
సాక్షి, అమరావతి: బడుగు, బలహీన వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ కుటుంబాలకు చెందిన అత్యధిక శాతం మంది పిల్లలకు ప్రభుత్వ బడులే అండగా నిలుస్తున్నాయి. వీరిలో అత్యధిక శాతం మందివి నిరుపేద, సామాన్య, మధ్యతరగతి కుటుంబాలే కావడంతో తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్లలోని ఫీజులు చెల్లించే స్థోమత లేక ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. ఇప్పటివరకు ఆంగ్ల మాధ్యమం ప్రభుత్వ స్కూళ్లలో లేకపోవడంతో స్థోమత ఉన్న కుటుంబాలు తమ పిల్లలను ప్రైవేట్ స్కూళ్లలో చేర్పిస్తున్నారు. వీరిలో అత్యధికం ఓసీలే. వారితో పాటు కొంతమంది సామాన్యులు కూడా అప్పోసప్పో చేసి తమ పిల్లలనూ ప్రైవేటు పాఠశాలలకు పంపిస్తున్నారు.
అగ్రవర్ణాల్లోని నిరుపేదలూ తమ పిల్లలను ప్రభుత్వ స్కూళ్లకే పంపిస్తున్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2019–20లో రాష్ట్రంలోని మొత్తం స్కూలు విద్యార్థుల్లో ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లల్లో 56 శాతం, ప్రైవేట్ స్కూళ్లల్లో 44 శాతం మంది చదువుతున్నారు. ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు దళారులను నియమించి ప్రభుత్వ స్కూళ్లలోని విద్యార్థుల తల్లిదండ్రులపై ఒత్తిడి తెచ్చి బలవంతంగా తమ స్కూళ్లలో చేర్పించుకుంటున్నారు. 2020–21 నుంచి ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడుతుండడంతో పాటు, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యాకానుక వంటి కార్యక్రమాలు, టీచర్లకు ఆంగ్ల మాధ్యమ బోధనలో శిక్షణనివ్వడం వంటి చర్యలతో ప్రభుత్వ స్కూళ్లలో వచ్చే విద్యా సంవత్సరంలో చేరికలు మరింత పెరుగుతాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
‘ప్రైవేట్’లో కమీషన్లు..అడ్మిషన్లు
► ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు పిల్లలను, వారి తల్లిదండ్రులను ఆకర్షించడానికి అనేక రకాల ఎత్తుగడలు వేస్తున్నాయి.
► కొన్ని స్కూళ్లు దళారీలను నియమించుకుని కమీషన్లు ముట్టచెబుతున్నాయి.
► అంతేకాక.. తమ సంస్థల్లో పనిచేసే బోధనా సిబ్బందికి టార్గెట్లు పెట్టి మరీ విద్యార్థులను చేర్పిస్తున్నాయి.
► టార్గెట్లు పూర్తిచేయకపోతే ఉద్యోగం ఉండదని హెచ్చరిస్తున్నాయి.
మాకు అన్ని సదుపాయాలూ కల్పిస్తున్నారు
నేను 9వ తరగతి చదువుతున్నాను. మా స్కూలులో ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పిస్తోంది. చాలా పేద గిరిజన కుటుంబం నుంచి వచ్చిన నాకు ప్రభుత్వ పాఠశాలే అన్ని విధాలుగా ఆదుకుంటోంది. అమ్మఒడి కింద డబ్బులు అందించడంతో పాటు స్కూలులో పుస్తకాలు, ఇతర పరికరాలు అందిస్తూ మంచిగా చదువులు చెప్పిస్తున్నారు.
– రూపేంద్ర నాయక్, 9వ తరగతి, మిట్టపల్లి జడ్పీ హైస్కూల్, ఓడీ చెరువు మండలం ఇ.గొల్లపల్లి గ్రామం, అనంతపురం జిల్లా
ఆంగ్లంలోనే మాకు పాఠాలు
నేను 7వ తరగతి చదువుతున్నాను. ఇక్కడ మాకు ఇంగ్లీషు మీడియంలోనే పాఠాలు చెబుతున్నారు. ప్రైవేటు స్కూలు కన్నా మంచిగా, సులభంగా అర్ధం చేసుకునేలా పాఠాలు చెబుతున్నారు. అమ్మఒడి పథకంతో పాటు పుస్తకాలు, ఇతర వస్తువులు కూడా స్కూలులో ఇస్తున్నారు. చదువు ఒక్కటే కాకుండా ఆటలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటున్నాయి.
– సత్యగంగాధర్,కేఏఎన్ మున్సిపల్ హైస్కూల్,సాలూరు, విజయనగరం జిల్లా
Comments
Please login to add a commentAdd a comment