మలమూత్రాలను కూడా ప్రశాంతంగా విసర్జించని పరిస్థితి దాపురించింది.  ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల యాజమాన్యాలు విద్యకు మినహా ఆటలకు, విద్యార్థుల భద్రతకు ఏమాత్రం ప్రాధాన్యం  ఇవ్వడం లేదనే ఆరోపణలు  మెండుగా ఉన్నాయి.

అపార్టుమెంట్లు, ఇరుకు గదుల్లో తరగతులను నిర్వహిస్తూ విద్యార్థుల భద్రతను గాలిలో దీపంలాగా ఉంచుతున్నారు. జిల్లాలో చాలా ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలలను ఇరుకు గదులు, వ్యాపార సంస్థలు, అపార్టుమెంట్లలో నడుపుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 11 వందలకు పైగా ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలలున్నాయి. వీటిలో అధికశాతం ఇరుకుగదుల్లోనే తరగతులను నిర్వహిస్తున్నారు. ఏదైనా సమస్య రానంత వరకూ బాగానే ఉంటుంది. ఏదైనా జరగరాని  ప్రమాదం జరిగితే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని విద్యావేత్తలు  విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

నిబంధనలు గాలికి
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి పాఠశాల ఏర్పాటుకు ముందు అగ్నిమాపకశాఖ నుంచి ఫైర్‌ సర్టిఫికెట్‌ పొందాలి. సంబంధితశాఖ అధికారులు భవనం అనుకూలతను పరిశీలించి అనువుగా ఉంటేనే ధ్రువీకరించాలి. కానీ  కొన్ని నిబంధనలకు అనుగుణంగా లేకపోయినా రాజకీయ ఒత్తిళ్లు, పలుకుబడితో అటు, ఇటుగా ఉన్నా అనుమతులు ఇచ్చారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. తరువాత రెన్యువల్‌ సమయంలో కూడా కేవలం పేపర్ల ఆధారంగానే సర్టిఫై చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. దీని వెనుక భారీ మొత్తంలో డబ్బులు చేతులు మారుతున్నట్లు ఆరోపణలు లేకపోలేదు. ఇక విద్యాశాఖ అధికారులది కూడా అదే పరిస్థితి అని పలువురు పెదవి విరుస్తున్నారు. పాఠశాలలను పరిశీలించకుండానే అనుమతులు, రెన్యువల్స్‌కు గ్రీన్‌సిగ్నల్స్‌ ఇచ్చేస్తున్నట్లు తెలుస్తోంది. 

కనీస వసతులు కరువు 
కొన్ని కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి వేలకు వేలు ఫీజులు దండుకుంటున్నా వారికి కావాల్సిన కనీస మౌలిక వసతులను కల్పించడం లేదనే విమర్శలు మెండుగా ఉన్నాయి. విద్యార్థులకు తాగేందుకు సరిపడా మంచినీటిని కూడా అందుబాటులో ఉంచడం లేదనే విమర్శలున్నాయి. వీటితోపాటు విద్యార్థుల సంఖ్యకు సరిపడా మరుగుదొడ్లు గానీ మూత్రశాలలు కానీ ఉండటం లేదు. సహజంగా భార్య,భర్తతోపాటు ఇద్దరు పిల్లలున్న ఓ కుంటుంబం సింగిల్‌ బాత్‌రూంతో ఇబ్బందులు పడుతున్నారు. అలాంటిది వందల మంది విద్యార్థులున్న పాఠశాలల పరిస్థితిని గమనిస్తే దారుణంగా ఉంది.

కడపలో కొన్ని కార్పొరేట్, ప్రైవేటు స్కూళ్లలో 300 మొదలుకుని వెయ్యికి పైగా విద్యార్థుల సంఖ్య ఉన్న పాఠశాలలున్నాయి. ఆ పాఠశాలల్లో కూడా నాలుగైదు మరుగుదొడ్లతోపాటు తొమ్మిది పది మూత్రశాలలుంటాయి. పాఠశాల విరామ  సమయంలో వాటి ముందు పిల్లలు క్యూలో నిల్చోవాల్సిన పరిస్థితి నెలకొంటోందని పలువురు వాపోతున్నారు.  ఇక  అమ్మాయిల ఇబ్బందులు వర్ణనాతీతం. కొంతమంది బాలికలు బాత్‌రూముల సమస్యతో తగినంత నీరుతాగడం మానేçస్తున్నట్లు కూడా తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. ఇది కొన్ని రుగ్మతలకు దారితీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.  సంబంధిత అధికారులు పాఠశాలల్లో మౌలిక వసతులపై స్పందించాల్సిన అవసరం ఉంది.   

పరిశీలిస్తా
అపార్టుమెంట్లు, ఇరుకైన సముదాయాల్లో పాఠశాలలను నిర్వహిస్తున్నట్లు మా దృష్టికి వస్తే పరిశీలిస్తాం. నిబంధనలు పాటించకుండా పాఠశాలలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరు కూడా పాఠశాలలను నిర్వహించకూడదు.  
– చెప్పలి దేవరాజు, జిల్లా విద్యాశాఖ అధికారి  

ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులున్నా..
ప్రభుత్వ పాఠశాలల్లో విశాలమైన గదులు, ఆటస్థలంతోపాటు, మంచినీటి సౌకర్యం అలాగే ఆధునిక వసతులతో మరుగుదొడ్లు,  పరిమితి గంటల్లో బోధన ఉంటుంది. దీంతోపాటు ఆంగ్లమాధ్యమాన్ని కూడా ప్రవేశ పెట్టింది. అయినా చాలామంది తల్లిదండ్రులు ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలలనే  ఆశ్రయిస్తున్నారు. అదే అదనుగా  ప్రైవేటు, కార్పొరేట్‌ యాజమాన్యాలు వేలకు వేలు ఫీజులు దండుకుంటున్నారు. ఉన్నత స్థానాల్లో ఉన్న చాలామంది ఈ పాఠశాలల్లో చదివిన వారేనన్న విషయాన్ని గుర్తించాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement