సాక్షి, అమరావతి బ్యూరో : ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు.. ‘మా స్కూల్‌లో చదివితే ఐఐటీ గ్యారెంటీ, నీట్ ర్యాంక్ పక్కా, సివిల్స్‌కు సెలక్ట్ అయినట్టే’.. ఇలా ఎన్నెన్నో మాటలు చెబుతాయి. మరి మౌలిక వసతుల మాటేమిటంటే బిక్కముఖం వేయాల్సిందే. ర్యాంకులు, మార్కుల మాయలో పడ్డ తల్లిదండ్రులు వాటి గురించి ఆలోచించే తీరికేది. వందల కొద్ది అడ్మిషన్లు తీసుకొని రూ.లక్షలు వెనకేసుకుంటున్న యాజమాన్యాలు పిల్లలకు సరిపడా మరుగుదొడ్డు ఉన్నాయా? లేవా? అన్న స్పృహను కోల్పోతున్నాయి. పట్టించుకోవాల్సిన పేరెంట్స్ అయినా చదువు ముఖ్యం గాని వాటితో పనేంటిలే అన్న ధోరణిలో పడిపోయారు. వీళ్ల నిర్లక్ష్యం ఖరీదు విద్యార్థుల నిండు జీవితాలు. చాలీచాలని, అపరిశుభ్ర మరుగుదొడ్లను వినియోగించి అనారోగ్యాల పాలవుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడే సర్దుకుపోవాల్సి వస్తోంది.
చట్టం ఏమి చెబుతోంది..
విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రతి 60 మంది విద్యార్థులకు గాను బాలికలకు ఒక యూనిట్, బాలురకు ఒక యూనిట్ టాయిలెట్‌లను ప్రత్యేకంగా కేటాయించాలి. ఇక్కడ ఒక యూనిట్ అనగా నాలుగు యూరినల్, రెండు టాయిలెట్ బేసిన్‌లు. అయితే విజయవాడ నగరంలోని చాలా వరకు ప్రైవేట్ పాఠశాలల్లో నామమాత్రంగా ఒకటో, రెండో యూనిట్లు మాత్రమే ఏర్పాటు చేశారు. అపార్ట్‌మెంట్ తరహాలోని పాఠశాలల్లో ఈ పరిస్థితి మరీ దారుణం. ఒక్కో ఫ్లాట్‌లో కేవలం రెండు, మూడు టాయిలెట్స్ ఉంటుండగా విద్యార్థులు మాత్రం వందల్లో ఉంటున్నారు. లాభాపేక్షతోయాజమాన్యాలు నిబంధనలకు నీళ్లోదులుతున్నారు.
సర్దుకోవాల్సిందే..
రెండు పీరియడ్లు అయిన తర్వాత యూరిన్ కోసం 10 నుంచి 15 నిమిషాల వరకు ఇంటర్వెల్ ఇస్తారు. రోజుకు రెండుసార్లు ఇంటర్వెల్స్ ఉంటాయి. ఈ కొంత సమయంలోనే వందల మంది పిల్లలు యూరిన్, టాయిలెట్‌కు వెళ్లాల్సిఉంటుంది. టాయిలెట్‌కు వెళ్లేందుకు క్యూలో వేచి ఉండాల్సి వస్తోంది. మరికొన్ని పాఠశాలల్లో టాయిలెట్‌ల నిర్వహణ సరిగా లేకపోవడం, అపరిశుభ్రంగా ఉండడంతో టాయిలెట్‌కు వెళ్లడానికి అయిష్టత చూపుతున్నారు. కొందరు పిల్లలు టాయిలెట్, యూరిన్‌కు వెళ్లకుండా బిగబట్టుకుని ఇంటికి వెళ్లిన తర్వాత తీర్చుకుంటున్నారు. ఇంకొందరు పిల్లలు నీళ్లు తాగితే యూరిన్ వస్తుందని పాఠశాల సమయంలో నీళ్లు తాగడాన్ని మానేస్తున్నారు.
రోగాలు తప్పవు..
పిల్లలు ఇలా చేయడం వల్ల రోగాల బారిన పడాల్సివస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సకాలంలో టాయిలెట్‌కు వెళ్లాలని సూచిస్తున్నారు. టాయిలెట్‌కు పోకుండా బిగబట్టడం వల్ల మలబద్ధకం, ఒకరి నుంచి మరొకరికి యూరిన్ ఇన్ఫెక్షన్‌లు సోకుతాయని చెబుతున్నారు. నిర్లక్ష్యం వహిస్తే కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంటుందని అంటున్నారు. పాఠశాలల్లో తప్పనిసరిగా విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టాయిలెట్‌లు ఉండాలని, అలాగే వాటిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని వైద్యులు సలహా ఇస్తున్నారు.
కిడ్నీలపై ప్రభావం..
సకాలంలో మూత్ర విసర్జన చేయకుంటే యూరిన్ బ్లాడర్‌పై ఒత్తిడి పెరుగుతుంది. ఇది అనర్థాలకు దారితీస్తుంది. అపరిశుభ్రమైన టాయిలెట్స్‌ను ఉపయోగించడం వల్ల ఇన్ఫెక్షన్లు వస్తాయి. అప్పటికే చిన్నచిన్న కిడ్నీ సమస్యలు ఉన్న పిల్లలకు ఇలాంటి సంఘటనలతో కిడ్నీ వ్యాధి తీవ్రత పెరిగే అవకాశం ఉంది. యూరిన్ వెళ్లాల్సి వస్తుందని కొందరు పిల్లలు నీళ్లు తాగడం మానేస్తున్నారు ఇది చాలా తప్పు. ప్రైమరీ స్థాయి పిల్లలకు సకాలంలో టాయిలెట్ రాదు.. వచ్చినప్పుడు వెళ్లాలి. బిగబడితే మలబద్ధకం వస్తుంది. ఆహారం సరిగ్గా తీసుకోలేరు. యాజమాన్యాలు తగినన్ని టాయిలెట్స్ ఏర్పాటుచేసి, శుభ్రతను పాటించాలి.
– డా. కిరణ్‌కుమార్, యూరాలజిస్ట్, విజయవాడ
Comments
Please login to add a commentAdd a comment